Hair Oiling Mistakes: జుట్టుకు రోజూ నూనె రాసుకుంటారా.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ABN , Publish Date - Apr 05 , 2025 | 07:24 PM
నెత్తికి నూనె రాసుకునే వారు తెలియక చేసే కొన్ని పొరపాట్లు కారణంగా హెయిర్‌ఫాల్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

జుట్టు ఆరోగ్యం కోసం భారతీయులు అనాదిగా నూనె రాసుకుంటూ ఉంటారు. నూనె రాసుకుంటే కుదుళ్ల నుంచి జుట్టు బలోపేతం అవుతుందని భారతీయులు నమ్ముతారు. కొబ్బరి నూనె రాుకుంటే జుట్టుకు కావాల్సిన తేమ అందుతుంది. నిగనిగలాడుతూ ఒత్తుగా పెరుగుతుంది. నూనె నెత్తిపై చర్మంలోకి చొచ్చుకెళ్లి జుట్టు ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. కుదుళ్లకు తగినంత తేమ సమకూరేలా చేసి పాడుకాకుండా రక్షిస్తుంది.
జుట్టుకు నూనె రాసుకుంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ తెలీక చేసే కొన్ని పొరపాట్లు హాని కలుగ జేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి జనాలు నెత్తికి నూనె రాసుకునేటప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇబ్బందులు తెచ్చిపెట్టే పొరపాట్లు ఇవే..
ఆయిలీ చర్మం ఉన్న వాళ్లు జుట్టుకు అతిగా నూనె పెట్టుకోకూడదు. దీని వల్ల చర్మం రంధ్రాలు పడుకుపోతాయి. వాటిల్లో దుమ్మూధూళీ చేరుతుంది. దీంతో, ఇరిటేషన్, దురద, ఇతర ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. ఇలాంటి వాళ్లు నెత్తికి నూనె పెట్టుకోకుండా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కొందరు రాత్రిళ్లు నెత్తికి నూనె రాసుకుని తెల్లారాక తల స్నానం చేస్తుంటారు. ఇది కూడా పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా ఇలా నెత్తిపై నిలిచి ఉండే నూనె కారణంగా చర్మ రంధ్రాలు పూడుకుపోతాయి. దుమ్మూధూళీ పేరుకుంటుంది. కాబట్టి, తలస్నానాని కొద్దిగంటల ముందు నూనె పెట్టుకుంటే ఇబ్బందులు చాలా వరకూ తొలగిపోతాయనేది నిపుణులు చెప్పేమాట.
ఇక డాండ్రఫ్‌తో బాధపడే వారు కూడా నెత్తికి నూనె రాసుకోకుండా ఉంటేనే మంచిది. నెత్తిపై పొట్టు రేగే సమస్య నూనె రాసుకుంటే మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు బదులుగా ఇతర హెయిర్ ప్యాక్స్ వాడాలని చెబుతున్నారు. దీంతో, వల్ల నెత్తిపై చికాకు తగ్గి చర్మం ఆరోగ్యం ఇనుమడిస్తుందని అంటున్నారు.
అతిగా నెత్తి మసాజ్ చేసుకోవడమూ జుట్టుకు నష్టమే. దీని వల్ల జుట్టు బలహీనపడి ఊడిపోతుంది. జుట్టు చివర చిట్లిపోతుంది. దీనికి తోడు గట్టిగా ముడి వేసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది.
నూనె రాసుకున్న తరువాత జుట్టు మరింత సున్నితంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో గట్టిగా జడ వేసుకుంటే వెంట్రుకలు త్వరగా ఊడిపోతాయి. కాబట్టి, నెత్తికి నూనె రాసుకునే సమయంలో ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:
రోజూ 15 నిమిషాల పాటు జాగింత్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..
టాయిలెట్ సీట్లపై కంటే దిండ్ల కవర్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా.. తాజా అధ్యయనంలో వెల్లడి
ఇంట్లో ఏసీ లేదా.. ఇలా చేస్తే ఎండాకాలంలోనూ కూల్ కూల్