Share News

Supreme Court Review Petition Filed: గడువు వద్దు

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:25 AM

సుప్రీంకోర్టు గడువు నిర్దేశించిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ వేయనున్నది. గవర్నర్‌లు ఆమోదించని బిల్లులకు తిరిగి ప్రాణం పోసేలా ఈ తీర్పు ఉందని కేంద్రం అభిప్రాయపడింది

Supreme Court Review Petition Filed: గడువు వద్దు

  • బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు సమయం నిర్దేశించడాన్ని పునఃపరిశీలించాలి

  • సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేయనున్న కేంద్రం

  • కేంద్రం లేవనెత్తిన పలు అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదంటున్న అధికారులు

  • సాంకేతికంగా రద్దయిన బిల్లులకు ఈ తీర్పు ప్రాణం పోసేలా ఉందని వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: రాష్ట్రాల శాసససభలు ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడంపై రివ్యూ పిటిషన్‌ వేసేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధమైంది. తీర్పును పునఃపరిశీలించాలని జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మహదేవన్‌ ధర్మాసనాన్ని కోరనుంది. కేంద్రం లేవనెత్తిన పలు అంశాలు సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా సరిగా ప్రస్తావనకు రాలేదని, వాటిని పరిగణనలోకి తీసుకుని సుప్రీం తీర్పును పునః పరిశీలించాల్సి ఉంటుందని సీనియర్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు పిటిషన్‌ను సిద్ధం చేసే ప్రక్రియ మొదలైందని వెల్లడించారు. రాష్ట్రాల చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం, ఇతర నిర్ణయాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ఈ అంశానికే సంబంధించినది కావడంతో రివ్యూ పిటిషన్‌ వేసేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధమైంది.


రద్దయిన బిల్లులకూ ప్రాణం పోసేలా..!

అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా... గరిష్ఠంగా 3నెలల్లో నిర్ణయం తెలపాలంటూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో గవర్నర్లు పరిశీలన కోసం పంపిన రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి కూడా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే సుప్రీంలో వాదనల సందర్భంగా కేంద్రం లేవనెత్తిన పలు అంశాలు సరిగా ప్రస్తావనకు రాలేదని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రద్దయిన (ల్యాప్స్‌ అయిన) బిల్లులకు తిరిగి ప్రాణం పోసేలా ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఏదైనా బిల్లును గవర్నర్‌ తిప్పిపంపినా, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకుండా ఆపేసినా.. ఆ బిల్లు రద్దయినట్టేనని తెలిపారు. సదరు బిల్లును యథాతథంగా గానీ, మార్పులు చేసిగానీ తిరిగి శాసనసభలో ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ తమిళనాడు గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆపేసిన బిల్లులు ఆమోదం పొందినట్టుగానే భావించాలంటూ తీర్పు ఇచ్చిన ధర్మాసనం.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. సాంకేతికంగా రద్దయిన బిల్లులకు తిరిగి ప్రాణం పోసేలా ఆ తీర్పు ఉందని వివరించారు. రాష్ట్రపతికి అందిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ 2016లో ఇచ్చిన ఆఫీస్‌ మెమొరాండం ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, కానీ ఇలా గడువు నిర్దేశించడాన్ని పునః పరిశీలించాలని పేర్కొన్నారు.


మరో వివాదంలో తమిళనాడు గవర్నర్‌

తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మరో వివాదంలో చిక్కుకున్నారు. మదురై జిల్లా త్యాగరాజన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో కంబ రామాయణంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని, జైశ్రీరామ్‌ అంటూ నినాదం చేసి, విద్యార్థుల చేత కూడా ఆ నినాదాలు చేయించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే గవర్నర్‌ ఒక మతానికి చెందిన నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

పీఎంఎల్‌ఏ పరిధిలోకి ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు!

డ్రీమ్‌11, గేమ్స్‌24x7, వింజో వంటి ఆన్‌లైన్‌ రియల్‌-మనీ గేమింగ్‌ కంపెనీలను మనీలాండరింగ్‌ నిరోధక చట్టాల (పీఎంఎల్‌ఏ) పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఈ కంపెనీలకు తప్పనిసరిగా కేవైసీ వంటి వాటిని వర్తింపచేయడంతో పాటు అనుమానాస్పద లావాదేవీలను ట్రాక్‌ చేసి, నిఘా ఉంచేలా కేంద్రం దృష్టిసారిస్తోంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలను ‘ఆర్థిక నివేదికలను లిఖితపూర్వకంగా నివేదించాల్సిన సంస్థలు’గా కేంద్రం పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For National News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 05:07 AM