Share News

జమిలి ఎన్నికలు.. గొప్ప సంస్కరణ

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:56 AM

‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ (జమిలి ఎన్నికలు) దేశ చరిత్రలో వినూత్న మార్పులు తీసుకురానున్నది. దీనివల్ల పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దాంతో ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వ సిబ్బందికి..

జమిలి ఎన్నికలు.. గొప్ప సంస్కరణ

‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ (జమిలి ఎన్నికలు) దేశ చరిత్రలో వినూత్న మార్పులు తీసుకురానున్నది. దీనివల్ల పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దాంతో ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వ సిబ్బందికి శ్రమ తగ్గుతుంది. ప్రజలకు ఇబ్బందులు దూరం అవుతాయి. ఇవన్నీ దేశానికి ఒనగూడే ప్రయోజనాలే. దేశ రాజకీయాలే కాదు అభివృద్ధి దిశగా కూడా జరిగే గొప్ప సంస్కరణ ఇది. జమిలి ఎన్నికల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి దేశంలో పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. అభివృద్ధిని కాంక్షించేవారంతా దీనిని స్వాగతిస్తుండగా, విపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. కుల, మత, ప్రాంతీయ, వేర్పాటువాదాలను ప్రేరేపించి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుస్తున్న పార్టీలకు జమిలి ఎన్నికల గురించి ఆందోళన ప్రారంభమైంది. ఎన్నికల్లో అభివృద్ధి, సుస్థిర, పారదర్శక పాలన అందించే పార్టీలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆందోళన చెందాల్సిన పనిలేదు.


ఒకప్పుడు ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధిగా, తమ తరఫున వాదించేవారుగా చూసేవారు. కానీ ఇప్పుడు ప్రజలు వారిని దళారులుగా చూస్తున్నారు. కారణం వారు దళారీ పనులు చేయడం, లేదా వ్యక్తిగత లాభాల కోసం పనిచేయడం. ఇలాంటి వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పించేవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలు. ఇవి అసంఘటిత స్వభావం, పారదర్శకతా లోపం, సైద్ధాంతిక పునాదులు లేకుండా కేవలం డబ్బు, పదవుల కోసం రాజకీయం చేస్తున్నాయి. పైగా అన్నిటికంటే ముఖ్యంగా పార్టీలలో కుటుంబాల ప్రాబల్యం తీవ్ర అవినీతికి దారితీస్తోంది. దురదృష్టవశాత్తూ కాంగ్రెస్‌ ఈ కోవలోకి పోగా, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తృణమూల్‌, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలు అవినీతికి కొత్త అర్థం చెప్పాయి. అయితే ఈ దుర్మార్గాన్ని రూపుమాపే అవకాశం ఆదర్శపాలన కోరే ఓటర్లకు జమిలి ఎన్నికలతో రానున్నది.

ప్రస్తుత పరిస్థితి కొనసాగితేనే తమకు ప్రయోజనకరమని అనేక ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నందున అవి రాజకీయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పలు పాలనా సంస్కరణలతో బీజేపీ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకుంది. పేదలకు జీరో ఖాతాలు తెరిపించి సంక్షేమ పథకాల్లో భాగంగా వాటిలోకి నగదు బదిలీ నేరుగా చేపట్టడం పలు రాజకీయ పార్టీలకు మింగుడుపడలేదు. అందువల్లే ఈ పార్టీలు మోదీ ప్రభుత్వం చేసే సంస్కరణలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినా పార్టీలు అనుసరించే విధాన లోపాలను ఎత్తి చూపడానికి, రాజకీయ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడానికి ‘ఒకే దేశం-–ఒకే ఎన్నికల’ బిల్లు అవకాశం కల్పిస్తుంది.


ఎన్నికల సంస్కరణపై ప్రధాని మోదీ చూపిన చొరవ.. ఒకే దేశం–ఒకే ఎన్నికలు విధానానికి దారితీసింది. దీని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి 2023 సెప్టెంబర్‌ 2న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. 191 రోజులపాటు విస్తృతంగా రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు నిపుణులతో సంప్రదింపులు జరిపిన ఈ కమిటీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించింది. కోవింద్‌ ప్యానెల్‌ చేసిన సిఫారసులకు కేంద్ర మంత్రివర్గం 2024, సెప్టెంబర్‌ 18న ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. 2024, 2028 మధ్య ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వాల కాలవ్యవధి 2029 లోక్‌సభ ఎన్నికల వరకు ఉంటుంది. ఆ తర్వాత లోక్‌సభతోపాటు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా, ఈ బిల్లుకు సంబంధించి రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను జేపీసీకి పంపించాలని లోక్‌సభ నిర్ణయించింది. గరిష్టంగా 39 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీని రూపొందించారు.

