Share News

Tirumala Drone Incident: శ్రీవారి ఆలయంపై డ్రోన్‌

ABN , Publish Date - Apr 16 , 2025 | 06:05 AM

తిరుమల శ్రీవారి ఆలయం మీద డ్రోన్‌ ఎగురవేయడంపై రాజస్థానీ యూట్యూబర్‌ అన్షుమన్‌ తరెజాను టీటీడీ విజిలెన్స్‌ అదుపులోకి తీసుకుంది. భద్రతా వైఫల్యాలపై విమర్శలు వచ్చాయి.

Tirumala Drone Incident: శ్రీవారి ఆలయంపై డ్రోన్‌

  • టీటీడీ విజిలెన్స్‌ అదుపులో రాజస్థానీ యూట్యూబర్‌

తిరుమల, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంపై ఓ యూట్యూబర్‌ డ్రోన్‌ ఎగురవేయడం కలకలం రేపింది. ఈ ఘటనతో తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. రాజస్థాన్‌కు చెందిన అన్షుమన్‌ తరెజా అనే యూట్యూబర్‌ మంగళవారం సాయంత్రం డ్రోన్‌ కెమెరాను ఆలయంపై ఎగురవేశాడు. దాదాపు 10 నిమిషాల పాటు డ్రోన్‌ ఆలయం పరిసర ప్రాంతాల్లోనే తిరగడం గమనార్హం. దీంతో టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమై, అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏయే ప్రాంతాలను చిత్రీకరించారు? డ్రోన్‌ ఎందుకు ఎగురవేశారని ఆరా తీస్తున్నారు. అన్షుమన్‌ ఉదయం నుంచి తిరుమలలో పలు ప్రాంతాల్లో డ్రోన్‌ వినియోగించినట్టు సమాచారం. ఆగమ నిబంధనల ప్రకారమే కాకుండా, భద్రతా కారణాలతోనూ ఆలయంపై డ్రోన్‌ కెమెరాలు ఎగురవేయడం నిషేధం. సాధారణంగా డ్రోన్‌ కెమెరాలతో వచ్చే భక్తులను అలిపిరి చెక్‌ పాయింట్‌లోనే భద్రతా సిబ్బంది అడ్డుకోవాలి. అయితే ఓ యూట్యూబర్‌ డ్రోన్‌ కెమెరాతో తిరుమల రావడంతో భద్రతాధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక, 2023 జనవరిలో కూడా సర్వే కోసమని వచ్చిన ఓ సంస్థ శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ ఎగురవేసి ఆ చిత్రాలను సోషల్‌ మీడియాలో పెట్టడం కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. గతేడాది జనవరిలోనూ అసోంకు చెందిన ఓ జంట ఘాట్‌రోడ్డులో డ్రోన్‌ ఎగురవేసిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు మంగళవారం ఉదయం తిరుమలకు వచ్చిన ఓ టెంపో వాహనంపై ఇతర మతాలకు సంబంఽధించిన చిహ్నాలు ఉండటం కూడా భక్తుల నుంచి విమర్శలకు దారి తీసింది.

Updated Date - Apr 16 , 2025 | 06:05 AM