సుంకాల ప్రకంపనలు
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:43 AM
ప్రపంచంతో అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వాణిజ్యయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. జానపదచిత్రాల్లో ఒకరు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే ఎదుటివారు వారుణాస్త్రాన్ని వాడినట్టుగా ఉంది ఈ ప్రతీకార సుంకాల యుద్ధం...

ప్రపంచంతో అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వాణిజ్యయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. జానపదచిత్రాల్లో ఒకరు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే ఎదుటివారు వారుణాస్త్రాన్ని వాడినట్టుగా ఉంది ఈ ప్రతీకార సుంకాల యుద్ధం. ఏప్రిల్ ఒకటిన తాను ఈ కార్యక్రమాన్ని చేపడితే ఏప్రిల్ ఫూల్ అనుకుంటారని సందేహం కలిగి ఈ కక్షతీర్చుకొనే కార్యక్రమాన్ని మర్నాటికి వాయిదావేశారు. ఆహాఓహో అంటూ చప్పట్లు కొట్టే ఓ బృందాన్ని పక్కనపెట్టుకొని, ‘లిబరేషన్ డే’ పేరిట ఇప్పుడు ఆయన నిర్వహించిన కార్యక్రమాన్ని చూస్తున్నవారికి ట్రంప్ ఎలా కనిపించారో తెలియదు మరి. దేశాల పేర్లన్నీ అక్షరక్రమంలో రాసుకొచ్చి, స్కూలు టీచరు మార్కులు వేస్తున్నట్టుగా ఒక్కోదేశానికీ సుంకాలశాతం నిర్ణయించారు. మిత్ర, శత్రు భేదం లేకుండా ప్రతీకారం తీర్చుకున్నారు. పేదదేశాలనూ మోదేశారు, పెంగ్విన్‌లు నివసించే దీవులమీద కూడా పదిశాతం వడ్డించారు.
గతపాలకుల కుట్రలు నిర్లక్ష్యం కారణంగా రోగానపడిన దేశాన్ని ఈ చర్యతో ఉద్ధరించానని ట్రంప్ చెప్పుకున్నారు. దేశం ఆర్థికంగా కళకళలాడుతుందని, పారిశ్రామికంగా పరుగులుపెడుతుందని, తయారీరంగం ఎదిగి ఉద్యోగ ఉపాధులు వెల్లివిరుస్తాయని గొప్పలకు పోయారు. ప్రత్యక్షయుద్ధాల తరువాత యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ఈ వాణిజ్యయుద్ధంలో అభివృద్ధిచెందుతున్న దేశాలు ప్రధానంగా బలికావచ్చు. ఆపరేషన్ ముగిసింది, రోగి మరింత ఆరోగ్యంగా ఉన్నాడని ట్రంప్ ఈ కార్యక్రమం అనంతరం గొప్పలకు పోయారు కానీ, అమెరికా ఆర్థికవ్యవస్థకు ఈ నిర్ణయం అత్యంత కీడు చేకూర్చబోతున్నదని విశ్లేషకుల అంచనా. అసత్యాలు, అర్థసత్యాలతో, పునరుజ్జీవం వంటిమాటలతో ఆయన ప్రజలను మభ్యపెడుతున్నారని, మాంద్యంవైపు దేశాన్ని నెట్టేస్తున్నారని విమర్శలు తీవ్రమైనాయి. ఈ సుంకాల శాతాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించారన్న ప్రశ్నలూ వినబడుతున్నాయి. సుంకాల్లో తేడా బట్టికాక, ప్రధానంగా ఆయాదేశాలతో ఉన్న వాణిజ్య లోటు ఆధారంగా ఈ రేట్ల నిర్ణయం జరిగినట్టు కొందరి అనుమానం. పరస్పర ఆధారిత ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ, అమెరికాను ఉన్నతంగా నిలబెడతానంటున్న ట్రంప్ తమను నరకంవైపు నడుపుతున్నాడని అమెరికన్లకు అర్థంకావడానికి కొంతసమయం పడుతుంది. వారికి కర్తవ్యం బోధపడేవరకూ మిగతా ప్రపంచం ట్రంప్ దూకుడు భరించక తప్పదు.
