మోడల్‌తో మెరుగ్గా
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:43 AM
ఐదు రకాల బడులతో ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణను చేపట్టిన విద్యా శాఖ ఆ మేరకు జిల్లాలో కార్యాచరణను వేగవం తం చేసింది.

248 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలతో ఐదు రకాల బడులకు శ్రీకారం
నేడు ఎస్‌ఎంసీల చైర్మన్ల తీర్మానాలు పంపాలని ఆదేశం
ఏలూరు అర్బన్/భీమవరం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఐదు రకాల బడులతో ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణను చేపట్టిన విద్యా శాఖ ఆ మేరకు జిల్లాలో కార్యాచరణను వేగవం తం చేసింది. నూతన పాఠశాలల విధానంపై పలుమార్లు క్షేత్రస్థాయిలో కసరత్తు చేసిన విద్యాధి కారులు కొన్నిచోట్ల స్థానికంగా వచ్చిన అభ్యంతరా లను పరిష్కరించి ఐదు రకాల బడులకు తుది రూపునిచ్చారు. వీటిని వేసవి సెలవుల అనంతరం ప్రారంభించేలా ఆయా పాఠశాలలకు విద్యార్థుల మ్యాపింగ్, టీచర్ పోస్టుల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై నిర్ణయానికి వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1392 పాఠశాలలు కాస్తా 1,420కు పెరిగాయి. వీటిలో 248 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు), 724 బేసిక్ ప్రైమరీ పాఠ శాలలుగా నిర్ణయించారు. వీటితోపాటు 178 ఫౌండేషన్ పాఠశాలలు, 36 ప్రాథమికోన్నత, 234 ఉన్నత పాఠశాలలుగా విభజిస్తూ ఐదు రకాల బడులతో పునర్వ్యవస్థీకరణను పూర్తిచేశారు.
ఆ ప్రకారం పశ్చిమవ్యాప్తంగా పంచాయతీల్లో బడి ఈడుగల పిల్లల సంఖ్యకు అనుగుణంగా వచ్చే జూన్ నుంచి 248 ఆదర్శ ప్రాథమిక పాఠ శాల (ఎంపీఎస్)లను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించేలా ప్రారంభించాలని నిర్ణ యించారు. ఈ పాఠశాలలకు ఐదు టీచర్ పోస్టు లను కేటాయిస్తారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాల లుగా కొనసాగుతున్న వీటిలో కొన్నింటికి ప్రస్తు తం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండగా, తాజాగా మరో మూడు పోస్టులను కేటాయించి, ఈ మూడు పోస్టులను త్వరలో జరగనున్న ఉపాధ్యా యుల సాధారణ బదిలీల కౌన్సెలింగ్‌లో వేకెన్సీలు గా ప్రదర్శిస్తారు. ఇక సంతృప్తికర స్థాయిలో విద్యా ర్థులు లేకపోవడం, సహజసిద్ధంగా ఏర్పడిన చెరువులు, తదితర అడ్డంకుల కారణంగా విలీనా నికి అవకాశం లేనిచోట ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ కొనసాగేలా బేసిక్ ప్రైమరీ పాఠశాల(బీపీఎస్)లను ఏర్పాటు చేయాలని నిర్ణ యించారు. కేవలం పీపీ–1, పీపీ–2(ఎల్‌కేజీ, యూ కేజీ) తరగతులు, ఒకటో తరగతి, రెండో తరగ తులతో కూడిన ఫౌండేషన్ స్కూల్స్(ఎఫ్‌ఎస్) ప్రారంభించనున్నారు.
ఐదు రకాల బడులను ఆయా పాఠశాలల మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)ల తీర్మానాలతో నిర్ణయించగా, క్షేత్రస్థాయి నుంచి అందిన పాఠశా లల పునర్వ్యవస్థీకరణ సరిగా జరిగిందా? లేక ఎక్కడైనా తప్పుదోవ పట్టిం చారా? అనే విషయాలను తుదిగా నిర్ధారించుకునేందుకు ప్రభుత్వం తాజాగా ఉపక్రమించింది. ఇందులో భాగంగానే జిల్లాలోని పాఠశాలల్లోని ఎస్‌ఎంసీల చైర్మన్లు సంతకం చేసిన తీర్మానాల కాపీలను తీసుకుని శుక్రవారం మధ్యా హ్నంలోగా విద్యా శాఖ డైరెక్టరేట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే బాధ్యతలను పాఠశాలల హెచ్‌ఎంలకు అప్పగించింది. ఈ తీర్మానాలు అందిన తర్వాతే పాఠశాలల వారీగా విద్యార్ధుల సంఖ్య, దానికనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ధారిస్తారు. ఈ డేటాతోనే బదిలీలు, పదోన్నతులు చేపడతారు.