Share News

డిసెంబరు నాటికి విదేశీ అప్పులు రూ.61.38 లక్షల కోట్లు

ABN , Publish Date - Apr 01 , 2025 | 03:36 AM

గత డిసెంబరు చివరి నాటికి భారత విదేశీ అప్పులు వార్షిక ప్రాతిపదికన 10.7 శాతం పెరిగి 71,790 కోట్ల డాలర్లకు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రస్తు త మారకం రేటు ప్రకారం ఈ విలువ సుమారు...

డిసెంబరు నాటికి విదేశీ అప్పులు రూ.61.38 లక్షల కోట్లు

ఏడాది కాలంలో 10.7 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: గత డిసెంబరు చివరి నాటికి భారత విదేశీ అప్పులు వార్షిక ప్రాతిపదికన 10.7 శాతం పెరిగి 71,790 కోట్ల డాలర్లకు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రస్తు త మారకం రేటు ప్రకారం ఈ విలువ సుమారు రూ.61.38 లక్షల కోట్లు. 2023 డిసెంబరు నాటికి మన విదేశీ రుణ భారం 64,870 కోట్ల డాలర్లు (రూ.55.46 లక్షల కోట్లు)గా ఉంది. త్రైమాసిక ప్రాతిపదికన పోలిస్తే, 2024 సెప్టెంబరు చివరి నాటికి 71,270 కోట్ల డాలర్లుగా (రూ.60.93 లక్షల కోట్లు) ఉన్న విదేశీ రుణ భారం.. డిసెంబరు చివరికల్లా మరో 0.7 శాతం పెరిగింది. 2024 ముగిసేసరికి జీడీపీలో విదేశీ రుణభారం నిష్పత్తి 19.1 శాతంగా నమోదైంది. గత సెప్టెంబరు చివరినాటికిది 19 శాతంగా ఉంది. మన ప్రభుత్వంతో పాటు కార్పొరేట్‌ కంపెనీలు, బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు, వ్యక్తులు విదేశీ రుణదాతల నుంచి సేకరించిన అప్పులన్నీ ఈ పరిధిలోకి వస్తాయి. గత ఏడాది చివరినాటికి మొత్తం విదేశీ రుణ భారంలో అత్యధికంగా డాలర్లలో తీసుకున్న అప్పు వాటాయే 54.8 శాతంగా ఉంది. రూపాయల్లో తీసుకున్న విదేశీ రుణ వాటా 30.6 శాతంగా, జపాన్‌ యెన్‌లలో తీసుకున్న అప్పు 6.1 శాతంగా, యూరోల్లో తీసుకున్న రుణాలు 3 శాతంగా ఉన్నాయి.


2024 సెప్టెంబరుతో పోలిస్తే డిసెంబరు చివరినాటికి మొత్తం విదేశీ రుణాల్లో కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వాటా తగ్గగా.. ప్రభుత్వయేతర రంగాల వాటా పెరిగింది. మొత్తం విదేశీ రుణంలో ఆర్థికేతర సంస్థలు చెల్లించాల్సిన బకాయిల వాటా 36.5 శాతంగా ఉండగా.. సెంట్రల్‌ బ్యాంక్‌ మినహా డిపాజిట్లు స్వీకరించే బ్యాంకింగ్‌ సంస్థలు చెల్లించాల్సిన వాటా 27.8 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం వాటా 22.1 శాతంగా, ఇతర ఆర్థిక సేవల సంస్థల వాటా 8.7 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి..

Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్

IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా

Updated Date - Apr 01 , 2025 | 03:36 AM