Delhi Elections: ఎంఐఎం అభ్యర్థికి కస్టడీ పెరోల్.. రోజుకు 2 లక్షల డిపాజిట్
ABN , Publish Date - Jan 28 , 2025 | 03:52 PM
కస్టడీ పెరోల్ కింద ప్రతిరోజూ పోలీసు ఎస్కార్ట్ మధ్యే జైలు నుంచి బయటకు వెళ్లి 12 గంటల సేపు ఆయన ప్రచారం చేసుకోవచ్చు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ ఈ వెసులుబాటును సుప్రీం ధర్మాసనం కల్పించింది.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ తాహిర్ హుస్సేన్ (Mohammad Tahir Hussain)కు సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారంనాడు కస్టడీ పెరోల్ మంజూరు చేసింది. ఆ ప్రకారం ప్రతిరోజూ పోలీసు ఎస్కార్ట్ మధ్యే జైలు నుంచి బయటకు వెళ్లి 12 గంటల సేపు ఆయన ప్రచారం చేసుకోవచ్చు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ ఈ వెసులుబాటు కల్పించారు. కస్టడీ పెరోల్ కింద ఇద్దరు పోలీసు సిబ్బంది, జైలు వ్యాను, ఎస్కార్ట్ వాహనానికి అయ్యే ఖర్చు ఆయనే భరించాలని కోర్టు షరతు విధించింది. రోజుకు సుమారు 2 లక్షల చొప్పున రెండ్రోజుల అడ్వాన్స్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
Maha Kumbh: మహాకుంభ్ రైళ్లపై రాళ్ల దాడి
ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడైన తాహిర్ హుస్సేన్ తన పార్టీ కార్యాలయానికి వెళ్లవచ్చని, తన నియోజకవర్గం ఓటర్లతో సమావేశం నిర్వహించుకోవచ్చని, అయితే కారవాల్ నగర్‌లోని తన సొంత ఇంటికి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. తనపై ఉన్న పెండింగ్ కేసుల వ్యవహారంపై కూడా ఆయన మాట్లాడరాదని షరతు విధించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం కస్టడీ పెరోల్ ఇవ్వాలని తాహిర్ హుస్సేన్ సుప్రీంకోర్టును మంగళవారంనాడు కోరారు. ఎన్నికల ప్రచారం ముగిసేందుకు కేవలం నాలుగైదు రోజులే ఉన్నందున పోలీసు కస్టడీలో ప్రచారం సాగించేందుకు తన క్లయింట్‌ను అనుమతించాలని హుస్సేన్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ అగర్వాల్ అభ్యర్థించారు. అయితే ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. కోర్టు ఉపశమనం కలిగిస్తే ప్రతి ఒక్కరూ జైలు నుంచి నామినేషన్ వేస్తుంటారని అన్నారు.
కాగా, తాత్కాలిక బెయిల్ కోరుతూ హుస్సేన్ చేసిన విజ్ఞప్తిని జనవరి 22న సుప్రీంకోర్టు నిరాకరించింది. ద్విస్వభ్య ధర్మాసం పరస్పర విరుద్ధమైన తీర్పు ఇవ్వడంతో ఆయనకు బెయిల్ రాలేదు. దీనికి ముందు జనవరి 14 నామినేషన్ వేసేందుకు ఢిల్లీ హైకోర్టు ఆయనకు కస్టడీ పెరోల్ ఇచ్చింది. 2020 ఫిబ్రవరి 24న ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, ఇంటెలిజెన్స్ బ్యూరో స్టాఫర్ అకింత్ శర్మ మృతికి సంబంధించిన కేసులో హుస్సేన్ నిందితుడిగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..
Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..
Read More National News and Latest Telugu News