Recession Warning: అమెరికాకు మాంద్యం ముప్పు
ABN, Publish Date - Apr 04 , 2025 | 05:19 AM
ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా అమెరికా మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు 1930 మాంద్యానికి కారణమైన విధానాలే మళ్లీ అమలవుతున్నాయని మార్కెట్లు భయపడుతున్నాయి

ప్రతీకార సుంకాలతో అసలుకే ఎసరు!
గతంలోనూ ఇలాగే స్మూత్‌హాలీ పేరుతో భారీగా సుంకాలు విధించిన అగ్రరాజ్యం
1930నాటి మాంద్యానికిదే కారణం
ట్రంప్ సుంకాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరోసారి మాంద్యం బారిన పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దిగుమతుల నుంచి తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే పేరుతో అమెరికా గతంలోనూ ‘స్మూత్-హాలీ’ పేరుతో ఇలాగే దిగుమతులపై పెద్ద ఎత్తున సుంకాలు విధించింది. 1930నాటి మహా ఆర్థిక మాంద్యానికి అదే ప్రధాన కారణమని ఆర్థికవేత్తలు చెబుతారు. ఇప్పుడు ట్రంప్ తన చర్యలతో అలాంటి మాంద్యానికి బీజాలు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రతీకార సుంకాల విధింపు రోజును ట్రంప్ ‘విమోచన దినోత్సవం’గా ప్రకటిస్తే ఆర్థికవేత్తలు మాత్రం ‘మాంద్యం దినోత్సవం’గా పరిగణిస్తున్నారు. అమెరికా జీడీపీ వృద్ధి రేటు ఇప్పటికే పడకేసింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2% దిగువకు తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పుడు ఈ సుంకాలతో ఇది మరింత కోరలు చాచే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే వడ్డీ రేట్ల తగ్గింపునకు అమెరికా ఫెడ్ రిజర్వు ఫుల్‌స్టాప్ పెట్టినట్టే. అమెరికా ప్రభుత్వ అప్పులు పెరిగిపోతున్నాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలు తోడవడంతో అమెరికా మరోసారి మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే ఆ ప్రభావం చైనా, భారత్, జపాన్, యూరప్ దేశాలపైనా పడే ముప్పుంది. 2008నాటి అమెరికా ఆర్థిక మాంద్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసింది. ట్రంప్ ప్రతీకార సుంకాలతో ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రపంచ ఎగుమతుల వృద్ధిరేటు 1.3శాతం మించకపోవచ్చని హెచ్‌ఎస్‌బీసీ రీసెర్చ్ హెచ్చరించింది. ట్రంప్ మన ఐటీ సేవల ఎగుమతులపై ప్రతీకార సుంకాలు విధించలేదు. అయితే వివిధ ఉత్పత్తులపై విధించిన సుంకాలతో అమెరికా మాంద్యంలోకి వెళ్లే ప్రమాదమో కనిపిస్తోంది. ఇది భారత ఐటీ పరిశ్రమను వణికిస్తోంది.
ఇవి కూడా చదవండి:
అమెరికా సహా అతలాకుతలమౌతోన్న ప్రపంచ మార్కెట్లు
Updated Date - Apr 04 , 2025 | 05:20 AM