Police Investigation: వైఛీపీ సెల్ఫ్‌గోల్!
ABN , Publish Date - Feb 27 , 2025 | 03:10 AM
వంశీని అరెస్టు చేసిన దగ్గర నుంచి ఆయనకు మద్దతు పలికేందుకు ప్రయత్నించడం.. అది మిస్‌ఫైర్ కావడం సాధారణ వ్యవహారంగా మారిపోయింది.

వంశీ ఉదంతంపై ‘ఎక్స్’లో వీడియో
విశాఖలో స్వేచ్ఛగా షాపింగ్
చేస్తున్న సత్యవర్ధన్ అంటూ పోస్టు
కిడ్నాప్ అయినట్టు ఎలా చెబుతారంటూ ప్రశ్న
కానీ, పోలీస్ వాదననే సమర్థించిన వీడియో
ఆ వీడియోలో సత్యవర్ధన్ పక్కన ఏ3, ఏ9 నిందితులు
అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో వైసీపీ పదే పదే సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది. వంశీని అరెస్టు చేసిన దగ్గర నుంచి ఆయనకు మద్దతు పలికేందుకు ప్రయత్నించడం.. అది మిస్‌ఫైర్ కావడం సాధారణ వ్యవహారంగా మారిపోయింది. కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న వంశీకి సంబంధించి మరో బలమైన ఆధారాన్ని వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ‘సత్యమేవ జయతే’ అనే క్యాప్షన్‌తో పెట్టిన ఈ పోస్టు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసుల వాదనను బలపర్చేదిలా ఉండటం గమనార్హం. తప్పుడు కేసులు అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని న్యాయవ్యవస్థలను సీఎం చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారంటూ వైసీపీ...చివరికి తానే సెల్ఫ్‌గోల్ వేసుకుంది. వంశీని పరామర్శించేందుకు ఈ నెల 18న జైలుకు మాజీ సీఎం జగన్ వెళ్లారు. వంశీపై తప్పుడు కేసు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి తప్పుడు వాంగ్మూలం ఇప్పించిన వంశీపై కేసు పెట్టడం తప్పుడు కేసు ఎలా అవుతుందని అప్పట్లోనే సామాజిక మాధ్యమాల్లో జగన్ విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. తాజాగా మరో వీడియో విడుదల చేసిన వైసీపీ...అడ్డంగా బుక్కయింది.
ఆ వీడియోలో ఏముంది?
వైసీపీ బుధవారం ‘ఎక్స్‘లో ఓ పోస్టు చేసి, దానికి సంబంధించిన వివరాలను పేర్కొంది. ‘ఈ వీడియోలో బ్లూషర్టు వేసుకున్న వ్యక్తి సత్యవర్ధన్. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారని ఏపీ పోలీసులు చెబుతున్న వ్యక్తి ఇతనే.’నని పేర్కొంది. ఆ వీడియోలో సత్యవర్ధన్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి షాపింగ్ చేస్తున్నట్లు ఉంది. ఆ వీడియో ఈ నెల 12న విశాఖపట్నం ఆనందపురంం జంక్షన్‌లో ఒక వస్త్ర దుకాణంలోనిదని వైసీపీ పేర్కొంది. ఈ వీడియోలో సత్యవర్ధన్ ‘స్వేచ్ఛ’గా షాపింగ్ చేస్తుంటే కిడ్నాప్ అయ్యారని ఎలా చెబుతారని ప్రశ్నించింది.
వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందిలా..
సత్యవర్ధన్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదులోను.. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోను.. కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లోను.. సత్యవర్ధన్‌ను 10న విజయవాడలో కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. అదే రోజు బలవంతంగా కోర్టులో వాంగ్మూలం ఇప్పించి అనంతరం హైదరాబాద్ తీసుకెళ్లారనేది పోలీసుల వాదన. ఆ మరునాడు హైదరాబాద్‌లో వంశీ ఉంటున్న మై హోం భూజాలోకి సత్యవర్ధన్‌ను తీసుకెళుతున్న సీసీ కెమెరా ఫుటేజీని ఇప్పటికే పోలీసులు విడుదల చేశారు. సత్యవర్ధన్‌ను లిఫ్టులో తీసుకెళుతున్న సమయంలో వంశీతోపాటు భీమవరపు ఎతేంద్ర రామకృష్ణ అలియాస్ తేలప్రోలు రాము, యర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్ పొట్టి రాము కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో సత్యవర్ధన్‌ను నిర్బంధించి, కోర్టులో ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలని చిత్రహింసలు పెట్టారని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. సత్యవర్ధన్‌ను హైదరాబాద్‌లో ఉంచడం సేఫ్ కాదని భావించిన వంశీ, తన మనుషులతో విశాఖకు తరలించి అక్కడ దాచారని పోలీసులు పేర్కొన్నారు. తాజాగా వైసీపీ విడుదల చేసిన విశాఖలోని వీడియో ఫుటేజీని పరిశీలిస్తే.. సత్యవర్ధన్‌తోపాటు వస్త్రదుకాణంలో కనిపించిన ఇద్దరూ... హైదరాబాద్‌లో వంశీతోపాటు ఉన్న ఇద్దరు వ్యక్తులూ ఒక్కరే. పోలీసులు వినిపిస్తున్న వాదనకు బలం చేకూర్చేలా వైసీపీ వారే తాజా వీడియో విడుదల చేసి సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు.
కిడ్నాపర్లు పక్కనుంటే స్వేచ్ఛగా ఉన్నట్టా..!
విశాఖపట్నంలో సత్యవర్ధన్‌ను షాపింగ్‌కు తీసుకెళ్లిన ఎతేంద్ర రామకృష్ణ కిడ్నాప్ కేసులో ఏ3గా ఉన్నారు. మరో వ్యక్తి యర్రంశెట్టి రామాంజనేయులు ఏ9గా ఉన్నారు. వీరిద్దరికీ నేరచరిత్ర ఉంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరిలో దాడి చేసిన ఘటనలో వీరు ఉన్నారు. ఇద్దరూ వంశీ ప్రధాన అనుచరులు. వంశీ చేసే సెటిల్‌మెంట్లలో కీలకంగా ఉంటారు. అలాంటి నేర చరిత్ర ఉన్న ఇద్దరు వ్యక్తులు పక్కన ఉంటే సత్యవర్ధన్ కిమ్మనకుండా వారు చెప్పినట్టు వింటాడా లేక పారిపోవడానికి ప్రయత్నిస్తాడా..? సత్యవర్ధన్ ప్రాణభయానికి వైసీపీ ‘స్వేచ్ఛ’ అనే పేరు పెట్టడం విమర్శలకు దారితీస్తోంది.