మోదీ మంచిమిత్రుడే కానీ, మనలను సరిగా చూడడం లేదంటూ ట్రంప్ ఎప్పటిలాగానే అదే ఆరోపణచేశారు. ఆయన ఏదో హడావుడిలో 26 అన్నారు గానీ, భారత్‌మీద 27శాతం టారిఫ్ విధించినట్టు వైట్‌హౌస్ తరువాత సరిదిద్దింది. చాలాదేశాల విషయంలో ఇదే గందరగోళం. ఇక, సుంకాలదెబ్బనుంచి మన ఫార్మారంగాన్ని మినహాయించడం అమెరికాకు అత్యవశ్యకం కావచ్చుగానీ, అత్యధిక ఎగుమతులు జరుపుతున్న ఇక్కడి జనరిక్ ఔషధరంగానికి ఊరటనిచ్చే అంశం. చైనా, వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలమీద ట్రంప్ అత్యధికటారిఫ్‌లు విధించడం మనకు టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్ తదితర కొన్ని కీలక రంగాల్లో ఆధిపత్యం పెంచుకోవడానికి కొత్త అవకాశమని కొందరి విశ్లేషణ. సెమీకండక్టర్లలో అగ్రగామిగా ఉన్న తైవాన్‌కు ట్రంప్ పెట్టిన వాతను మనకు అనుకూలంగా మార్చుకోవడం ఎలా? అన్న చర్చలూ నడుస్తున్నాయి. అయితే, లబ్ధి అందిపుచ్చుకోగలిగే స్థితిలో మనం ఉన్నామా అన్నది ప్రశ్న. మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు, గరిష్ట ఉత్పత్తి స్థాయి ఇత్యాది అంశాలమీద సదరు ప్రయోజనం ఆధారపడివుంటుంది.
ట్రంప్ టారిఫ్‌లతో అన్నిరంగాలు దెబ్బతింటాయని, ఆర్థికవ్యవస్థ అతలాకుతలం అవుతుందని విపక్షనేత రాహుల్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇంకా సాగిలబడుతూనే ఉంటారా, ఇకనైనా నిలబడతారా? అని ఓ ప్రశ్నవేశారు. ట్రంప్‌తో వ్యవహరించడం ఎలా? అన్నది మోదీని చూసి నేర్చుకోవాలని అమెరికా పెద్దలు, మీడియా వ్యాఖ్యాతలు ఇటీవలే ఓ వ్యాఖ్య చేశారు. ట్రంప్‌తో తొలిభేటీకి ముందే భారతదేశం ఇంధనాలు, ఆయుధాల కొనుగోలు వంటి పలు నిర్ణయాలతో ఆయనను ప్రసన్నం చేసుకుంది. విస్కీనుంచి విలాసవంతమైన కార్లవరకూ పన్నులు తగ్గించి మస్క్‌ను సైతం మచ్చిక చేసుకుంది. ముందుగానే వాణిజ్యచర్చలు ఆరంభించి, ఈ ఏడాది చివర్లోగా ద్వైపాక్షిక ఒప్పందానికి మార్గం సుగమం చేసుకుంది. ఆ ఒప్పందంలో మనం నిటారుగా నిలబడి స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించగలమా అన్నది ప్రధానం. ప్రస్తుతానికి సుంకాల యుద్ధంనుంచి తప్పించుకోలేకపోయినా, త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని, ఇతరత్రా ప్రయోజనాలు, అవసరాల రీత్యా భారత్‌తో ట్రంప్ లెక్కలు వేరుగా ఉంటాయని ఆశించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News And Telugu News