Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:51 PM
కాలిన నోట్ల కట్టలు కనిపించాయంటూ చెబుతున్న విజువల్స్ తనపై బురదజల్లి, తన ప్రతిష్టను భంగపరచేందుకు జరిగిన కుట్రగా కనిపిస్తోందని జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్పారు. వీడియోలోని కంటెంట్ చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.

న్యూఢిల్లీ: అగ్నిప్రమాదం సందర్భంగా తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yaswant Varma) వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. తనకు, తన కుటుంబానికి ఆ నగదుతో ఎలాంటి సంబంధం లేదని, తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్ధరహితమని తెలిపారు.
Sushant Singh Rajput: సుశాంత్ మృతి కేసును క్లోజ్ చేసిన సీబీఐ.. మాజీ ప్రియురాలి పాత్రపై ఏం తేల్చారంటే..
''స్టోర్ రూంలో నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి నగదు ఉంచలేదు. మాకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు'' అని యశ్వంత్ వర్మ తెలిపారు. కాలిన నోట్ల కట్టలు కనిపించాయంటూ చెబుతున్న విజువల్స్ తనపై బురదజల్లి, తన ప్రతిష్టను భంగపరచేందుకు జరిగిన కుట్రగా కనిపిస్తోందన్నారు. వీడియోలోని కంటెంట్ చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. ప్రమాద స్థలిలో కనిపించినట్టు చెబుతున్న కాలిన నోట్ల కట్టలను తాను ఎప్పుడూ చుడలేదని అన్నారు. తన ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకులు, యూపీఏ అప్లికేషన్లు, కార్డుల ద్వారానే జరిగాయన్నారు. కాలిన నోట్లుగా చెబుతున్న కరెన్సీని తాము ఎప్పుడూ చూడనే లేదని జస్టిస్ వర్మ వివరణ ఇచ్చారు. అగ్నిప్రమాదం జరిగిందని చెబుతున్న స్టోర్‌రూమ్‌లో పాడైపోయిన ఫర్నిచర్లు, బాటిల్లు, వాడిన కార్పెట్లు వంటివి మాత్రమే ఉంచేవాళ్లమని, మెయిన్ రెసిడెన్స్‌కు ఎలాంటి అనుసంధానం లేదని, కచ్చితంగా అది తన ఇంట్లో రూమ్ కాదని ఆయన తెలిపారు.
మంటలను ఆర్పే సమయంలో తన కుటుంబ సభ్యులు, సిబ్బందిని భద్రతా కారణాలతో దూరంగా ఉండమని చెప్పారని, మంటలు చల్చార్చిన తర్వాత కూడా తమ సిబ్బంది, కుటుంబ సభ్యులకు అక్కడ ఎలాంటి కరెన్సీ కనిపించలేదని వర్మ తెలిపారు. స్టాఫ్ కార్వర్ట్స్ సమీపంలో కానీ, ఔట్ హౌస్ సమీపంలో కానీ బహిరంగంగా నగదు నిల్వ చేయాలనే ఆలోచన నమ్మశక్యం కాదని అన్నారు. కాలిన కరెన్సీ బస్తాలను తమకు చూపించడం కానీ, ఇవ్వడం కానీ జరగలేదన్నారు. కరెన్సీకి సంబంధించిన ఆధారాలు కూడా లేవన్నారు. ఒక న్యాయమూర్తి జీవితంలో వ్యక్తిత్వం, ప్రతిష్ట చాలా ముఖ్యమని, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై విచారణ జరిపాలని సీజేఐ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ఇందుకోసం మూడు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేసుల విచారణ పరంగా జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీజేఐ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..