PM Modi: సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన మోదీ.. వీరాభిమాని శపథం నెరవేర్చిన ప్రధాని
ABN , Publish Date - Apr 14 , 2025 | 07:53 PM
ఎంతోకాలంగా ఎదురుచూసిన విలువైన క్షణాలు కళ్ల ముందుకు వచ్చినప్పుడు కలిగే ఆనందం, భావోద్వేగం మాటలకు అందదు. ఆ తృప్తికి మించిన తృప్తి ఇక జీవితంలో ఉండదనే అనుభూతి కలుగుతుంది. అలాంటి భావోద్వేగ ఘటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు జరిపిన హర్యానా పర్యటనలో చోటుచేసుకుంది.

హిస్సార్: జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని విలువైన క్షణాలు ఉంటాయి. అయితే ఎంతోకాలంగా ఎదురుచూసిన ఆ విలువైన క్షణాలు కళ్ల ముందుకు వచ్చినప్పుడు కలిగే ఆనందం, భావోద్వేగం మాటలకు అందదు. ఆ తృప్తికి మించిన తృప్తి ఇక జీవితంలో ఉండదనే అనుభూతి కలుగుతుంది. అలాంటి భావోద్వేగ ఘటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారంనాడు జరిపిన హర్యానా పర్యటనలో చోటుచేసుకుంది. తన కోసం 14 ఏళ్లుగా పాదరక్షలు లేకుండా నడక సాగిస్తున్న రామ్‌పాల్ కశ్యప్ (Rampal Kashyap) అనే వీరాభిమాని శపథాన్ని నెరవేర్చారు. కొత్త శాండల్స్ (బూట్లు) కశ్యప్ ముందుంచి వాటిని తొడుక్కునేందుకు మోదీ సహకరించారు. తన పట్ల చూపిన అభిమానానికి కశ్యప్ చలించిపోయారు. మోదీ సైతం ఆయన భుజం తడుతూ ఆత్మీయ సంభాషణ జరిపారు.
PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ
మోదీ ప్రధాని అయ్యేంత వరకూ...
హర్యానాలోని కైతాల్ నివాసి అయిన కశ్యప్ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగల నాయకుడు మోదీ అని బలంగా నమ్మేవారు. అదే నమ్మకంతో మోదీ భారతదేశ ప్రధాని అయ్యేంతవరకూ, ఆయనను స్వయంగా తాను కలుసుకునేంత వరకూ కాళ్లకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. 2009లో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్నించి ఎన్ని కాలాలు మారినా, ఎండొచ్చినా, వానొచ్చినా, ఎముకలు కొరికే చలిలోనైనా, వరదులు వచ్చినా పాదరక్షలు లేకుండానే తిరిగేవారు.
ఆ ఘడియ రానే వచ్చింది..
ఎట్టకేలకు కశ్యప్ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు హర్యానాలోని హిస్సార్ విమానాశ్రయాన్ని సోమవారంనాడు ప్రారంభించారు. అదే స్టేజ్ నుంచి కశ్యప్‌ను వేదికపై పిలిచారు. ఇంతకాలం తనకోసం చూసిన నిరీక్షణకు తెరదించుతూ కొత్త బూట్లను మోదీ ఆయన ముదుంచుతూ వాటిని తొడుక్కునేందుకు స్వయంగా సహకరించారు. ఆ దృశ్యం అక్కడున్న అందరి హృదయాలను కదిలించివేసింది. ''కశ్యప్ ప్రతిజ్ఞ నాకోసం మాత్రమే కాదు. మన దేశానికి సరికొత్త దిశానిర్దేశం కోసం కోరుకున్న ప్రజలందరి సమష్టి శక్తికి నిదర్శనం. 14 ఏళ్లపాటు పాదరక్షలు లేకుండా నడవడం అంటే అంత సులభం కాదు. ఇది త్యాగానికి, చెక్కుచెదరని విశ్వాసానికి పరాకాష్ట'' అని సభికుల హర్షధ్వానాల మధ్య మోదీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..