Trump Tariffs Impact: ఎవ్వర్నీ వదలం

ABN, Publish Date - Apr 01 , 2025 | 05:24 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. భారత్‌ ఎగుమతులపై ఈ నిర్ణయం ప్రభావం చూపించగలదు

Trump Tariffs Impact: ఎవ్వర్నీ వదలం
  • అన్ని దేశాలపైనా ప్రతీకార సుంకాలు

  • ట్రంప్‌ పునరుద్ఘాటన.. రేపటి నుంచే మోత

  • ‘మినహాయింపు’పై భారత్‌ ఆశలు

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠ

వాషింగ్టన్‌, మార్చి31: ప్రతీకార సుంకాల విషయంలో ఏ దేశానికీ మినహాయింపు లేదని, అన్ని దేశాలపై విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఏప్రిల్‌ 2 లిబరేషన్‌ డే నుంచి అన్ని దేశాలపై టారిఫ్‌లు విధించడం ఖాయమన్నారు. 10, 15 దేశాలపై మాత్రమే సుంకాలు విధిస్తారనే ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అమెరికా పూర్వ వైభవం పొందాలంటే తమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై సుంకాలు విధించాల్సిందేనని, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. గతంలో ప్రధాని మోదీ సమక్షంలోనే ట్రంప్‌ భారత్‌ అధిక సుంకాల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ‘‘మోదీజీ మీతో ఎంత దోస్తానా ఉన్నా, మీరు కూడా మా వస్తువులపై సుంకాలు తగ్గించాల్సిందే. లేకపోతే మీ దేశ ఉత్పత్తులపైనా అదే స్థాయిలో సుంకాలు తప్పవు’’ అని ట్రంప్‌.. మోదీకి అప్పట్లోనే తేల్చిచెప్పారు. దాంతో ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపులకు సిద్ధమైంది. అందులో భాగంగానే గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి ఆన్‌లైన్‌ యాడ్స్‌పై విధిస్తున్న 6 శాతం ఈక్వలైజేషన్‌ ట్యాక్స్‌ను ఏప్రిల్‌ 1 నుంచి ఎత్తివేసింది.


నోరు మెదపని అమెరికా

అయినా ట్రంప్‌ సర్కార్‌ నుంచి ఉలుకూ పలుకు లేదు. దీంతో ఏప్రిల్‌ 2న ప్రకటించే ‘పరస్పర సుంకాల’ దేశాల జాబితాలో మన దేశం పేరు ఉంటుందా? లేదా? అని అటు ప్రభుత్వం ఇటు పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ సుంకాలతో తీవ్రంగా నష్టపోతామని ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేశాయి. వీలైనంత త్వరగా అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కుదుర్చుకుని తమను రక్షించాలని కోరాయి. లేకపోతే అమెరికా మార్కెట్లో పోటీపడడం మా వల్ల కాదని స్పష్టం చేశాయి. కొన్ని రంగాలు మాత్రం ఈ సుంకాలతో తమకు పెద్దగా వచ్చే ముప్పేమీ లేదని నింపాదిగా ఉన్నాయి. ఒకవేళ ట్రంప్‌ సర్కారు ఏప్రిల్‌ 2న అనుకున్న విధంగానే మన దేశంపైనా ప్రతీకార సుంకాలు విధిస్తే వివిధ రంగాలపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

అమెరికా ప్రాధాన్యత

మన అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా చాలా కీలకం. 2021-24 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే మన మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతం, దిగుమతుల్లో 6.22ు. గత ఆర్థిక సంవత్సరం రెండు దేశాల మధ్య 19,000 కోట్ల డాలర్ల విలువైన వస్తు ఎగుమతి, దిగుమతులు జరిగాయి. ఇందులో మన దేశానికి దాదాపు 4,500 కోట్ల డాలర్ల మిగులు ఉంది. ట్రంప్‌ సుంకాలతో ఈ మిగులుకు ఎక్కడ గండి పడుతుందోనని ప్రభుత్వం భయపడుతోంది.


ప్రస్తుత సుంకాలు

ప్రస్తుతం మన ఎగుమతులపై అమెరికా సగటున 2.8 శాతం చొప్పున సుంకాలు విధిస్తోంది. మనం మాత్రం అమెరికా దిగుమతులపై సగటున 7.7 శాతం చొప్పున సుంకాలు విధిస్తున్నాం. రంగాల వారీగా చూస్తే ప్రస్తుతం మన దేశం సగటున అమెరికా పారిశ్రామిక దిగుమతులపై 5.9 శాతం చొప్పున, వ్యవసాయ దిగుమతులపై 37.7 శాతం చొప్పున సుంకాలు విధిస్తోంది. అమెరికా మాత్రం సగటున మన పారిశ్రామిక ఉత్పత్తులపై 2.6 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై 5.3 శాతం చొప్పున సుంకాలు విధిస్తోంది. ఇప్పుడు ట్రంప్‌ ఈ లోటు పూడ్చుకునేందుకు అన్ని భారత ఎగుమతులపై మన స్థాయిలోనే సుంకాలు విధిస్తే మనకు తీవ్ర నష్టం తప్పదని పారిశ్రామిక వర్గాల ఆందోళన.

