Share News

Donald Trump: ఎవ్వరినీ వదిలిపెట్టం

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:07 AM

శుక్రవారం అమెరికా న్యాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అవినీతిపరులు, నమ్మకద్రోహులను తమ ప్రభుత్వం నుంచి తరిమికొడతామని హెచ్చరించారు. వారి దారుణమైన నేరాలు, తీవ్రమైన దుష్ప్రవర్తన గురించి ప్రజలకు తెలిసేలా వారి చర్యలను బట్టబయలు చేస్తామన్నారు.

Donald Trump: ఎవ్వరినీ వదిలిపెట్టం

నాపై తప్పుడు కేసులు పెట్టినవారి పేర్లు బయటపెడతా.. ప్రత్యర్థులంతా జైలుకే

నమ్మకద్రోహులను తరిమేస్తాం: ట్రంప్‌

రాజధాని వాషింగ్టన్‌ రోడ్లపై గుంతలు

వాటిని మోదీ, ప్రపంచ దేశాధినేతలు చూడకూడదనుకున్నానని వ్యాఖ్య

వాషింగ్టన్‌/న్యూయార్క్‌, మార్చి 15: తనపై క్రిమినల్‌ కేసులు పెట్టిన వారందరి పేర్లు బయటపెడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శపఽథం చేశారు. తన రాజకీయ ప్రత్యర్థులంతా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. శుక్రవారం అమెరికా న్యాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అవినీతిపరులు, నమ్మకద్రోహులను తమ ప్రభుత్వం నుంచి తరిమికొడతామని హెచ్చరించారు. వారి దారుణమైన నేరాలు, తీవ్రమైన దుష్ప్రవర్తన గురించి ప్రజలకు తెలిసేలా వారి చర్యలను బట్టబయలు చేస్తామన్నారు. 2021లో అప్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ దేశ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన క్షణంగా ఆయన అభివర్ణించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న వ్యక్తులు, బైడెన్‌ ప్రభుత్వంలోని అధికారులను జైల్లో పెట్టాలని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. బైడెన్‌ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా న్యాయశాఖను ఒక ఆయుధంగా వాడుకుందని, న్యాయ శాఖను అన్యాయశాఖగా మార్చిందని ఆరోపించారు. ఆ రోజులు ముగిసి పోయాయని, అవి ఎప్పటికీ తిరిగిరావని పేర్కొన్నారు. అమెరికాలో న్యాయాన్ని పునరుద్ధరించడమే తన ప్రాధాన్యమని ప్రకటించారు.

gtfjk.jpg

న్యాయశాఖను నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా ఉంచుతామని చెప్పారు. తనకు వ్యతిరేకంగా కేసుల్లో పాల్గొన్న ప్రాసిక్యూటర్లు, అధికారుల పేర్లను ఆయన ప్రస్తావించారు. వారందరినీ పనికిమాలిన జనంగా అభివర్ణించారు. కాగా, అమెరికా అధ్యక్షుడు న్యాయశాఖను సందర్శించడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి.


సుందర నగరంగా వాషింగ్టన్‌ డీసీ

వాషింగ్టన్‌ డీసీలోని రోడ్లపై గుంతలు, గుడారాలు, గోడలపై రాతలు భారత ప్రధాని మోదీకి, ఇతర ప్రపంచ నాయకులకు కనిపించకూడదని భావించానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘మేం మా నగరాన్ని శుభ్రం చేస్తున్నాం. రాజధానిని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే ఇక్కడున్న గుడారాలను తొలగిస్తున్నాం. గోడలపై రాతలను చెరిపివేస్తున్నాం’ అని తెలిపారు. రాజధానిని ప్రక్షాళన చేయడంలో వాషింగ్టన్‌ డీసీ మేయర్‌ మురియల్‌ బౌసర్‌ చక్కటి పనితీరును కనబరిచారని ట్రంప్‌ ప్రశంసించారు. ‘స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఎదురుగా చాలా గుడారాలు ఉన్నాయని చెప్పిన వెంటనే వాటిని తొలగించారు. ప్రపంచం మొత్తం మాట్లాడుకొనేలాంటి రాజధానిని మేం కోరుకుంటున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. ‘భారత ప్రధాని, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు, యూకే ప్రధాని వీరంతా ఇటీవల నన్ను కలవడానికి అమెరికా వచ్చారు. ఆ సమయంలో వాషింగ్టన్‌లో రోడ్లపై గుంతలు, గోడలపై రాతలు, గుడారాలు, విరిగిన బ్యారికేడ్లు వారికి కనిపించడం నాకు ఇష్టం లేదు. అందుకే అవేమీ లేకుండా నగరాన్ని సుందరంగా మార్చేశాం. రాజధానిని నేరరహితంగా మార్చనున్నాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.


41 దేశాలపై ట్రంప్‌ ‘ప్రయాణ నిషేధం’!

అనేక దేశాల పౌరులపై ప్రయాణ ఆంక్షలు విధించే అంశాన్ని ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన ఒక అంతర్గత మెమో తాజాగా వెలుగు చూసింది. అయితే ఈ జాబితా తాత్కాలికమేనని, విదేశాంగ మంత్రి రూబియో ఆమోదం తర్వాత దీనిలో మార్పుచేర్పులకు అవకాశం ఉందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అమెరికా ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వివరించారు. ఆ మెమోలో ఉన్న సమాచారం ప్రకారం... ట్రావెల్‌ బ్యాన్‌ విధించాలని భావిస్తున్న 41 దేశాలను మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి విభాగంలో ఉన్న పది దేశాలకు వీసాల జారీని పూర్తిగా నిలిపివేస్తారు. ఈ జాబితాలో ఆఫ్ఘానిస్థాన్‌, క్యూబా, ఇరాన్‌, లిబియా, ఉత్తర కొరియా, సోమాలియా, సూడాన్‌, సిరియా, వెనిజులా, యెమన్‌ ఉన్నాయి. ఇక రెండో విభాగంలోని ఐదు దేశాల వారికి పాక్షిక వీసా సస్పెన్షన్‌ అమలు చేస్తారు. పర్యాటక, విద్యార్థి, మరికొన్ని వీసాల జారీపై దీని ప్రభావం ఉంటుంది. ఈ జాబితాలో ఎరిత్రియా, హైతీ, లావోస్‌, మయన్మార్‌, దక్షిణ సూడాన్‌ ఉన్నాయి. అలాగే మూడో విభాగంలో ఉన్న 26 దేశాలు నిర్ణీత కాలవ్యవధిలోగా అమెరికా సూచించిన సమస్యలను పరిష్కరించుకోకపోతే వాటి పౌరులకు వీసాల జారీని పాక్షికంగా నిలిపివేస్తారు. ఈ జాబితాలో పాకిస్థాన్‌, భూటాన్‌, కాంబోడియా, చాద్‌, గాంబియా, వనవాటు తదితర దేశాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 03:07 AM