Maha Kumbh Mela: మహా కుంభమేళలో విగ్రహం.. వివాదం
ABN , Publish Date - Jan 13 , 2025 | 04:58 PM
Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‍లోని ప్రయోగ్ రాజ్‍లో మహాకుంభమేళ ప్రారంభమైంది. అలాంటి వేళ ఆ ప్రదేశంలో మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ విగ్రహం ఏర్పాటు చేయడంతో అలజడి రేగింది.

లక్నో, జనవరి 13: ఉత్తరప్రదేశ్‍లోని ప్రయాగ్ రాజ్‍లో మహాకుంభ మేళ సోమవారం ప్రారంభమైంది. దేశ విదేశాలకు చెందిన వారు సైతం ఈ మహాకుంభ మేళలో పాల్గొంటున్నారు. అయితే మహాకుంభమేళ నిర్వహిస్తు్న్న ప్రాంతంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి.. అందులో సమాజవాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ విగ్రహం ఏర్పాటు చేయడంపై వివాదం చెలరేగింది. దీనిపై పలువురు సాధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే అఖిల భారతీయ అఖార పరిషత్ సైతం వ్యతిరేకించింది. ఈ పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పురి కాస్తా ఘాటుగా స్పందించారు. ములాయం సింగ్ యాదవ్.. హిందూ వ్యతిరేకి.. సనతాన ధర్మ వ్యతిరేకి అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని ప్రజలను సైతం చంపారని చెప్పడానికే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పురి తెలిపారు. అయితే ములాయం సింగ్ విగ్రహాన్ని ఈ సమయంలో ఇక్కడ ఏర్పాటు చేయడం తమకు అభ్యంతరం అయితే లేదన్నారు. ఎందుకంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారని గుర్తు చేశారు.
కానీ మహాకుంభమేళ జరుగుతోన్న సమయంలో.. ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఆ పార్టీ వ్యక్తులు.. ఏం సందేశం ఇవ్వాలనుకొంటున్నారని పురీ ప్రశ్నించారు. అయోధ్య రామమందిరం ఉద్యమంలో.. ఆయన సహకారం అందించారో అందరికి తెలిసిందేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హిందూ, సనాతన వ్యతిరేకిగానే కాకుండా.. ముస్లింలకు ఆయన అనుకూలంగా ఉన్నారని పూరి సోదాహరణగా వివరించారు. మరోవైపు పూరి వ్యాఖ్యలకు హిందూ సమాజంలోని పలు సాధువుల నుంచి మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది.
Also Read: కోడి పందాల్లో గెలవాలంటే.. ఇలా చేయండి
రెండు నుంచి మూడు అడుగులున్న ములాయం సింగ్ యాదవ్.. విగ్రాహాన్ని మహా కుంభమేళ ప్రాంతంలోని శిబిరంలో ఏర్పాటు చేసినట్లు సమాజవాదీ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత మాతా ప్రసాద్ పాండే ప్రకటించారు. ఈ విగ్రహాన్ని ములాయం సింగ్ యాదవ్ స్మృతి సేవ సంస్థాన్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) విగ్రహాన్ని శనివారం ప్రారంభించామన్నారు. ఆయన తమ నాయకుడని.. ఆయన ఆలోచనలు వ్యాప్తి చేయడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ మహాకుంభమేళకు విచ్చేసే భక్తులు.. ఈ శిబిరాన్ని సందర్శించి.. అక్కడ బస చేయవచ్చన్నారు. ఈ మహా కుంభమేళ అనంతరం ఈ విగ్రహాన్ని పార్టీ కార్యాలయంలో ప్రతిష్టిస్తామని ప్రతిపక్ష నేత పాండే తెలిపారు. అయితే ఆ మహాకుంభమేళకు సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదవ్ విచ్చేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఈ విషయాన్ని ఆయనతో చర్చించలేదన్నారు.
Also Read: పందెం కోళ్లు ఎన్ని రకాలో తెలుసా..?
సమాజవాదీ పార్టీని ములాయం సింగ్ యాదవ్ స్థాపించారు. ఆయన కేంద్ర రక్షణ మంత్రిగా పని చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 11 సార్లు ఎమ్మెల్యేగా.. ఒక సారి ఎంపీగా గెలుపొందారు. ఆయన మెయిన్ పూరి, అజాంఘడ్ నుంచి పలుమార్లు గెలుపొందారు. 2022, అక్టోబర్ 10వ తేదీన ఆయన మరణించారు.
For National news And Telugu News