Waqf Act 2025 Amendment: ముస్లింలపై మరో దాడి
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:47 AM
వక్ఫ్ చట్టం 2025లో అనేక సవరణలు తీసుకురావడం ద్వారా ముస్లిం మత సంస్థలు మరియు వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణ పెరిగింది. ఈ సవరణలు ముస్లింల హక్కులను దృష్టిలో పెట్టుకుని నెమ్మదిగా దాడి చేస్తున్నట్లు వివాదాలను రేకెత్తిస్తున్నాయి

స్వాతంత్ర్య తొలి దశాబ్దంలో తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం–1954ను రద్దు చేస్తూ పార్లమెంటు 1995లో కొత్త వక్ఫ్ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టానికి 2013లో ప్రధాన సవరణలు చేశారు. జరిగిన సవరణలు 57 అని నా లెక్కలో తేలింది. దాదాపు 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరి ప్రయోజనాల కోసమయితే ఆ చట్టాన్ని చేశారో వారు ఏమైనా ఫిర్యాదులు చేస్తే వాటి ఆధారంగా కొత్త సవరణలు తప్పనిసరి అని లేదా లాభదాయకమని ప్రభుత్వం విశ్వసించిన పక్షంలో సవరణల బిల్లు ద్వారా సదరు చట్టంలో సంస్కరణలు తీసుకురావచ్చు. అయితే వక్ఫ్ (సవరణ) బిల్లు–2025 చేసింది వక్ఫ్ చట్టాన్ని సంస్కరించడం ఎంత మాత్రం కాదు. అందుకు విరుద్ధంగా ప్రస్తుతమున్న చట్టాన్ని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన సొంత ఉద్దేశాలతో గుర్తించడానికి వీలు లేకుండా వికృతం చేసింది. ఒక అసమగ్ర చట్టాన్ని తీసుకువచ్చింది. బహుళ మతాలు విలసిల్లుతున్న ఒక ప్రజాస్వామిక దేశంలో గౌరవించవలసిన మొదటి సూత్రం అన్ని మతాలు సమానమే అన్నది కాదూ? ఏదైనా ఒక మతానికి చెందిన మత సంస్థల నిర్వహణ అనేది విధిగా అదే మతస్థుల చేతుల్లో ఉండితీరాలి. హిందూ మతస్థులు అత్యధికంగా ఉన్న భారత్‌లో ఆ సూత్రం హిందూ దేవాదాయ, ధర్మాదాయ సంస్థలు అన్నిటికీ ఎటువంటి మినహాయింపు లేకుండా వర్తింప చేస్తున్నారు. ‘మైనారిటీ’ మతాల విషయంలోనూ ఈ సూత్రాన్ని భారత రాజ్యాంగం ప్రకారం వర్తింప చేస్తున్నారు.
మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛ అనే విషయమై భారత రాజ్యాంగ అధికరణ 26 ఇలా నిర్దేశించింది: ‘ప్రజా సంక్షేమం, ఆరోగ్యకరమైన నైతికతలకు లోబడి మత సంస్థల నిర్వహణకు సంబంధించి ప్రతి మతానికి ఈ క్రింద ఉదహరింపబడిన స్వేచ్ఛ ఉంటుంది– మత, ధార్మిక సంస్థల సంస్థాపన, నిర్వహణ; మత విషయాల సంబంధిత కార్యకలాపాలను తమకుతామే నిర్వహించుకొనుట; స్థిర, చరాస్తులను సమకూర్చుకొనుట; చట్టం ప్రకారం సదరు స్థిర, చరాస్తుల నిర్వహణ. హిందూ మత సంస్థలు, దాతృత్వ సంస్థల పాలనా వ్యవహారాలను హిందువులు మాత్రమే నిర్వహిస్తున్నారు. హిందూ దేవాలయాలు, మత సంస్థలు, దాతృత్వ సంస్థల నిర్వహణ, పాలనా వ్యవహారాలలో హిందూయేతరులకు పాత్ర కల్పించాలని ఎవరూ సూచించరు, హిందువులు ఎవరూ అటువంటి సూచనను అంగీకరించబోరు. ఇది స్పష్టం. (అసలు హిందూయేతరులు ఎవరినీ తిరుమల–తిరుపతి దేవస్థానంలో కనీసం ఉద్యోగులుగా కూడా నియమించకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు). ఇతర మతాలకు చెందిన కోట్లాది అనుయాయులు కూడా అదే అభిప్రాయాన్ని కలిగివున్నారు. ప్రస్తుతం హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ మతాలకు సంబంధించిన ఆరాధనా మందిరాలు, దాతృత్వ సంస్థలలో ఏ ఇతర మతానికి చెందిన వ్యక్తికి పాత్ర కల్పించేందకు చట్టాలు అనుమతించడం లేదు. వక్ఫ్ చట్టం–1995 కింద ఆ సూత్రాన్ని నిష్ఠాబద్ధంగా పాటించారు. వక్ఫ్ అంటే ముస్లిం చట్టం గుర్తించిన ధార్మిక, మత, దాతృత్వ కార్యకలాపాల కోసం ఏ వ్యక్తి అయినా ఆస్తిని శాశ్వతంగా సమర్పించడం. ముస్లిమేతరులు సృష్టించిన వక్ఫ్‌లను సైతం న్యాయస్థానాలు గుర్తించడం జరిగింది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.
