చైనాతో మైత్రి
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:52 AM
భారత్–చైనా దౌత్యసంబంధాలకు డెబ్బైఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏనుగు–డ్రాగన్ తరహాలో ఇరుదేశాల సంబంధాలు ఎదగాలనీ, బలోపేతం...

భారత్–చైనా దౌత్యసంబంధాలకు డెబ్బైఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏనుగు–డ్రాగన్ తరహాలో ఇరుదేశాల సంబంధాలు ఎదగాలనీ, బలోపేతం కావాలని అనడమే కాక, శాంతియుతంగా ఉండేందుకు మార్గాలను అన్వేషించుకోవాలని, సంప్రదింపులను, సమన్వయాన్ని పెంచుకోవాలని, కలసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. రెండుదేశాలూ పురాతన నాగరికతలనీ, అభివృద్ధిచెందుతున్నవనీ, ఆధునికీకరణలో కీలకదశలో ఉన్నాయని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి కూడా సానుకూల వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్రపతి, ప్రధాని సైతం తమ సందేశాల్లో సత్సంబంధాలను ఆకాంక్షించారు. పరస్పర విశ్వాసాన్ని కలిగించే చర్యలు, నమ్మకమైన నడవడిక సంబంధాలను బలోపేతం చేస్తాయన్నారు. భారత్–చైనా బంధం కేవలం ఈ రెండుదేశాల సుస్థిరాభివృద్ధికి మాత్రమే కాక, మిగతా ప్రపంచం క్షేమానికీ, సంక్షేమానికీ అవసరమని ఉభయదేశాల నేతలు ఈ సందేశాల్లో అభిప్రాయపడ్డారు. ఈ డెబ్బైఐదేళ్ళ సందర్భాన్ని ఒక అవకాశంగా, ఆధారంగా స్వీకరించి, ఉజ్వల భవిష్యత్ నిర్మాణానికి పునరంకితం కావాలని, పరస్పరం సహకరించుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కాస్తంత తేడాలు ఉండవచ్చును కానీ, సందర్భానుసారం ఈ మంచిమాటలు చెప్పుకోవడంలో భారత్–చైనా నాయకులు ఒకరికొకరు తీసిపోలేదు.
చైనా కాన్సుల్ జనరల్ కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్ ఆర్థికప్రగతిని మెచ్చుకున్న విషయం మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. హిందీ చీనీ భాయ్‌భాయ్ అంటూ ఆయన భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించి మెచ్చుకున్నారు. గతంలోనూ చైనా ప్రశంసలు కురిపించడం, ఆ తరువాత పూర్తిభిన్నంగా దుశ్చర్యలకు పాల్పడటం తెలిసిందే. చైనాను నమ్మలేం, ఓ కన్నువేసి ఉంచాల్సిందే అన్న హెచ్చరిక విశ్లేషకుల నుంచి వినిపిస్తూనే ఉంటుంది. ఉభయదేశాల దౌత్యసంబంధాలకు డెబ్బయ్ ఏళ్లయిన సందర్భంలో 2020 ఏప్రిల్ 1న ఇలాగే అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చైనా అధ్యక్షుడితో శుభాకాంక్షలు పంచుకోవడం, సత్సంబంధాలు కాంక్షించడం, ఉభయులూ సంకల్పాలు చెప్పుకోవడం, ఆ తరువాత, వరుస సరిహద్దు చొరబాట్లు, గాల్వాన్ తరహా ఘాతుకాలతో సంబంధాలు పూర్తిగా అడుగంటిపోవడం తెలిసిందే. ఐదేళ్ళ తరువాత ఇరుదేశాల నాయకులు మళ్ళీ ఈ ఏప్రిల్ 1 సందర్భాన్ని గుర్తుచేసుకోవడం విశేషం. 1950 ఏప్రిల్ 1న కమ్యూనిస్టుపార్టీ నేతృత్వంలోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో దౌత్యసంబంధాలు నెలకొల్పుకున్న దాదాపు దశాబ్దం వరకూ వ్యవహారం భాయీభాయీగానే ఉంది. కానీ, సరిహద్దులు సరిగ్గాలేని ఈ రెండుదేశాల మధ్యా 1962లో జరిగిన యుద్ధం పరిస్థితులను ఒక్కసారిగా తలకిందులు చేసింది. అనంతరకాలంలో అవిశ్వాసం ఎంత హెచ్చినా, ఏవో కొన్ని ఒప్పందాలో, అవగాహనలో, అవసరాలో కారణంగా దశాబ్దాల పాటు సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నదీ నిజమే. అయితే, ఇటీవలి కాలంలో అమెరికాతో మన సాన్నిహిత్యం ఆయుధాల కొనుగోలు దాటి ఆలింగనాల వరకూ హెచ్చడంతో సరిహద్దుల్లో చైనా చొరబడటమూ, అడపాదడపా మనలను కవ్వించడమూ పెరిగింది. ఎవరి ఏలుబడిలో చైనా మన భూభాగాన్ని ఎక్కువగా దురాక్రమించిందన్న విమర్శలనూ, వాదోపవాదాలను రాజకీయపక్షాలకు వదిలేస్తే, మొన్నటివరకూ ఉన్న ఉద్రిక్తపరిస్థితి ఇప్పుడు కాస్తంత కరిగి గాడినపడుతున్న వాతావరణమైతే కనిపిస్తోంది.
భారత్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటామని, వాణిజ్యం పెంచుకుంటామని, అన్ని రంగాల్లో సహకరిస్తామని చైనా దౌత్యప్రతినిధులు ప్రస్తుత సందర్భంలో హామీలు కురిపిస్తున్నారు. భారతీయ సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు. ఈ అమిత ప్రేమ వెనుక ట్రంప్ టారిఫ్ కత్తి ప్రధానంగా పనిచేస్తుండవచ్చు. సుంకాల ప్రతీకారాలు ఉధృతమవుతున్న తరుణంలో ఇలా కొన్ని మంచి మాటలు వినబడటం సహజం. చైనా విషయంలో ట్రంప్ వాణిజ్యయుద్ధానికి మాత్రమే పరిమితం కాబోరనీ, యూరప్‌తో తెగదెంపులు చేసుకొని, రష్యాతో చేయికలిపి, చైనాను ఢీకొట్టేందుకు ఆయన వేగంగా అడుగులువేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. చైనా దూకుడుకు కళ్ళెం వేయడానికి ఈ ప్రాంతంలో అమెరికా పక్షాన వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ, ట్రంప్‌ను పూర్తిగా నమ్మి, చైనాతో సంబంధాలు సమూలంగా నాశనం చేసుకోవాల్సిన అవసరమైతే లేదు. పరిస్థితులు కాస్తంత గాడినపడుతున్న తరుణంలో ఉభయదేశాల మధ్యా ఒక సరికొత్త ఆరంభానికి అవకాశం లేకపోలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News