Tahawwur Rana Extradition: దౌత్య విజయం
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:46 AM
తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కి అప్పగించి, ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి విచారణకు తెచ్చారు. రాణా చెప్పబోయే విషయాలు పాకిస్థాన్‌పై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు

ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవ్వుర్ రాణా అమెరికా జైలునుంచి ఎన్‌ఐఏ కస్టడీలోకి వచ్చాడు. 26/11 మారణకాండకు పదిహేడేళ్లవుతున్న తరుణంలో భారతదేశం ఇతడిని విచారించేందుకు సిద్ధపడుతోంది. అప్పగింతను అడ్డుకోవడానికి అమెరికాలో తనకున్న అన్ని అవకాశాలను ఆయన వాడుకున్నాడు. ఆ దేశాధ్యక్షుడితో పాటు అక్కడి న్యాయస్థానాలు కూడా సహాయనిరాకరణ చేయడంతో ఇతడు అంతిమంగా భారత్ చేరక తప్పలేదు. రాణాను హింసించబోమని, ప్రాణాలకు ప్రమాదం రానివ్వబోమని, కేసుకు పరిమితమై మర్యాదగా ప్రశ్నిస్తామని మాట ఇచ్చి తెచ్చుకున్నదానికి అనుగుణంగానే ఇక్కడి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అప్పగింతలు మొదలు, ఆయన ప్రయాణించిన విమానం, అది వచ్చిన దారి, ఇక్కడి న్యాయస్థానాల్లో ఎన్‌ఐఏ అభ్యర్థనలు ఇత్యాది వివరాలు విశేషాలతో టెలివిజన్ చానెళ్ళు హోరెత్తిపోతున్నాయి. రాణా చెప్పబోయేది ఏమిటి, విప్పబోయే గుట్టుతో పాకిస్థాన్ పని అయిపోయినట్టేనా, భారతదేశంలో సైతం కొందరికి సమస్యలు తప్పవా ఇత్యాది ప్రశ్నలతో మీడియా హడావుడిపడుతోంది. రాణాను రప్పించిన ఘనతమాదేనని, మోదీ ప్రభావ ప్రాభవాల వల్లే ఇది సాధ్యమైందని బీజేపీ నాయకులు అదేపనిగా అంటూండటంతో కాంగ్రెస్‌కు ఆగ్రహం కలిగింది.
మన్మోహన్‌సింగ్ కాలంలోనే ఈ ప్రక్రియకు పునాదిపడిందని ఆ పార్టీ గుర్తుచేసింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన ఆరంభించకముందే, ఆ దేశంనుంచి ఇంధన, ఆయుధ కొనుగోళ్ళకు, అమెరికా ఉత్పత్తులపై సుంకాల సడలింపులూ రాయితీలకు సిద్ధపడి, వాటికి బదులుగా ఈ వృద్ధ ఉగ్రవాదిని తెచ్చుకున్నారని గిట్టనివారు ఆడిపోసుకున్నారు కూడా. ఈ విమర్శలను అటుంచితే, 170మంది ప్రాణాలను బలితీసుకున్న ఒక ఉగ్రవాదిని ఇలా రప్పించి, ఈ దేశ చట్టాలకు అనుగుణంగా, ఈ భూమిమీద శిక్షించడానికి మార్గం సుగమం చేసుకోవడం కచ్చితంగా స్వాగతించాల్సిన అంశం. తెలీదు, గుర్తులేదు అంటూ నిన్నటిమొన్నటి కేసుల్లోనే నిందితులు, సాక్షులు తేల్చేస్తూంటే తహవ్వుర్ రాణానుంచి ఇప్పుడు కొత్తగా రాబట్టగలిగేది, తవ్వితీయగలిగేది ఏమైనా ఉంటుందా అన్నది ప్రశ్న. ఉగ్రదాడుల కుట్రలు, పన్నాగాలకు సంబంధించి అదనంగా ఓ నాలుగు విషయాలు చెప్పగలిగినా ఆయన సహాయకుడు మాత్రమేనన్నది వాస్తవం. లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్, దాని కార్యకలాపాల అధినేత లఖ్వీ, డేవిడ్ హ్యాడ్లీ వంటివారు సూత్రధారులు, పాత్రధారులుగా సాగిన ఈ విధ్వంసంలో హ్యాడ్లీ నేరుగా సంభాషిస్తూ వచ్చిన ఐఎస్‌ఐ అధికారి ఇక్పాల్ కూడా కీలకభూమిక నిర్వహించిన విషయం తెలిసిందే. డేవిడ్ హ్యాడ్లీ అనే దావూద్ గిలానీ తన మిత్రుడైన రాణాను వాడుకొని పనిచక్కబెట్టుకున్న దశలో ఈయనకు అదనంగా తెలిసింది ఎంత, అందులో ఇప్పుడు చెప్పబోయేది ఎంత అన్నది చూడాలి. మొత్తం గొలుసుకట్టులో రాణా స్థానం ఎక్కడ అన్నది ప్రధానం.
ఈ అపనమ్మకం కారణంగానే ఇతడిని బిర్యానీ ఖైదీ అని కూడా కొందరు తీసిపారేస్తున్నారు. అమెరికాకు నిజంగానే ముంబైఘోరం విషయంలో పట్టింపు, బాధిత కుటుంబీకులపట్ల సానుభూతి ఉండివుంటే భారత్‌కు అప్పగించబోనని హామీ ఇచ్చి డేవిడ్ హ్యాడ్లీతో ఒప్పందం చేసుకొనేది కాదు. ఇక, హఫీజ్ సయీద్‌కు సంబంధించిన సమాచారానికి 2012లో భారీ పారితోషికం ప్రకటించిన అమెరికా ఆ తరువాత అతడు పాకిస్థాన్‌లో బహిరంగంగా తిరుగుతున్నా, సభల్లో ప్రసంగాలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఆరుగురు అమెరికన్లతో సహా బాధితులందరికీ న్యాయం దక్కడానికి రాణా కీలకమని వ్యాఖ్యానిస్తూ ఆయనను పాకిస్థాన్ మూలాలున్నవాడిగా అమెరికా ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తుచేస్తోంది. ఇరవైయేళ్ళుగా అతడితో తనకు సంబంధం లేదని విడుదల రోజునే పాకిస్థాన్ చేతులు దులిపేసుకుంది. ముంబై ఉగ్రదాడుల కుట్రలమీద గతంలో ఇచ్చిన విస్తృత సమాచారాన్ని కూడా అది అవహేళన చేసి, అటకెక్కించేసింది. రాణా భారత్ రాక, ఇక్కడి విచారణ పాకిస్థాన్‌మీద ఒత్తిడిపెంచి, హఫీజ్ సయీద్ సహా లష్కర్ కమాండర్లను శిక్షించేందుకు దారితీస్తుందని కొందరి నమ్మకం. ముంబై ఉగ్రదాడి బాధిత కుటుంబాలవారికి ఇప్పటివరకూ దక్కిన ఉపశమనమల్లా అజ్మల్ కసబ్‌ను ప్రత్యక్షంగా పట్టుకొని, విచారించి, సంఘటన జరిగిన నాలుగేళ్ళలోనే మనం ఉరితీయగలగడం. ఎంతో కష్టపడి, ఇంతకాలానికి దేశానికి తెచ్చుకోగలిగిన తహవ్వూర్ రాణా విషయంలో మనం ఎంతవేగంగా, ఏ మాత్రం చేయగలుగుతామో చూడాలి.