Mamata Banerjee: మహాకుంభ్ 'మృత్యుకుంభ్'గా మారుతోంది... అసెంబ్లీలో మండిపడిన మమత
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:41 PM
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా నిర్వహణలోపాలపై అక్కడి బిజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు.

కోల్‌కతా: బంగ్లాదేశీ ఛాందసవాదులతో తనకు సంబంధాలున్నాయంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) విరుచుకుపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని సవాలు విసిరారు. ఆ విధంగా చేస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా (Maha Kumbh) నిర్వహణలోపాలపై కూడా అక్కడి బిజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మమత తప్పుపట్టారు. నిర్వహణా లోపాల వల్ల మహాకుంభ 'మృత్యుకుంభ్'గా మారుతోందంటూ విమర్శించారు.
Rahul Gandhi: అర్ధరాత్రి నిర్ణయం సరికాదు... సీఈసీ ఎంపికపై రాహుల్
''ఇది మృత్యుకుంభ్... నేను మహాకుంభ్‌ను గౌరవిస్తాను, గంగామాతను గౌరవిస్తాను. కానీ అక్కడ సరైన ప్లానింగ్ లేదు. ఎంతమంది కోలుకున్నారు? డబ్బున్న వాళ్లు, వీఐపీలకు క్యాంపులు (టెంట్లు) దొరుకుతున్నాయి. పేదలకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. మేళాలో తొక్కిసలాట జరగడం సహజమే అయినా అలా జరక్కుండా ఏర్పాట్లు చేయడం ముఖ్యం. అందుకు మీరు ఎలాంటి ప్లానింగ్ చేశారు'' అంటూ కేంద్రం, యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని మమత నిలదీశారు.
పీఎంకు ఫిర్యాదు చేస్తా
బంగ్లాదేశ్ ఛాందసవాదులతో తాను కుమ్మక్కవుతున్నట్టు ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని మమతా బెనర్జీ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటోందని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడే హక్కు పేరుతో ప్రజలను విడగొట్టేలా విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని అన్నారు.
సువేందు ఏమన్నారు?
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి రాష్ట్రంలోని పరిస్థితులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతివ్యతిరేక కార్యకలాపాలు చాలా హెచ్చుగా ఉన్నాయని, ఇందుకు మమతా బెనర్జీనీ కారణమని ఆరోపించారు. గత రెండు మూడు నెలల్లో అసోం పోలీసులు, జమ్మూకశ్మీర్ పోలీసులు అనేక మంది బంగ్లాదేశీయులను, రోహింగ్యాలను, ఉగ్రవాదులను అరెస్టు చేశారని చెప్పారు. రాష్ట్రంలో 50 నుంచి 55 అసెంబ్లీ నియోజకవర్గాలు, 30-35 పోలీసు స్టేషన్ల పరిధిలో జనాభాలెక్కలు మారిపోయాయని, ఇందుకు మమతాబెనర్జీనే బాధ్యులని తప్పుపట్టారు. బెంగాల్ పోలీస్ మినిస్టర్ (హోం మంత్రి)గా ఆమె విఫలమయ్యారని అన్నారు. కాగా, అక్రమ బంగ్లాదేశీ వలసవాదులు, రోహింగ్యా వలసదారులు రాష్ట్రంలో స్థిరపడేందుకు మమతా ప్రభుత్వం అనుమతి ఇస్తోందని బీజేపీ నేతలు తరచు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Annamalai : ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడొచ్చు
Bengaluru: బెంగళూరులో తాగు నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీ జరిమానా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.