Share News

జైహింద్ నినాద స్రష్ట

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:06 AM

అధికారిక, అనధికారిక సభలు, సమావేశాలు, కార్యక్రమాలు, ప్రసంగాలు ఏవైనా సరే ముగింపులో మనకు వినిపించే ఏకైక పదం ‘జై హింద్’. దీని అర్థం ఏమిటి? దీన్ని ఎవరు సృష్టించారు? ఎలా వాడుకలోకొచ్చింది?...

జైహింద్ నినాద స్రష్ట

అధికారిక, అనధికారిక సభలు, సమావేశాలు, కార్యక్రమాలు, ప్రసంగాలు ఏవైనా సరే ముగింపులో మనకు వినిపించే ఏకైక పదం ‘జై హింద్’. దీని అర్థం ఏమిటి? దీన్ని ఎవరు సృష్టించారు? ఎలా వాడుకలోకొచ్చింది? ఎవరు ప్రాచుర్యంలోకి తెచ్చారు? దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? అలవోకగా పలికేస్తున్న ఈ పదం గొప్పతనం గురించి నేటి తరంలో ఎంతమందికి తెలుసు? ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం.


జై హింద్– అనే పదం దేశభక్తిని చాటుకునే ఓ మహత్తర నినాదం. భారతదేశానికి జయం కలుగుగాక! అని దీని అర్థం. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఈ పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది నేతాజీ సుభాస్‌ చంద్రబోస్ కాగా, దీని సృష్టికర్త మాత్రం ఆబిద్ హసన్ సఫ్రానీ. బోసు సహచరులైన ముస్లిం సమరయోధుల్లో, ఆజాద్ హింద్ ఫౌజ్ సాయుధ పోరాట వీరుల్లో సఫ్రానీ ప్రముఖుడు. ఈయన తెలంగాణ ముద్దుబిడ్డ. 1911 ఏప్రిల్ 11న హైదరాబాద్‌లో జన్మించారు. అసలు పేరు జైనుల్ ఆబిదీన్ హసన్. ఐఎఫ్‌ఎస్‌ అధికారి. పలు దేశాల్లో భారత రాయబారిగా పని చేశారు. ఉర్దూ, పర్షియన్, అరబిక్, సంస్కృతం, ఫ్రెంచ్, లాటిన్ వంటి అనేక భాషల్లో గొప్ప పండితుడు. అద్భుతమైన కవిత్వం రాశారు. శుభ్‌ సుఖ్ చైన్ సృష్టికర్త. ఆబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆయన తల్లి ఫఖ్రుల్‌ హాజియా బేగం. హైదరాబాద్‌లో ఆంక్షలు ఉన్నప్పటికీ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ధీర వనిత, గొప్ప దేశభక్తురాలు. సరోజినీనాయుడు స్నేహితురాలు. ఆబిద్‌ హసన్‌ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నారు. కాని తల్లి ఫఖ్రుల్ హాజియా బ్రిటిషు వ్యతిరేకత ఆయనపై గట్టి ప్రభావం చూపించింది. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. చదువు ఆగిపోయింది. తరువాత ఇంజనీరింగ్ విద్య కోసం జర్మనీ వెళ్లాడు. అక్కడే నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ను కలుసుకున్నారు.


స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు బోసు చేస్తున్న ప్రసంగాలు ఆబిద్ హసన్‌ను మరింత ప్రభావితం చేశాయి. దీంతో ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే విడిచిపెట్టి, బోస్‌కి వ్యక్తిగత కార్యదర్శిగా, జర్మన్ భాష అనువాదకుడిగా చేరారు. బోస్ పునర్వ్యవస్థీకరించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఆబిద్ మేజర్‌గా పనిచేశారు. బోసుకు తోడుగా ఉండి, భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పనలో ఆయనకు తోడ్పాటు అందించారు. ఆ కాలంలో ఆసేతు హిమాచలం ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన జైహింద్ నినాద స్రష్ట ఆబిద్ హసన్ సఫ్రానీయే కావడం తెలంగాణ వాసులకు గర్వకారణం. అనతికాలంలోనే ఈ నినాదం స్వాతంత్ర్య సమరయోధుల అధికారిక నినాదంగా మారిపోయింది. ఇప్పటికీ రాజకీయ నాయకులు, దేశభక్తులు తరచూ ఈ నినాదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అనుపమానమైన దేశభక్తికి తార్కాణంగా చేసే నినాదంగా నేటికీ ప్రజల హృదయాల్లో బలంగా ముద్రించుకుపోయిందీ నినాదం.


బ్రిటన్‌తో జర్మనీ యుద్ధం చేస్తున్న సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీలో భిన్న వర్గాలకు చెందిన ప్రజలు ఉండేవారు. అందులో కొంతమంది ‘నమస్కార్’ అని సంబోధిస్తే, మరికొంత మంది ‘రామ్ రామ్’ అంటూ పలకరించుకునేవారు. ‘సత్ శ్రీ అకాల్’, ‘అస్సలాము అలైకుం’ అంటూ అభివాదం చేసుకునేవారు కూడా ఉండేవారు. సెక్యులర్ భావాలు కలిగిన బోస్‌కు ఇన్ని రకాల అభివాదాలు ఉండటం సబబుగా అనిపించలేదు. అందరికీ ఆమోదయోగ్యమైన ఓ అభివాద నినాదాన్ని రూపొందించాలని ఆయన తన సన్నిహితులకు చెప్పారు. అబిద్ హసన్ ముందుగా ‘హలో’ అని ప్రతిపాదించారు. కాని బోస్‌కు అది నచ్చలేదు. తరువాత ‘జై హిందుస్తాన్’, ‘జై హింద్’ అని ప్రతిపాదించారు ఆబిద్. జై హిందుస్తాన్ కాస్త పెద్దగా ఉండడం వల్ల ‘జై హింద్’కే బోసు జై కొట్టారు. ఈ నినాదం బోస్‌కు ఎంతగానో నచ్చింది. వెంటనే ఆయన దాన్ని ఆమోదించి, ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ‘జై హింద్’ అనే పదం దేశభక్తిని చాటుకునే ఒక మహత్తర నినాదంగా మారిపోయింది. 1984 ఏప్రిల్ 5న ఆబిద్ హసన్ సఫ్రానీ హైదరాబాద్‌లో కన్ను మూశారు.

యండి. ఉస్మాన్ ఖాన్

జర్నలిస్ట్

(నేడు ఆబిద్ హసన్ సఫ్రానీ జయంతి)

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 11 , 2025 | 05:07 AM