Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 03:46 PM
Sri Rama Navami: దేశంలో అత్యధిక మంది హిందువులు శ్రీరాముడిని దేవునిగా కొలుస్తారు. మరికొద్ది రోజుల్లో ఆయన జన్మదినం శ్రీరామ నవమి జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నవమి వేడుకలు భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మరి ఆ రోజు శ్రీరాముడి కృపకు పాత్రులు కావడంతోపాటు పుణ్యం సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే..

శ్రీరాముడిని అందరు ఆరాధిస్తారు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. చైత్ర మాస శుద్ద నవమి.. ఆయన జన్మదినం శ్రీరామనవమి. ఈ వేడుకలను అంతా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఈ ఏడాాది శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే.. వాడ వాడలా పందిళ్లు వేసి.. శ్రీరాముల వారికి కళ్యాణం నిర్వహిస్తారు. అనంతరం పానకం, వడపప్పు, చలివిడను భక్తులకు పంచుతారు. ఆ తర్వాత అన్నాదానాలు నిర్వహిస్తారు. ఇక శ్రీరామ నవమి రోజు.. పుణ్యం దక్కాలంటే.. ఈ విధంగా చేయాలని పండితులు సూచిస్తున్నారు. భక్తితో పాటు నియమ నిష్టలతో చేయాలని చెబుతున్నారు.
సూర్యోదయానికి ముందే..
శ్రీరామనవమి రోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి.. శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రీరాముడు స్వచ్ఛతకు ప్రతీక. ఈ నేపథ్యంలో శరీరం,మనస్సు శుద్ధిగా ఉండటం పుణ్య ఫలితాన్ని తెస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. స్నానం తర్వాత శ్రీరాముడిని ధ్యానించాలి.
శ్రీరాముడి పూజతోపాటు తారక మంత్ర
ఇంట్లో శ్రీరామ విగ్రహం లేదా ఆయన చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచాలి. ఆ చిత్ర పటానికి పసుపు,కుంకుమ, పూలు, గంధంతో అర్చన చేయాలి.అనంతరం "శ్రీ రామ తారక మంత్రం" అయిన..ఓం శ్రీ రామాయ నమఃను కనీసం 108 సార్లు జపించాలి. తద్వారా ఆయన ఆశీస్సులు లభిస్తాయి.అంతేకాదు ఈ జపం మనస్సును ఏకాగ్రత చేసి.. పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు.
రామాయణ పారాయణం లేదా భజనలు
రామాయణంలోని కనీసం ఒక అధ్యాయం పఠించడం లేదా శ్రీరామ భక్తి గీతాలు ఆలాపించడం ఈ రోజు తప్పక చేయాలని సూచిస్తారు. శ్రీరాముని గుణగణాలను స్మరించడం వల్ల ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ లభిస్తుంది. అలాగే ఇది పుణ్య ఫలాన్ని అందిస్తుంది.
నైవేద్యం సమర్పించి.. ప్రసాద వితరణ
పండ్లు, పానకం,వడపప్పు వంటి సాంప్రదాయ వంటలను శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత దాన్ని కుటుంబ సభ్యులకు, ఇతర భక్తులకు పంచడం వల్ల సేవా భావం పెరిగి..పుణ్యం సంపాదించేందుకు మార్గం సుగమమం అవుతుంది.
దానంతోపాటు సేవ
ఈ రోజు.. బీదలకు ఆహారం, బట్టలు లేదా నగదు దానం చేయడం శ్రీరాముని కరుణాకటాక్షానికి పాత్రులమవుతాం. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతితోపాటు పుణ్యఫలం దక్కుతోంది.శ్రీరామనవమిని కేవలం పండుగగా కాకుండా.. ఆధ్యాత్మిక సాధనగా జరుపుకోవడానికి దోహదం చేస్తుంది. శ్రీరాముని ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తే.. ఈ రోజు ఒక అడుగు వేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి