Share News

యుద్ధ విరామం!

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:03 AM

కూల్‌, చిల్‌ అంటూ తన ప్రజలకు ధైర్యం చెప్పిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొద్దిగంటల్లోనే వెనకడుగు వేశారు. మిగతాదేశాలను మొత్తడానికి మొదలుపెట్టిన తన వాణిజ్యయుద్ధం...

యుద్ధ విరామం!

కూల్‌, చిల్‌ అంటూ తన ప్రజలకు ధైర్యం చెప్పిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొద్దిగంటల్లోనే వెనకడుగు వేశారు. మిగతాదేశాలను మొత్తడానికి మొదలుపెట్టిన తన వాణిజ్యయుద్ధం అమెరికన్‌మార్కెట్‌ను ఛిన్నాభిన్నం చేయడంతో ప్రతీకార సుంకాల అమలును 90రోజులు నిలిపివేశారు. ధిక్కారము సైతునా అంటూ చైనా ఒక్కదానిమీదే తన కక్షసాధింపు కొనసాగిస్తూ, మిగతా వాటిని పదిశాతంతో వదిలేశారు. ఏప్రిల్‌ ఫూల్స్‌ డే మర్నాడు, లిబరేషన్‌ డే పేరిట ప్రపంచదేశాలమీద ప్రతీకార సుంకాలు ప్రయోగించిన ఆయన వారం తిరిగేసరికి వెనకడుగువేశారు. మస్క్‌ మాటే విన్నారో, తెరవెనుక నుంచి కార్పొరేట్‌ మాంత్రికుల ఒత్తిళ్ళే పనిచేశాయో తెలియదు కానీ తన యుద్ధానికి విరామం ప్రకటించారు. ట్రంప్‌ ప్రతీకారాస్త్రాల దెబ్బకు కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు ఇప్పుడు కాస్తంత ఒడ్డునపడుతున్నాయి. లక్షలకోట్ల సంపద ఆవిరైన గాయాలనుంచి క్రమంగా కోలుకుంటున్నాయి.


ట్రంప్‌ మనసు ఇంతలోనే ఎందుకలా మారిందో తెలియదు. ప్రతీకార సుంకాలు ప్రయోగిస్తున్నప్పుడు ఆయన ఎంత విశ్వాసంతో మాట్లాడారో చూశాం. అమెరికా సమస్త సమస్యలనుంచి, దారిద్ర్యంనుంచి, దాస్యం నుంచి ఎలా విముక్తి కాబోతున్నదో ఆయన అద్భుతంగా చెప్పారు. గ్రేట్‌ ఎగైన్‌ కావడం ఎంతో దూరంలో లేదన్నారు. తన, పర తేడాలేకుండా, పేద ధనికభేదం లేకుండా ప్రతీదేశానికీ ఓ రేటు కట్టారు. గతకాలపు కుట్రలతో గాయపడిన దేశాన్ని ఉద్ధరించానన్నారు. దెబ్బకు దేశం పరుగులుపెడుతుందనీ, వెలుగులీనుతుందనీ చెప్పారు. భజనబృందం చప్పట్ల మధ్యన కార్యక్రమాన్ని ముగించిన తరువాత కూడా అపరేషన్‌ సక్సెస్‌, పేషంట్‌ మోర్‌ ఫిట్‌ అని ట్వీట్‌ చేశారు. ట్రంప్‌ బృందం ఈ సుంకాల శాతాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించిందన్న సందేహాలు కూడా అప్పట్లో వచ్చాయి. ప్రతీ రేటుకూ ఓ లెక్క ఉందని, అడుగడుగూ ఆచితూచివేస్తున్నదేనని ట్రంప్‌ బృందం గొప్పగా చెప్పుకుంది. అంత ఆలోచించి, భవిష్యత్తు అంచనాలతో తీసుకున్న నిర్ణయమే అయితే, ఈ విధ్వంసానికి ముందే సిద్ధపడి ఉండాలి. ఈక్విటీలు ఈడ్చుకుపోతాయని, బాండ్లు బద్దలవుతాయని, వాల్‌స్ట్రీట్‌ కూలుతుందని, అంతిమంగా కొంపకొల్లేరవుతుందన్న అవగాహన ఎంతో ఉండాలి. అంతా సర్దుకుంటుందని, తన నిర్ణయం దేశానికి మేలుచేస్తుందని నమ్మకం ఉన్నపక్షంలో వారంలోనే ఇలా వెనకడుగువేయకూడదు. ఆర్థికమాంద్యం ఆరంభమైందనో, అడుగుదూరంలో ఉన్నదనో, సగం మునిగామనో ఆర్థికసంస్థలు వరుసపెట్టి హెచ్చరికలు చేస్తూంటే, లక్షలాదిమంది అమెరికన్లు హ్యాండ్సాఫ్‌ అంటూ రోడ్లమీదకు వచ్చేయడంతో ట్రంప్‌ వెనక్కుతగ్గినట్లు ఉంది. మీకు బెదరను, నిర్ణయాన్ని మార్చను అని అంత ఘాటుగా స్పందించిన ట్రంప్‌ ఇంతలోనే బెదిరిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. స్వల్పకాలంలోనే అమెరికన్లకు తత్వం బోధపడిందని, తిరుగుబాటు ఆరంభమైందని ఆయనకు అనిపించివుండవచ్చు.


వారంలో సుంకాలు వేయడం, తీయడం ట్రంప్‌కు సులువే. కానీ, దశాబ్దాలుగా నిర్మించుకున్న సరఫరా వ్యవస్థలను కూల్చడానికి పిచ్చోడి చేతిలో చిన్న రాయిచాలు. ఈ పరిణామాలన్నీ ఊహించినవే, మా నిర్ణయాలమీద మాకు నమ్మకం ఉంది, కానీ జనమే భయపడిపోతున్నారు అని ట్రంప్‌ బృందం సమర్థించుకోవడం విచిత్రం. మిగతా ప్రపంచంతో ఒప్పందాలు చేసుకోవడం, చైనాను ఒంటరిచేయడం లక్ష్యంగా తమ ఎత్తులు సాగుతున్నాయని అమెరికా చెప్పుకుంటోంది. కానీ, ప్రపంచ వాణిజ్యంలో ఈ రెండు అగ్రదేశాల వాటా 40శాతం పైనే ఉన్నందున, అది సృష్టించబోయే విధ్వంసం అంచనాలకు అందనిది. ఏ యుద్ధానికైనా సిద్ధమే, చైనీయులు దేనికీ భయపడరని చైనా ప్రకటించింది. తన భౌగోళికార్థిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికీ, విస్తరించడానికీ వాణిజ్యయుద్ధాన్ని వాడుకోవాలని అది అనుకుంటోంది. ఆప్తమిత్రదేశాలు అమెరికాకు దూరమవుతున్న స్థితిలో చైనాకు సన్నిహితమవుతున్నవారి సంఖ్య సహజంగానే హెచ్చుతుంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగినా మేము ఎప్పటికీ లొంగం... విజయం సాధించేవరకూ పోరాడతాం అంటూ 1953లో మావో చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు ప్రచారంలో పెడుతూ చైనా తన పోరాటాన్ని ఏ స్థాయికైనా తీసుకుపోవడానికి సిద్ధపడుతోంది. అధ్యక్షుడికి ఉండే విశేషాధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రపంచవాణిజ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న ట్రంప్‌ మీద ఇప్పటికైనా నియంత్రణలు ఉండాలి. స్వపక్ష, ప్రతిపక్షాలు, చట్టసభలు, న్యాయస్థానాలు అమెరికా సంక్షేమం దృష్ట్యా రంగంలోకి దిగాలి.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 11 , 2025 | 05:03 AM