NEET Bill Rejection: నీట్‌ పై తమిళనాడు బిల్లు తిరస్కరణ

ABN, Publish Date - Apr 05 , 2025 | 04:02 AM

తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 'నీట్' మినహాయింపు బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించడం, అఖిలపక్ష సమావేశం 9న జరగనుందని సీఎంఎం స్టాలిన్‌ ప్రకటించారు

NEET Bill Rejection: నీట్‌ పై తమిళనాడు బిల్లు తిరస్కరణ

ఆమోదించని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అసెంబ్లీలో వెల్లడించిన సీఎం స్టాలిన్‌

9న అఖిలపక్ష సమావేశానికి పిలుపు

చెన్నై, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్‌ నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ రూపొందించిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. నీట్‌ కారణంగా తమిళనాట పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీట్‌ను రద్దు చేయిస్తామని డీఎంకే అధ్యక్షుడి హోదాలో ఎంకే స్టాలిన్‌ హామీ ఇచ్చారు. ఆ మేరకు డీఎంకే ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. నీట్‌కు వ్యతిరేకంగా బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, గవర్నర్‌కు పంపించగా ఆయన తిరస్కరించారు. అనంతరం కొన్ని మార్పులు చేసి, రెండోసారి గవర్నర్‌ పరిశీలనకు పంపారు. అయితే.. గవర్నర్‌ ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించినట్లు తనకు సమాచారం అందిందని స్టాలిన్‌ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు.


2021 సెప్టెంబరు 13న శాసనసభలో నీట్‌ మినహాయింపు ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి, గవర్నర్‌కు పంపితే ఆయన తిరస్కరించారని తెలిపారు. 2022 మే 2న అఖిలపక్ష సమావేశం నిర్వహించి, వారి సూచనలతో బిల్లులో కొన్ని సవరణలు చేసి, మళ్లీ గవర్నర్‌ ఆమోదానికి పంపగా.. ఆయన రాష్ట్రపతికి పంపి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన శాసనసభలో చేసిన ముసాయిదా బిల్లును కేంద్రం ఆమోదించకపోవడం గర్హనీయమన్నారు. నీట్‌పై భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించేందుకు అన్ని పార్టీలతో ఈ నెల 9న భేటీ కానున్నట్లు స్టాలిన్‌ తెలిపారు. ఆ సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 04:02 AM