పెళ్లి కారును ఢీకొన్న లారీ
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:55 AM
జాతీయ రహదారిపై నాచుగుంట వద్ద పెళ్లి కారును లారీ ఢీకొంది.

పాలకొల్లు నుంచి ఏలూరులో వివాహ వేదికకు వెళుతున్న వరుడు
నాచుగుంట వద్ద ప్రమాదం
నలుగురికి గాయాలు
అతి స్వల్ప గాయాలతో బయటపడి మూడు ముళ్లు వేసిన వరుడు
ఉంగుటూరు, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై నాచుగుంట వద్ద పెళ్లి కారును లారీ ఢీకొంది. కారులో ఉన్న వరుడికి స్వల్ప గాయాలు కాగా మరో నలుగురి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఉన్నవారు ఏలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుం డగా స్వల్ప గాయాలైన వరుడు ముహూర్త సమ యానికే పెళ్లి పీటలపై వధవు మెడలో మూడు ముళ్లు వేశారు. ముహూర్త బలంతో వరుడు ప్రమాదం నుంచి బయటపడి శుభం జరిగిందని బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
పాలకొల్లుకు చెందిన గంటా నవీన్‌కు ఏలూ రుకు చెందిన యువతితో శుక్రవారం రాత్రి వివాహం జరగనుంది. పెళ్లి కొడుకు, బంధువులు ప్రయాణిస్తున్న కారును నాచుగుంట వద్ద యూ టర్న్ తీసుకుంటున్న లారీ అదుపుతప్పి ఢీకొంది. కారులో ఉన్నవారిలో జి.పద్మావతి, కె.నాగేశ్వరరావు, నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. వారిని తొలుత హైవే అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెళ్లి కుమారుడు గంటా నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయాలైన వారిలో ఇద్దరిని ఏలూరు లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చేబ్రోలు ఎస్‌ఐ ఎం.సూర్యభగవాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన సమయంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రమాదం జరిగిన వాహనాన్ని వేరొక చోటికి తరలించారు.