జమిలితో ఎన్నికల వ్యయం తగ్గుతుంది; తరచూ ఎన్నికలతో పథకాల అమలు నిలిచిపోతుంది. ప్రభుత్వం దృష్టి అభివృద్ధి కార్యక్రమాల నుంచి ఎన్నికల ప్రచారం పైకి మళ్లుతుంది. జమిలితో ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించవచ్చు; తరచూ ఎన్నికల వేళ రాజకీయ నాయకుల మధ్య అధిక పోటీ, ప్రతిస్పందనల వల్ల ప్రజాస్వామ్యానికి చేటు కలుగుతోంది. ఈ పరిస్థితిని నివారించవచ్చు; ఎన్నికల నిర్వహణలో లక్షలాది ప్రభుత్వ సిబ్బంది, భద్రతా దళాలు పాల్గొంటాయి. తరచూ జరిగే ఎన్నికలు వీరిపై ఒత్తిడిని పెంచుతాయి. జమిలితో ఈ ఒత్తిడి కొంత తగ్గుతుంది; ప్రజలు అనేక ఎన్నికల కారణంగా తరచూ ఓటింగ్‌ కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుంది. జమిలి ప్రజలకు సౌలభ్యం కలిగిస్తుంది.


ఏకకాల ఎన్నికలు సరైన సమయంలో తీసుకున్న సరైన చర్య. అయితే అదే సమయంలో మన దేశంలో ప్రజాస్వామ్యం నాణ్యతను మెరుగుపరచడానికి ఇతర కీలకమైన రాజకీయ సంస్కరణలు కూడా అవసరం. దేశంలోని పార్టీల కార్యకలాపాలను నిర్దేశించడానికి, వాటిలో క్రమశిక్షణను ప్రవేశపెట్టడానికి, వాటి కార్యకలాపాలను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా చేయడానికి ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావాలి. రాజకీయ పార్టీలలో కుటుంబ సభ్యులు లేదా రక్తసంబంధీకులు నిర్వహణ బృందంలో సభ్యులుగా ఉండరాదు. దేశంలో చాలావరకు అస్తిత్వంలో లేని, లేదా కేవలం నామమాత్రంగా కొనసాగుతున్న పార్టీలున్నాయి. ఎన్నికల సమయంలో ఇవి పొత్తులు పెట్టుకుని గెలుస్తున్నాయి. ఇలా చిత్తశుద్ధి లేని రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకు రాకుండా కట్టుదిట్టం చేయాలి. ప్రతి రాజకీయ పార్టీ తమ కార్యకలాపాలపై వార్షిక నివేదికను ప్రచురించాలి. ఏడాది కాలంలో తాము చేసిన పనులను, సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రజాప్రతినిధులు ఒక నివేదికను తప్పనిసరిగా సమర్పించాలి. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలను ఎంత మేరకు అమలు చేశాయో వివరించే నివేదికను తప్పనిసరిగా విడుదల చేయాలి. ఓడిపోయిన పార్టీలు కూడా తాము చేసిన ఎన్నికల వాగ్దానాల అమలుకు ఏమేమి ప్రణాళికలు రూపొందించిందీ తెలియజేయాలి. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తన నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎన్నికల ప్రణాళికను, అలాగే దాని అమలుకు తీసుకున్న చర్యలపై ఒక వార్షిక నివేదికను తప్పనిసరిగా విడుదల చేయాలి. రాజకీయ సంస్కరణల విస్తృతిని చర్చించేటప్పుడు ప్రజాప్రతినిధులు సభల్లో పనిచేసే తీరును గురించి కూడా చర్చించాలి.

ఏదేమైనా ఒకే దేశం–ఒకే ఎన్నిక దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆర్థిక, రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఒక ఆదర్శ ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తోంది. జమిలి అమలైతే భారతదేశం ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.

వల్లూరు జయప్రకాష్‌ నారాయణ

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

ఈ వార్తలు కూడా చదవండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 03 , 2025 | 04:56 AM