అంతేకాకుండా ప్రస్తుతమున్న చట్టం ప్రకారం ఒక వక్ఫ్ అనేది చాలవరకు స్వతంత్ర, స్వయంపాలిత ఆస్తి. రాష్ట్రాల స్థాయిలో వక్ఫ్ ఆస్తుల నియంత్రణకు అత్యున్నత సంస్థ వక్ఫ్ బోర్డు. ఇందులో సభ్యులు అందరూ విధిగా ముస్లింలే ఉంటారు. ఛీఫ్ ఎక్జిక్యూటివ్ అధికారి సైతం ముస్లిమే అయివుండాలి. ఈ బోర్డు తన అధికారాలను వక్ఫ్ ఆదేశాలకు, వక్ఫ్ లక్ష్యాలకు, వక్ఫ్ ఆచారాలు, ఉపయోగాలకు అనుగుణంగా చెలాయించాలి. వక్ఫ్ ఆస్తులపై న్యాయ నిర్ణయాలు తీసుకునే అధికారం ఒక ట్రిబ్యునల్‌కే ఉంటుంది. ఈ న్యాయాధికార సంస్థకు జిల్లా జడ్జి చైర్‌పర్సన్‌గా ఉంటారు. వివాదాస్పద సవరణ బిల్లు ఎంతో కాలంగా ఉన్న సూత్రాలు, ఆచరణలను తలకిందులు చేసింది: (1) ‘ఏ వ్యక్తి అయినా’ ఒక వక్ఫ్‌ను సృష్టించలేడు; కనీసం ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను ఆచరిస్తున్నానని నిరూపించిన వ్యక్తి మాత్రమే ఒక వక్ఫ్‌ను సృష్టించాలి. ఎందుకు? ఒక వ్యక్తి తాను ఇస్లాంను ఆచరిస్తున్నానని ఎలా నిరూపించాలి? సమాధానం లేదు. (2) ఒక వక్ఫ్ సృష్టికర్త తన చర్యవెనుక ఎటువంటి ‘వంచనాపూర్వక ఎత్తుగడ’ లేదని నిరూపించాలి. ‘వంచనాపూర్వక ఎత్తుగడ’ అంటే ఏమిటి? సమాధానం లేదు; (3) వక్ఫ్‌గా సమర్పించిన ఆస్తి ‘ప్రభుత్వ’ ఆస్తి అని వాదన వస్తే దాని నిజానిజాలపై సీనియర్ ప్రభుత్వాధికారి విచారణ నిర్వహించాలి.
సదరు వక్ఫ్ ప్రభుత్వ ఆస్తి అవునో కాదో ఆ విచరాణాధికారి నిర్ణయిస్తాడు. ప్రభుత్వ ఆస్తి అని నిర్ధారించినపక్షంలో ఆ అధికారి అందుకు సంబంధించి రెవెన్యూ రికార్డులలో సవరణలు చేయాలి. ఇది న్యాయమూర్తి తన సొంత కేసులో తానే తీర్పు ఇవ్వడం’లాంటిది కాదా? ఈ ప్రశ్నకూ సమాధానం లేదు. (4) రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు ముస్లింలే అయి ఉండాలన్న నిబంధనను తొలగించారు. ఈ ప్రకారం ముస్లిమేతరులను కూడా వక్ఫ్ బోర్డులో నియమితులవుతారు. మరి దురుద్దేశాలతో వ్యవహరించే ఒక ప్రభుత్వం ముస్లిమేతరులనే ఎక్కువగా వక్ఫ్ బోర్డు సభ్యులుగా నియమించవచ్చు. ఇదొక తిరోగామి నిబంధన. మరి దీన్ని ఇతర మతాల సంస్థల పాలనావ్యవహారాలకు కూడా వర్తింపచేస్తారా? హిందూ మత/ దాతృత్వ సంస్థలలో హిందూయేతరులను నియమిస్తారా? సమాధానం లేదు; (5) వక్ఫ్ (సవరణ) బిల్లు నమూనా అద్వితీయమైనది. దీని స్ఫూర్తితో ఇతర మతాల సంస్థలకు సంబంధించిన చట్టాలలో కూడా సవరణలు చేస్తారా? బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలపై దాడిని జాతీయ పౌరుల పట్టిక/ పౌరసత్వ సవరణ చట్టంతో ప్రారంభించింది.
ఉమ్మడి పౌర స్మృతిని తొలుత ఉత్తరాఖండ్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఏకైక రాష్ట్రం జమ్మూ–కశ్మీర్‌ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయికి కుదించారు. 2019–20 నుంచి 2023–24 దాకా మైనారిటీలకు మొత్తం రూ.18,274 కోట్ల మేరకు బడ్జెట్ కేటాయింపులు చేశారు. అయితే ఆ మొత్తంలో రూ. 3,574 కోట్ల ఖర్చు పెట్టనే లేదు. మౌలానా ఆజాద్ ఫెలోషిప్ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్‌తో సహా ముస్లింలకు అందిస్తున్న విద్యాసంబంధ సహాయాన్ని నిలిపివేశారు. వక్ఫ్ (సవరణ) బిల్లు ముస్లిం మతస్థులపై మరో దాడి, సందేహం లేదు. అదొక దుష్టయోచన ఫలితమని స్పష్టమవుతోంది. గత ఏడాది 18వ లోక్‌సభ ఎన్నికలలో ఓటర్లు తమకు ఇచ్చింది 240 సీట్లు మాత్రమే అయినప్పటికీ ప్రజల వైఖర్లు, అభిప్రాయాలు ఏమీ మారలేదని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. 17వ లోక్‌సభ కాలంలో అనుసరించిన రాజకీయ అజెండానే జాతీయ పాలక పార్టీ ఇప్పుడూ ఔదలదాల్చుతోంది. మార్పులేని ఆ అజెండానే అమలు పరిచేందుకు బీజేపీ నిశ్చయించుకుంది. అందులో భాగమే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన కొత్త వక్ఫ్ చట్టం.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)