Lamborghini: దూసుకొచ్చిన లంబోర్గిని కారు.. ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:35 PM
లగ్జరీ లంబోర్గిని కారు ఎక్కాక.. డ్రైవింగ్ మన కంట్రోల్లో ఉంటుందా అంటే చాలా మందికి ఉండదు. అలా ఉండకపోతే ఇదుగో ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకుంటాయి. అతివేగంతో లంబోర్గిని కార్ డ్రైవ్ చేసి.. ఇద్దరు కార్మికులను గాయపరిచాడు ఓ వ్యక్తి. ఇది ఏంటని ప్రశ్నిస్తే.. ఎవరూ చావలేదు కదా.. ఎందుకు అరుస్తున్నారంటూ పొగరుగా మాట్లాడాడు.

నోయిడా: అతి వేగం వల్ల ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో.. ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో నిత్యం వార్తలు చదువుతూనే ఉన్నాం. చేతికి స్టిరింగ్, హ్యాండిల్ చిక్కితే చాలు.. ఇక మేఘాల్లో తేలిపోతుంటారు. వాహనాన్ని గాల్లో పరుగులు పెట్టించి ప్రమాదాలకు కారణం అవుతుంటారు కొందరు వ్యక్తులు. తాజాగా ఓ వ్యక్తి ఇలానే లగ్జరీ లంబోర్గిని కారుని పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కంట్రోల్ కోల్పోయి.. పక్కనే పేవ్‌మెంట్ మీద ఉన్న వర్కర్స్ మీదకు కారును ఎక్కించాడు. చేసిన తప్పుకు సిగ్గు పడకపోగా.. ఎవరైనా చనిపోయారా.. లేదు కదా.. ఎందుకు అరుస్తున్నారంటూ పొగరుగా మాట్లాడాడు. ఆ వివరాలు..
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్, నోయిడాలో చోటు చేసుకుంది. దీపక్ అనే వ్యక్తి టెస్ట్ డ్రైవ్ చేయడం కోసం లగ్జరీ లంబోర్గిని కారు తీసుకుని రోడ్డు మీదకు వచ్చాడు. మితిమీరిన వేగంతో కారును నడపడంతో.. అది కాస్త కంట్రోల్ తప్పి.. పక్కనే సెక్టార్ 94 పేవ్‌మెంట్ మీద కూర్చున్న ఇద్దరు వ్యక్తుల మీదకు దూసుకెళ్లింది. ప్రమాదం కారణంగా పెద్ద శబ్దం రావడంతో.. స్థానికులు ఏం జరిగిందో అని అక్కడకు పరిగెత్తుకు వచ్చారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు దీపక్‌ను కిందకు రమ్మని చెప్పి.. అతడితో గొడవపడ్డారు. నీ అజాగ్రత వల్ల ఎంత ప్రమాదం జరిగిందో చూశావా అని ప్రశ్నించారు. అందుకు దీపక్ పొగరుగా.. ఎవరైనా చనిపోయారా ఏంటి లేదుకదా.. అంటూ తిరిగి వారితోనే గొడవ పెట్టుకున్నాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను పక్కనే ఉన్న ఆస్పత్రికి తరలించారు స్థానికులు.
ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దీపక్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్‌ని సీజ్ చేశారు. ఇక దీపక్ తీసుకువచ్చిన కారు.. మ్రిదుల్ తివారీ అనే 24 ఏళ్ల యూట్యూబర్‌దిగా తెలిసింది. దీపక్ అనే వ్యక్తి కార్లను కొనడం, అమ్మడం చేస్తుంటాడని వెల్లడయ్యింది.
ఇవి కూడా చదవండి:
అమెరికాతో సై అంటే సై అంటున్న ఇరాన్ .. దాడుల కోసం మిసైల్స్ రెడీ
జైల్లో ఉన్న మహిళా ఖైదీని కిస్ చేసిన పోలీస్.. కట్ చేస్తే