Delhi CM Candidate: ఢిల్లీ సీఎం అభ్యర్థి ఫిక్స్.. అధిష్టానం చూపు అతడి వైపే
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:20 PM
Delhi CM Candidate: ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపిక దాదాపుగా ఖరారు కానుంది. అయితే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం మాత్రం మరికొద్ది రోజుల అనంతరం జరగనుందని తెలుస్తోంది. ఎందుకంటే..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09: న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్షంగా ఓటరు పట్టం కట్టాడు. దీంతో దేశ రాజధానిలో దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమానికి దేశంలోని ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం ఆహ్వానించాలని భావిస్తున్నారు.
ఇదే అంశంపై ఇప్పటికే శనివారం సాయంత్రం ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమైన సంగతి తెలిసిందే. ఇక న్యూఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచిదేవా.. అసెంబ్లీకి ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో ఆదివారం సాయంత్రం సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై వారితో ఆయన చర్చించనున్నారు.
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రధాని మోదీ యూఎస్ పర్యటన అనంతరం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మను ఎంపిక చేసే అవకాశముందని ఓ చర్చ అయితే జరుగుతోంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పర్వేష్ వర్మ.. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై గెలుపొందారు. అదీకాక.. 2014,2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి పర్వేష్ వర్మ ఎంపీగా గెలుపొందారు. కానీ గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు బీజేపీ అగ్రనాయకత్వం టికెట్ కేటాయించలేదన్న సంగతి అందరికి తెలిసిందే.
పార్టీ విజయం సాధించిన అనంతరం పర్వేష్ వర్మ విలేకర్లతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల బలమైన నాయకత్వంలో.. ఢిల్లీలో నిజమైన మార్పు తీసుకురావడానికి తాము అవిశ్రాంతంగా కృషి చేస్తామని ప్రకటించారు.
నిజాయితీ, పాదర్శకత, అభివృద్ధి కోసం ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దేశానికి ముఖ ద్వారమైన ఢిల్లీలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్బంగా ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
For National News And Telugu News