H-1B Visa: హెచ్-1బీ నిబంధనలు మరింత కఠినం!
ABN , Publish Date - Mar 16 , 2025 | 02:36 AM
ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో వలస విధానానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. వీసాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు భిన్నంగా ఉంటాయని, అవి ‘విదేశీ వ్యవహారాల’ కింద ఉండాలని ఆయన పేర్కొన్నారు. అంటే దీనర్థం, వారు ప్రజల అభిప్రాయాలు, కొత్త నియమాల తయారీ ప్రక్రియలో మార్పును ప్రకటించే సమయంలో ఇవాల్సిన నోటీసును విస్మరించొచ్చు.

‘విదేశీ వ్యవహారాల’ కిందకు ఇమ్మిగ్రేషన్ రూల్స్
అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ప్రకటన
రాజధాని వాషింగ్టన్ రోడ్లపై గుంతలు, గోడలపై
రాతలు మోదీకి, ప్రపంచ నేతలకు కనిపించొద్దు
అందుకే నగరాన్ని తీర్చిదిద్దుతున్నాం: ట్రంప్
వైట్‌హౌస్ పరిశీలనలో 41 దేశాలపై ‘ప్రయాణ నిషేధం’!
న్యూఢిల్లీ, మార్చి 15: హెచ్-1బీ వీసా నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో వలస విధానానికి సంబంఽధించి కీలక ప్రకటన చేశారు. వీసాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు భిన్నంగా ఉంటాయని, అవి ‘విదేశీ వ్యవహారాల’ కింద ఉండాలని ఆయన పేర్కొన్నారు. అంటే దీనర్థం, వారు ప్రజల అభిప్రాయాలు, కొత్త నియమాల తయారీ ప్రక్రియలో మార్పును ప్రకటించే సమయంలో ఇవాల్సిన నోటీసును విస్మరించొచ్చు. దీని వలన అమెరికాలో పనిచేయాలని, చదువుకోవాలని, ఆ దేశంలో పర్యటించాలని అనుకొనే భారతీయులు భారీ మార్పులను చవిచూసే అవకాశం ఉంది. వీసా ఆమోదాలు, పునరుద్ధరణ విషయంలో యాజమాన్యాలు, ఉద్యోగస్తులు అంతరాయం ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో హెచ్-1బీ నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియపై అనిశ్చితిని పెంచుతుంది.
‘అమెరికా సరిహద్దుల గుండా ప్రజల ప్రవేశం, నిష్క్రమణను, వస్తువులు, సేవలు, డేటా, టెక్నాలజీ, ఇతర వస్తువుల బదిలీని నియత్రించడానికి ఫెడరల్ ప్రభుత్వంలోని ఏ ఏజెన్సీ అయినా నిర్వహించే అన్ని ప్రయత్నాలను.. అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్, 5 యూ.ఎ్‌స.సీ. 553, 554 ప్రకారం విదేశీ వ్యవహారాల విఽధిగా నిర్ణయిస్తున్నాను’ అని రూబియో శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్‌లో పబ్లిష్ చేసేందుకు షెడ్యూల్ చేసిన నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం, ఏదైనా ముసాయిదా నిబంఽధనలపై ఆసక్తి గలవాళ్లు అభిప్రాయాలు వెల్లడించేందుకు 30-60 రోజుల వరకు సమయం ఉంది. రూల్స్ ప్రకారం.. నిబంధనల ప్రకారం ఫెడరల్ ఏజెన్సీలు ఆ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని, తుది నిబంధనల్లో వారు లేవనెత్తిన అంశాలపై స్పందించాల్సి ఉంటుంది.