కొలీజియంకు కొత్తపరీక్ష
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:03 AM
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు పంపేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించడం ఆశ్చర్యం. వెనక్కుపంపేయాలని నాలుగురోజుల క్రితం సుప్రీంకోర్టు అనుకున్నప్పుడే...

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు పంపేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించడం ఆశ్చర్యం. వెనక్కుపంపేయాలని నాలుగురోజుల క్రితం సుప్రీంకోర్టు అనుకున్నప్పుడే అక్కడి బార్ అసోసియేషన్ తీవ్రంగా తప్పుబట్టి, ఇదేమీ చెత్తకుండీ కాదు, అవినీతి ఆరోపణలు వచ్చిన వ్యక్తిని మా నెత్తినరుద్దవద్దంటూ అభ్యంతరం చెప్పింది. అవినీతి అరోపణలకు, ఈ బదిలీకి సంబంధం లేదని సుప్రీంకోర్టు అన్నంతమాత్రాన ఏ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం జరిగిందో తెలియనిదేమీ కాదు. మిగతా సందర్భాల్లో న్యాయమూర్తుల బదిలీల్లో ఆయా రాష్ట్రాల బార్ అసోసియేషన్ల అభ్యంతరాలనో, ఆక్షేపణలనో పట్టించుకోకపోవడం వేరు, ఇప్పటి నేపథ్యం వేరు. యశ్వంత్ వర్మను వెనక్కుపంపవద్దని న్యాయవాదుల అసోసియేషన్ శుక్రవారం తొలిగా అభ్యంతరపెట్టినప్పటినుంచి సోమవారం తిరిగి అదే నిర్ణయం తీసుకొనే వరకూ చాలా పరిణామాలు జరిగాయి.
ఈ స్వల్పకాలంలో సుప్రీంకోర్టు చూపిన చొరవ, త్వరితగతిన తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయమైనవి. అవన్నీ కూడా వర్మమీద వచ్చిన ఆరోపణలను మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన, నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి. కానీ, ఇంతలోనే మళ్ళీ ఆయనను అలహాబాద్ పంపాలన్న నిర్ణయానికే సుప్రీంకోర్టు వచ్చిన కారణంగా అక్కడకు సదరు బార్ అసోసియేషన్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు, సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో ఏదో రాజీపడిపోయినట్టు సామాన్యజనానికి అనిపించే ప్రమాదం లేకపోలేదు. తృణమూల్ ఎంపీ మొహువా మొయిత్రా సోమవారం పార్లమెంట్‌లో యశ్వంత్ వర్మ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఒక న్యాయమూర్తిమీద అవినీతి ఆరోపణలు వచ్చిన ఈ ఉదంతాన్ని అస్త్రంగా చేసుకొని, కొలీజియం వ్యవస్థను కుప్పకూల్చే దిశగా ప్రభుత్వం కుట్రకు తెరదీస్తోందని ఓ ఆరోపణచేశారు. రాసిపెట్టుకోండి, ప్రభుత్వమూ, గోదీమీడియా కలసి కొలీజియం వ్యవస్థను అప్రదిష్టపాల్జేసి, తాము ఎంతోకాలంగా అనుకుంటున్న విధానాన్ని తేవడానికి వీలుగా పరిస్థితులను, వాతావరణాన్ని, కార్యక్షేత్రాన్ని సిద్ధం చేస్తున్నాయి అని వ్యాఖ్యానించారామె. నరేంద్రమోదీ తొలివిడత పాలన తొలి ఏడాది తొలిమాసాలలోనే నేషనల్ జుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జెఎసి) ఏర్పాటుకోసం ఓ ప్రయత్నం చేయడం, సుప్రీంకోర్టు మరుసటి ఏడాది దానిని కొట్టివేసి, కొలీజియంను నిలబెట్టుకోవడం తెలిసిందే. సర్వోన్నతన్యాయస్థానంమీద ఆగ్రహమో, అక్కసో వచ్చినప్పుడల్లా బీజేపీ పెద్దలు, న్యాయశాఖమంత్రులు తాము నిలబెట్టుకోలేని ఈ చట్టాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు జగ్‌దీప్ ధన్‌ఖడ్ గతంలో దీనిని ఏకంగా ఎంపీల చేతకానితనానికి ప్రతీకగా అభివర్ణించిన సందర్భమూ ఉంది. యశ్వంత్ వర్మ ఉదంతం సందర్భంగా ఆయన దీనిని మళ్ళీ ముందుకు తేవడం, న్యాయవ్యవస్థలో అవినీతిని రూపుమాపే వజ్రాయుధంగా బీజేపీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు చర్చిస్తూండటం గమనార్హం. న్యాయమూర్తుల నియామకాలమీద ప్రభుత్వం నియంత్రణే ఉండే ఈ వ్యవస్థను తెచ్చుకోవడానికి తక్షణమే పాలకులు రంగంలోకి దిగకపోయినప్పటికీ, ఈ వివాదం ఎంతకాలం కొనసాగితే వారికి అంత ఉపకారం జరుగుతుంది.
యశ్వంత్ వర్మ అవినీతిని చూపి, తమ ప్రత్యామ్నాయ వ్యవస్థ పరిశుద్ధమైనదన్న వాదనకు ప్రభుత్వం మరింత విలువ సమకూర్చుకోగలదు. సీజేఐ నియమించిన త్రిసభ్యకమిటీ నివేదిక వచ్చేదాకా వేచివుండాలని నిర్ణయించామని అంటూనే, సోమవారం స్వపక్ష, విపక్ష అధినేతలతో ధన్‌ఖడ్ న్యాయవ్యవస్థ మంచిచెడుల గురించి చర్చలు జరపడం గమనార్హం. ఎన్‌జెఎసిని సమర్థించనిపక్షంలో న్యాయస్థానాల్లో అవినీతిని బలపరచిన అప్రదిష్ఠ తమకు వస్తుందేమోనని ప్రతిపక్షాలు సైతం భయపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. వర్మ వ్యవహారంలో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందించిన తీరు ప్రశంసనీయమైంది. ఢిల్లీ హైకోర్టు చీఫ్‌జస్టిస్ నివేదిక, డబ్బుకట్టల చిత్రాలు, వీడియోలతో సహా అందుబాటులో ఉన్న సమస్త సమాచారాన్ని ఆయన ప్రజాక్షేత్రంలో ఉంచారు. ఢిల్లీ హైకోర్టు యశ్వంత్‌వర్మకు కేటాయించిన విధులన్నింటినీ రద్దుచేసింది. నామమాత్రంగా జడ్జిగా మిగిలిన ఆయనను కదల్చకుండా వదిలివేసి ఉంటే సరిపోయేది. అలహాబాద్‌కు తిరిగి పంపేయాలన్న కొలీజియం నిర్ణయం ఈ ఉదంతాన్ని మరికొంతకాలం వివాదాస్పదంగా కొనసాగించడానికి ఊతమిస్తున్నది. న్యాయవ్యవస్థను అతివేగంగా తలెత్తుకొనేట్టుగా చేయాల్సిన బాధ్యత ఖన్నా మీద ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
For AndhraPradesh News And Telugu News