Rahul Gandhi: కులగణనపై పార్లమెంటులో బిల్లు తెస్తే ఆమోదిస్తాం
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:27 PM
దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, దీనిపై పార్లమెంటులో బిల్లు తేవాలని రాహుల్ గాంధీ అన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే వెంటనే తమ ఆమోదం తెలిపుతామని చెప్పారు.

అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి కులగణన (caste census) ప్రస్తావన చేశారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, దీనిపై పార్లమెంటులో బిల్లు తేవాలని అన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే వెంటనే తమ ఆమోదం తెలిపుతామని అన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏఐసీసీ సదస్సు, సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, ఇదే విషయాన్ని పార్లమెంటులో మోదీ ముందు తాను ప్రస్తావించినట్టు చెప్పారు.
Waqf Law: నేను ఇక్కడుండగా అది అమలు కాదు: మమత
తెలంగాణలో ఇదే పని చేశాం
"తెలంగాణలో విప్లవాత్మక అడుగు వేశాం. కులగణన జరిపాం. దీనికి కొద్ది నెలల ముందు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ప్రధానిమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంటులో అడిగాను. గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల వారికి దక్కాల్సిన నిజమైన వాటా దక్కుతోందా అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాను. కానీ ప్రధాని కానీ, ఆర్ఎస్ఎస్ కానీ చాలా స్పష్టంగా కులగణనను వ్యతిరేకిస్తున్నాయి. మైనారిటీలకు దక్కుతున్న వాటా ఎంతో వెల్లడించేందుకు వారికి ఎంతమాత్రం ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణం. పార్లమెంటులో వారికి చాలా స్పష్టంగా కూడా చెప్పాను. కులగణన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే ఇప్పటికిప్పుడు తామంతా ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశాను'' అని రాహుల్ అన్నారు.
దేశ జనాబాలో 90 శాతం మంది జనాభాకు సరైన ప్రాతినిధ్యం లేదని, 90 శాతం అవకాశాలను ఇతరులు లాగేసుకుంటున్నారని రాహుల్ అన్నారు. కులగణనతో దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీల సంఖ్య తేలుతుందన్నారు.