ఈ కొత్త బ్రెడ్డు మంచిదేనా..
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:17 AM
మామూలు బ్రెడ్ తయారీలో రొట్టె మృదువుగా, గుల్లగా వచ్చేందుకు ఈస్ట్ వాడతారు. దీని వల్ల రొట్టె పిండి పొంగేందుకు కేవలం ఒకటి రెండు గంటలే పడుతుంది. సోర్ డౌ బ్రెడ్‌ను నెమ్మదిగా, సహజ కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు.

ఈమధ్య కొత్తగా మార్కెట్లో సోర్ డౌ (sour dough) బ్రెడ్ లభిస్తోంది. మామూలు బ్రెడ్‌కు బదులు ఇది తింటే ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?
- ఫణి, విజయవాడ
మామూలు బ్రెడ్ తయారీలో రొట్టె మృదువుగా, గుల్లగా వచ్చేందుకు ఈస్ట్ వాడతారు. దీని వల్ల రొట్టె పిండి పొంగేందుకు కేవలం ఒకటి రెండు గంటలే పడుతుంది. సోర్ డౌ బ్రెడ్‌ను నెమ్మదిగా, సహజ కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. దీని తయారీలో కొన్ని రకాల ఈస్ట్, బ్యాక్టీరియా కలిగిన స్టార్టర్ పిండిని వాడతారు. ఈ ప్రక్రియ లో రొట్టె పిండిలోని పిండి పదార్థాల్లో వచ్చే మార్పుల వల్ల మామూలు బ్రెడ్‌తో పోల్చినపుడు సోర్ డౌ బ్రెడ్ గ్లైసీమిక్ ఇండెక్స్ (రక్తంలో గ్లూకోజు స్థాయిని పెంచే వేగం) కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా బ్రెడ్ తయారీలో మైదా పిండిని వాడతారు. కానీ ఈ మధ్య కాలంలో మార్కెట్లో పీచు పదార్థాలు అధికంగా ఉండే గోధుమ పిండి, చిరు ధాన్యాలతో కూడా బ్రెడ్‌లు లభిస్తున్నాయి. సోర్ డౌ బ్రెడ్ తయారీకి ఎక్కువగా మైదా పిండినే వాడతారు కాబట్టి పోషకాల విషయంలో సాధారణ వైట్ బ్రెడ్‌తో పోలిస్తే పెద్దగా తేడాలేమి ఉండవు. బ్రెడ్ ఏదైనా సమతుల ఆహారంలో భాగంగా పరిమిత మోతాదుల్లో తీసుకొంటేనే మంచిది.
నాకు కంది పప్పు తింటే వేడి చేస్తుందని పెసరపప్పు తింటాను. ఇలా తినడం మంచిదేనా?
- అపర్ణ, చెన్నై
కందిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు మొదలైనవన్నీ పప్పుధాన్యాలు. వీటినే లెంటిల్స్ అంటారు. ప్రతి పప్పుకూ తనదైన ప్రత్యేక పోషక విలువలుంటాయి. అనేక రకాల పోషకాలను పొందేందుకు పప్పు ధాన్యాలు చవకైన మార్గం. అధిక భాగం ప్రొటీన్లను కలిగి ఉండి, మాంసాహారా నికి చక్కని ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన ఖనిజాలే కాక వివిధ రకాల బీ విటమిన్లు కూడా పప్పుల్లో అధికం. శక్తినిచ్చి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అవసరమయ్యే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు కూడా పప్పుల్లో ఉంటాయి. రోజూ పప్పు ధాన్యాలను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండెజబ్బుల నుండి రక్షణ లభిస్తుంది. 100 గ్రాముల ఉడికించిన పప్పుల్లో కేవలం 110-120 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. రోజుకు 200 గ్రాముల వరకూ ఉడికించిన లేదా వండిన పప్పులను తీసుకోవచ్చు. పరిమిత మోతాదులో, ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పప్పులు తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. శక్తినిచ్చే పిండి పదార్థాలు, ప్రొటీన్లు ఉండడం వల్ల అవసరానికి మించి లేదా ఎక్కువ నూనెతో వండి పప్పులను తీసుకుంటే మాత్రం బరువు పెరిగే అవకాశం ఉంది. మీ శరీర తత్వానికి కంది పప్పు తీసుకోవడం వల్ల ఇబ్బందిగా ఉంటే ప్రత్యామ్నాయంగా పెసర పప్పు వాడవచ్చు. ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
మార్కెట్లో పలు రకాల యోగర్ట్స్ దొరుకుతున్నాయి. ఇవి ఆరోగ్యకరమైనవేనా? మంచి యోగర్ట్‌ని ఎలా ఎంచుకోవాలి?
- చిక్రిక, హైదరాబాద్
పాలను పులియబెట్టి పెరుగు తయారు చేసినట్టే యోగర్ట్ కూడా తయారు చేస్తారు. పులియబెట్టేందుకు వాడిన సూక్ష్మ జీవులను బట్టి యోగర్ట్‌లలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. తయారీకి వాడే పాలలోని వెన్న శాతం వల్ల ఈ యోగర్ట్‌లలో క్యాలరీలు కూడా మారుతుంటాయి. సాధారణంగా మార్కెట్లో వివిధ రకాల రుచులలో (ఫ్లేవర్స్) యోగర్ట్ లభిస్తోంది. చాలాసార్లు ఈ ప్రత్యేక రుచి కోసం ఏదైనా ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్ వాడతారు. కొన్నింటిలో తీపి కోసం చక్కెర, హై ఫ్రూక్టోజ్ కార్న్ సిరప్, లో క్యాలరీ తీపి కారకాలు మొదలైనవి కూడా చేరుస్తారు. వీటన్నింటి వల్ల అనవసరమైన క్యాలరీలు ఎక్కువవుతాయి. పరిమిత మోతాదులో కాకుండా రోజూ తీసుకొంటే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఫ్లేవర్డ్ యోగర్ట్ నచ్చిన వారు ఇంట్లోనే తాజాగా చేసుకున్న పెరుగుకు మామిడి, సపోటా, దానిమ్మ, అరటి, స్ట్రాబెర్రీ, సీతాఫలం వంటి పండ్లను చేర్చుకొని తినచ్చు. చక్కెర వంటి తీపి పదార్థాలు చేర్చకుండా తీసుకొంటే పెరుగులోని మంచి బ్యాక్టీరియా వల్ల మేలు కూడా. బయటి యోగర్ట్ కొనేప్పుడు ఎటువంటి ఫ్లేవర్ చేర్చని, ప్లెయిన్, తక్కువ కొవ్వు ఉండే లో- ఫాట్ యోగర్ట్ లను తీసుకోవడం మంచిది.