Share News

YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:43 AM

వైఎస్‌ షర్మిల తన సోదరుడు జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో మోసం చేశారంటూ, పోలవరం ప్రాజెక్టుపై కేంద్రాన్ని, రాష్ట్రాన్ని తప్పుపట్టారు.

YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ

మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసే యత్నం

ఆస్తుల్లో ఎవరికి ఏవి అనేది తేల్చిన ఎంవోయూ

దానిపై నాడు సంతకం చేసి.. ఇప్పుడు వెనక్కి..

ఇచ్చిన షేర్లు కూడా తిరిగి ఇమ్మంటున్నాడు

మోదీకి నాడు దత్తపుత్రుడిలా వ్యవహరించిన జగన్‌

అందుకే పోలవరాన్ని బీజేపీ చంపేసినా మౌనం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం ఇవ్వాలి

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌

అమరావతి, ఏప్రిల్‌4 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్‌ జగన్‌ను తిట్టడం కోసమే తాను రాజకీయాల్లో కొనసాగడంలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను రాజకీయాల్లో ఉన్నాను. కానీ, దీనికి భిన్నంగా నా విషయంలో కవరేజీ ఇస్తున్నారు. ఇది బాధాకరం.’’ అని ఆమె తెలిపారు. ఆస్తుల పంపకాల విషయంలో స్వయంగా ఎంవోయూపై జగన్‌ సంతకం చేశారని, ఆస్తుల్లో ఎవరికి ఏవి చెందాలనేది స్పష్టంగా అందులో పేర్కొన్నారని షర్మిల వివరించారు. కానీ, వాటిని ఇంతవరకూ ఇవ్వలేదని తెలిపారు. ‘‘గిఫ్ట్‌ను ఆయన విజయమ్మకు ఇచ్చారు. నాకు ఇవ్వలేదు. ఇచ్చిన షేర్లను జగన్‌ వెనక్కి అడుగుతున్నారు. ఇది సొంత తల్లికి కుమారుడు చేస్తున్న మోసం.’’ అని ఆమె వాపోయారు. తల్లిమీద కేసు పెట్టినవాడిగాను, ఆస్తులు కాజేయడానికి సొంత మేనల్లుడు,మేనకోడలినే మోసం చేసిన మేనమామగాను జగన్‌ చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో శుక్రవారం విలేకరులతో షర్మిల మాట్లాడారు. తన హయాంలో నరేంద్ర మోదీకి జగన్‌ దత్తపుత్రుడు అన్నట్టు వ్యవహరించారని మండిపడ్డారు. మోదీ అనాడు రాష్ట్రం నోట్లో మట్టి కొట్టారని, ఇప్పుడు సున్నం కొట్టడానికి తిరిగి అమరావతికి ఆయన వస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చంపేస్తోందని ఆమె ఆరోపించారు. ‘‘పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేయడంవల్ల అది బ్యారేజీ స్థాయికి పరిమితం అవుతుంది. కేవలం ఎత్తిపోతల పథకంగానే మిగిలిపోనుంది. ఇలాంటి ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటి? సహాయ, పునరావాస ప్యాకేజీని ఎగ్గొట్టేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఎత్తు వేసింది. 85 వేలమంది నిర్వాసితులకు అన్యాయం చేసింది. అయినా, కూటమినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌; వైసీపీ అధినేత జగన్‌ కూడబలుక్కున్నట్లుగా మౌనంగా ఉన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలి.’’ అని షర్మిల డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:43 AM