Murshidabad Violence: ముర్షీదాబాద్‌లో కేంద్ర బలగాలు.. కోల్‌కతా హైకోర్టు ఆదేశం
ABN , Publish Date - Apr 12 , 2025 | 08:36 PM
ముస్లింల అధిపత్యం ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో ఆందోళనకారులు శుక్రవారంనాడు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. పోలీసు వాహనాలతో సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు.

కోల్‌కతా: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్ (Murshidabad) జిల్లాలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడం, ముగ్గురు మృతి చెందడంతో కోల్‌కతా హైకోర్టు తక్షణ చర్యలకు దిగింది. కేంద్ర బలగాలను మోహరించాలని శనివారంనాడు ఆదేశించింది.
Waqf Related Clashes: బెంగాల్‌లో మళ్లీ హింస, కత్తిపోట్లతో ఇద్దరు మృతి
ముస్లింల అధిపత్యం ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో నిరసనకారులు శుక్రవారంనాడు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. పోలీసు వాహనాలతో సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు. మాల్దా, ముర్షీదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాలో ఈ నిరసనలు కొనసాగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 110 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. సూతి ఏరియాలో 70 మందిని, శంషేర్ గంజ్ ప్రాంతం నుంచి 41 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
కాగా, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ప్రాంతాల్లో శనివారం ఉదయం కూడా ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. ముగ్గురు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. దీంతో ముర్షీదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. సూతి, శంషేర్ గంజ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి వందతుల వ్యాప్తి చేయరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. తాజా ఘటనలపై బీజేపీ విరుచుకుపడింది. పరిస్థితిని సమర్ధవంతంగా అదుపు చేయలేకుంటే కేంద్ర సాయం తీసుకోవాలని మమతాబెనర్జీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేసింది.
ఇవి కూడా చదవండి..