Pratyekam : వాట్సప్ ద్వారా అదిరిపోయే ప్లాన్.. అమెరికాలో గుజరాతీ ఆంటీలు ఏం చేసేది తెలిస్తే..
ABN, Publish Date - Jan 04 , 2025 | 08:56 PM
వాట్సప్ ద్వారా అదిరిపోయే ప్లాన్ వేసి అమెరికాలో సక్సెస్‌ఫుల్ బిజినెస్ రన్ చేస్తున్న గుజరాతీ ఆంటీలు..
మన దేశంలో ప్రాంతాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారిపోతుంటాయి. దీంతో చదువులు, ఉద్యోగాలంటూ వేరే రాష్ట్రాలకు,విదేశాలకు వెళ్లేవారికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఆహారం. కొత్తగా విదేశాలకు వెళ్లిన వారికైతే మరీ కష్టం. అలవాటు లేని ఆహార పదార్థాలు తినలేక, ఇంట్లో అమ్మ చేసే రుచికరమైన ఫుడ్ ఎప్పుడెప్పుడు తినాలా అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా సరైన తిండి దొరక్కపోతే చదువు, కెరీర్‌పై దృష్టి పెట్టడం అంత ఈజీ కాదు. ఇది గుర్తించిన గుజరాతీ ఆంటీలు ఒక తెలివైన ఆలోచన చేశారు. అమెరికాలో హోం సిక్‌తో బాధపడే భారతీయులకు ఇంటి భోజనం రుచి చూపించేందుకు వాట్సప్ వేదికగా టిఫిన్ సర్వీస్ ప్రారంభించారు. వేడి వేడి గుజరాతీ స్టైల్ భోజనంతో ఆకలి తీరుస్తూనే రెండు చేతులా క్యాష్ చేసుకుంటూ సంపాదిస్తున్నారు.
నిత్యం సందడిగా ఉండే న్యూయార్క్ నగరాన్ని తమ సంప్రదాయ వంటకాల ఘుమఘమలతో ఊరిస్తున్నారు గుజరాతీ ఆంటీలు. ఇంటి భోజనం కోసం తల్లడిల్లిపోయే భారతీయులకు ఊరటనిస్తూ వాట్సప్ బేస్డ్ టిఫిన్ సర్వీస్ తీసుకొచ్చి రోజూ ఏం వండుకోవాలి, ఏం తినాలి అనే బాధ తప్పించారు. ఇంట్లో వండివార్చిన గుజరాతీ స్పెషల్ ఐటమ్స్ వాట్సప్ ద్వారా ఆర్డర్ చేయగానే డోర్ డెలివరీ చేసేస్తూ రెండు చేతులా క్యాష్ చేసుకుంటున్నారు.
15 డాలర్లకే పప్పు, రోటి, అన్నం, కూరగాయలు, డెసర్ట్‌లతో కలిపి ఫుల్ మీల్స్ ఇస్తున్నారు. ముంబయిలోని ప్రసిద్ధ డబ్బావాలాల తరహాలో "అంకుల్" పేరుతో ఆఫీసులు, ఇళ్లకు వారంలో 5 రోజుల పాటు డోర్ డెలివరీ అందిస్తారు. “#4,” పేరుతో 800 మందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఈ సర్వీసెస్ నిర్వహించడం విశేషం.
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇషాన్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసిన రీల్‌లో గుజరాతీ ఆంటీల స్పెషల్ బిజినెస్ గురించి అనేక విషయాలు చెప్పాడు. మన్‌హట్టన్, క్వీన్స్, బ్రూక్లిన్‌లో నివసించే సుమారు లక్ష మంది భారతీయులకు రుచికరమైన శాకాహారం, జైన్ టిఫిన్‌లు అందిస్తూ ఇంట్లోనే ఉండి నెలకు 10వేల డాలర్ల వరకూ సంపాదిస్తున్నారు. డిఫరెంట్ ఐడియాతో ఏ మాత్రం తడబాటు లేకుండా ఇంత పెద్ద నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని గుజరాతీ ఆంటీలు వ్యాపారం చేస్తున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Updated Date - Jan 04 , 2025 | 08:56 PM