Share News

అన్నీ మంచి శకునములే..!

ABN , Publish Date - Mar 13 , 2025 | 05:00 AM

దేశంలో ధరల మంట తగ్గుముఖం పట్టగా.. పారిశ్రామిక వృద్ధి పుంజుకుంది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం...

అన్నీ మంచి శకునములే..!

దిగొచ్చిన ధరలు..

పుంజుకున్న పారిశ్రామికం

  • 7 నెలల కనిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

  • ఫిబ్రవరిలో 3.61 శాతానికి పరిమితం

  • జనవరిలో 5 శాతానికి పారిశ్రామికోత్పత్తి సూచీ

న్యూఢిల్లీ: దేశంలో ధరల మంట తగ్గుముఖం పట్టగా.. పారిశ్రామిక వృద్ధి పుంజుకుంది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 7 నెలల కనిష్ఠ స్థాయి 3.61 శాతానికి దిగొచ్చింది. కూరగాయలు, కోడి గుడ్లు, ప్రోటీన్‌ ఉత్పత్తులు, పాలు, వాటి ఉత్పత్తుల ధరలు తగ్గడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. ద్రవ్యోల్బణం జనవరి నెలలో 4.26 శాతం ఉండగా గత ఏడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా ఉంది. గత ఏడాది జూలైలో ఆర్‌బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన కనిష్ఠ కట్టడి స్థాయి 4ు సమీపానికి దిగొచ్చిన ద్రవ్యోల్బణం తిరిగి ఆ స్థాయి కన్నా దిగువకు తగ్గడం ఇదే ప్రథమం. అయితే గత ఏడాది నవంబరు నుంచి ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ కట్టడి (2ు ఎగువకు లేదా దిగువకు సద్దుబాటుతో 4ు) పరిధిలోనే కదలాడుతూ వస్తోంది.


వడ్డీపోటు మరింత తగ్గే చాన్స్‌

ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు జారుకోవడంతో కీలక రెపోరేట్లు మరింత తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. వచ్చే నెల 9న ఆర్‌బీఐ తదుపరి ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించనుంది. ఆ సందర్భంగా రెపోరేటును మరో పావు (0.25) శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అదే జరిగితే రెండు నెలల వ్యవధిలోనే ఇది రెండో కోత అవుతుంది. ఫిబ్రవరి సమీక్షలో ఆర్‌బీఐ రెపోరేటును పావు శాతం తగ్గించింది. దాంతో రెపో 6.25 శాతానికి జారుకుంది. ఇప్పుడు మరో పావు కోత పెడితే రెపో రేటు 6 శాతానికి దిగివస్తుంది. తద్వారా రెపో ప్రామాణిక గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీరేట్లతోపాటు ఈఎంఐల భారం సైతం తగ్గే అవకాశం ఉంటుంది. ఏప్రిల్‌తో పాటు జూన్‌ లేదా ఆగస్టు సమీక్షలో రెపోరేటును మరో 0.25 శాతం తగ్గించే అవకాశాల్లేకపోలేవని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితీ నాయర్‌ అంచనా వేశారు.


తయారీ రంగం

జోరు

తయారీ రంగం దన్నుతో జనవరి నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5 శాతానికి పెరిగింది. అంతేకాదు, 2024 డిసెంబరు ఐఐపీని సైతం ప్రభుత్వం తొలుత అంచనా వేసిన 3.2 శాతం నుంచి తాజాగా 3.5 శాతానికి పెంచింది. ఐఐపీ గత ఏడాది జనవరిలో 4.2ు ఉండగా వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరి నెలల మధ్య కాలంలో కూడా అదే స్థాయిలో ఉంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరి నెలల్లో నమోదైన 6 శాతం కన్నా ఇది తక్కువే. తయారీ రంగంలో వృద్ధిరేటు గత ఏడాది జనవరితో పోల్చితే 3.6 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగింది. అయితే గనుల రంగంలో మాత్రం ఉత్పత్తి 6 శాతం నుంచి 4.4 శాతానికి క్షీణించింది. ఒకపక్క ప్రపంచం మొత్తాన్ని ట్రంప్‌ సుంకాల హెచ్చరికలు అతలాకుతలం చేస్తున్న వాతావరణంలో మన దేశంలో స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగుపడడం ఆనందదాయకమని, రాబోయే సవాళ్లను ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడతాయని అసోచాం అంటోంది.

Read Also : Jio partners: నిన్న ఎయిర్ టెల్, ఈరోజు జియో..స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం

ఈ మెషిన్ ఒక్కటి కొంటే.. ఇంట్లోనే రోజూ రూ.5000 సంపాదన.. చాలామందికి తెలియని టాప్ బిజినెస్ ఐడియా..

యూజర్లకు యాపిల్ హెచ్చరిక!

Updated Date - Mar 13 , 2025 | 05:00 AM