వ్యవసాయం

వ్యవసాయ ఉత్పత్తులపైనా భారత్‌ సుంకాలు గణనీయంగా తగ్గించాలని ట్రంప్‌ సర్కార్‌ కోరుతోంది. బీటీఏపై ఇటీవల ఢిల్లీలో జరిగిన చర్చల్లోనూ ఇందుకోసం అమెరికా పట్టుబట్టినట్టు సమాచారం. ముఖ్యంగా గోధుమ, బియ్యం వంటి ఆహార ధాన్యాలతో పాటు పాడి ఉత్పత్తుల దిగుమతులపైనా భారత్‌ సుంకాలు తగ్గించాలని పట్టుబట్టింది. ప్రభుత్వం ఇందుకు ససేమిరా అనడంతో కనీసం తమ దేశం నుంచి దిగుమతయ్యే ఆపిల్స్‌, బాదం, పిస్తా వంటి ఉత్పత్తులపైనైనా తగ్గించాలని కోరింది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒక మెట్టు దిగి గోధుమ, బియ్యం, పాడి ఉత్పత్తులపై తప్ప మిగతా వాటిపై సుంకాల ఎత్తివేత లేదా కనీస స్థాయికి తగ్గించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

ఫార్మా రంగం

ట్రంప్‌ ప్రతీకార సుంకాలతో నష్టపోయే రంగాల్లో ఫార్మా ఒకటి. ప్రస్తుతం అమెరికాలో అమ్మే జెనెరిక్‌ ఔషధాల్లో 40 శాతం మన దేశ కంపెనీల నుంచే సరఫరా అవుతున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, నాట్కో వంటి హేమా హేమీ కంపెనీలకు కూడా అమెరికానే ప్రధాన మార్కెట్‌.


ప్రస్తుతం ఈ దిగుమతులను అమెరికా జీరో డ్యూటీతో అనుమతిస్తోంది. మనం మాత్రం అమెరికా ఔషధ దిగుమతులపై 10 శాతం వరకు దిగుమతి సుంకం విధిస్తున్నాం. మన కంపెనీలు ఎగుమతి చేసే జెనెరిక్‌ ఔషధాలపై లాభాలు చాలా తక్కువ. ట్రంప్‌ అన్నంత పని చేస్తే ఏప్రిల్‌ 1 నుంచి మన ఎగుమతులపైనా అమెరికాలో 10 శాతం డ్యూటీ అమల్లోకి వస్తుంది. అప్పుడు ఉన్న ఆ కాస్తా లాభాలు కూడా భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు భయపడుతున్నాయి. ఫార్మాగ్జిల్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ భాస్కర్‌ మాత్రం.. ట్రంప్‌ సర్కారు మన ఫార్మా ఎగుమతులపై 10 శాతం సుంకం విధించినా మన పరిశ్రమకు పెద్దగా నష్టమేం లేదన్నారు. అమెరికన్ల వైద్య బిల్లులు పెరిగి వారే ఎక్కువగా నష్టపోతారని చెప్పారు. ఒకవేళ అమెరికా తనంతట తాను ఈ జెనెరిక్‌ ఔషధాలను తయారు చేసుకోవాలనుకున్నా.. మన నుంచి దిగుమతి చేసుకునే ధర కంటే 30 శాతం ఎక్కువ ఖర్చవుతుందన్నారు. అందుకు ఒకటి రెండేళ్ల సమయమూ పడుతుందన్నారు.

ఇంకా సస్పెన్స్‌

మరోవైపు ట్రంప్‌ ఏప్రిల్‌ 2న ప్రతీకార సుంకాల దేశాల జాబితా ప్రకటిస్తారా? లేక వాయిదా వేస్తారా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త పెట్టుబడులు వచ్చి దేశీయ ఉత్పత్తి పెరగడం దేవుడెరుగు. ముందు ఈ సుంకాలతో అమెరికాలో వస్తు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం కొండెక్కే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మిత్ర దేశాలకు మాత్రం కొద్దిగా విరామం ఇచ్చి చైనాపై మాత్రం భారీగా సుంకాల భారం మోపే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.

- (ఆంధ్రజ్యోతి బిజినెస్‌ డెస్క్‌)


ఇవి కూడా చదవండి:

మరణం గుట్టు విప్పిన డాక్టర్.. చనిపోయిన వాళ్లను బతికించొచ్చట.

Credit Score: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఏమౌతుంది.. రికవరీకి ఎంత టైం పడుతుంది

Updated Date - Apr 01 , 2025 | 05:24 AM