Sunitha Williams: స్పేస్ నుంచి బయల్దేరిన సునీతా విలియమ్స్.. ఎక్కడ, ఎప్పుడు ల్యాండ్ అవుతారు.. రాగానే ఏం చేస్తారు..
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:35 PM
Sunitha Williams : దాదాపు 9 నెలల నిరీక్షణ తర్వాత తిరిగి భూమిపైకి అడుగుపెట్టబోతున్నారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్. వీరు స్పేస్ ఎక్స్ ప్రయాణిస్తున్నక్రూ డ్రాగన్ క్యాప్సుల్ ఎక్కడ ల్యాండ్ అవబోతోంది. సుదీర్ఘ సమయం తర్వాత భూమిపై కాలుమోపగానే వ్యోమగాములు చేయాల్సిన పనులు ఏమిటి..

Sunitha Williams Schedule After Landing on Earth : నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ (Sunitha Williams) తన క్రూ మెంబర్స్ బుచ్ విల్మర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్‌లో భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు హ్యాచ్ మూసివేత పూర్తయి, 10.30కు అన్‌డాకింగ్ ప్రక్రియ మొదలైంది. అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి విడిపోయిన తర్వాత క్రూ డ్రాగన్ బుధవారం వేకువజామున 3.27 గంటలకు ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అవుతారు.అయితే, భూమిపై అడుగుపెట్టగానే సునీతా, విల్మోర్ ఏం చేస్తారు. వారం రోజుల మిషన్ కోసం వెళ్లి 9 నెలలపాటు గడిపినందుకు వ్యోమగాములకు ఎక్స్ ట్రా మొత్తాన్ని నాసా చెల్లిస్తుందా..
సునీతా టీం ఎలా వస్తారు..
నాసా లాంచ్ చేసిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఆదివారం ఐఎస్‌ఐస్ చేరుకుంది. క్రూ-10 తీసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్ సాయంతో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా టీంని క్రూ డ్రాగన్ క్యాప్సుల్ తిరిగి భూమిపైకి తీసుకొస్తుంది. సోమవారం సాయంత్రం వ్యోమగాములు ఎక్కగానే క్రూ డ్రాగన్ హ్యాచింగ్ మూసివేత పూర్తయింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్ష కేంద్రం నుంచి అన్ డాకింగ్ అయి తిరిగి భూ ఉపరితలం వైపుగా దూసుకొస్తుంది. ఈ ప్రక్రియను నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
భూమిపైకి రాగానే సునీతా ఏం చేస్తారు..
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ స్టార్ లైనర్ నౌకలో 7 రోజుల మిషన్ కోసం వెళ్లిన సునీతా, విల్మోర్‌లు సాంకేతిక సమస్యల కారణంగా సుమారు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే గడపాల్సి వచ్చింది. ఇంతకాలం సున్నా గురుత్వాకర్షణ శక్తిలో ఉండటం వల్ల శరీరం కండరాలు బలహీనపడటం వల్ల నడవలేకపోవడం, నాడీ సమస్యలు, కంటి చూపు లోపాలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబట్టి, భూ వాతావరణంలో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడి గ్రావిటీకి వారి శరీరం అలవాటు పడే వరకూ, బలం పుంజుకుని సరైన స్థితికి వచ్చే వరకూ వారిని కొన్ని వారాలు లేదా నెలల పాటు రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచుతుంది నాసా. క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ఫ్లోరిడాలో ల్యాండ్ కాగానే ముందుగా క్రూని హ్యూస్టన్‌లో ఉన్న నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ వద్దకు తీసుకెళతారు. వైద్యపరీక్షలు, పోస్ట్ మిషన్ ఫార్మాలిటీస్ పూర్తిచేసి సాధారణ స్థితికి వచ్చే వరకూ ట్రీట్మెంట్ ఇస్తారు.
సునీతాకు ఓవర్ టైం పేమెంట్ ఇస్తారా..
నాసాలో పనిచేస్తున్న సునీతా, విల్మోర్ GS-15 ఉద్యోగులు. ఫెడరల్ ఉద్యోగుల్లో వీరే అత్యున్నత స్థాయి ఉద్యోగులు. వీరికి ప్రభుత్వం నుంచి ఏడాదికి సుమారు రూ.1.08 కోట్లు-రూ.1.41 కోట్లు (125,133 డాలర్లు-12,672 డాలర్లు) జీతంగా వస్తుంది. వీరు భూమిపై పనిచేస్తే ఎంత జీతం ఇస్తారో అంతరిక్షంలో చేసినా అంతే చెల్లిస్తారు. వ్యోమగాములు ఎవరికీ ఓవర్ టైం వర్క్ చేసినందుకు అదనపు జీతాలు ఉండవు. కాకపోతే అక్కడ ఉన్నన్ని ఆహార సదుపాయాలు, వ్యక్తిగత అవసరాలకు అయ్యే ఖర్చు మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. అయితే, రోజూ వారీ భత్యం కింద సునీతకు 4 డాలర్లు (రూ.347) చెల్లిస్తారని నాసా వ్యోమగామి క్యాడీ కోల్ మాన్ తెలిపారు.
Read Also : Sunita Williams: రేపు ఈపాటికి భూమికి సునీతా విలియమ్స్!
Ukraine: పుతిన్‌తో ట్రంప్ చర్చలు నేడే