SpaDeX: మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు తిరిగి ప్రారంభం.. ఇస్రో ఛీఫ్ నారాయణన్..
ABN , Publish Date - Feb 28 , 2025 | 06:23 PM
SpaDeX: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్పేడెక్స్ మిషన్ ప్రయోగాలు మళ్లీ మొదలుపెట్టనుంది. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇస్రో చీఫ్ వి. నారాయణన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రయోగంలో భాగంగా..

SpaDeX: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్చి 15 నుంచి 'స్పాడెక్స్' మిషన్ కింద మళ్ళీ ప్రయోగాలు ప్రారంభించనుందని.. ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. గతనెల జనవరి 16, 2025న తొలిసారి నింగిలో ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా అనుసంధానం చేయడంతో.. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇస్రో మళ్లీ స్పేడెక్స్ కింద మార్చి 15 నుంచి ప్రయోగాలు మొదలుపెట్టనుంది. ఈ సారి భవిష్యత్ ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిజ్ఞానాలను సమకూర్చుకునేందుకు.. చేజర్, టార్గెట్ అనే రెండు ఉపగ్రహాలను వేరు చేసి తిరిగి కలిపేందుకు ప్రయత్నించబోతోంది.
అసలు ప్రయోగం మార్చి 15 నుంచి.. ఇస్రో చీఫ్..
"ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంది. కాబట్టి, ప్రతి రెండు నెలలకు ఒకసారి మాకు ప్రయోగానికి 10-15 రోజులు అనుకూలిస్తాయి. ప్రస్తుతం ఉపగ్రహాలను వేరు చేయడానికి, రీడాక్ చేయడానికి 'సిమ్యులేషన్' ప్రయోగాలను నిర్వహిస్తున్నాము. ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. మార్చి 15 నుంచి 'స్పేడెక్స్' (SpaDeX) ఉపగ్రహాలపై ప్రయోగాలు చేపడతామని" ఇస్రో చైర్మన్ వి నారాయణన్ జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు.
గతేడాది డిసెంబర్ 30న ఇస్రో 'స్పాడెక్స్' మిషన్‌ను ప్రారంభించింది. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను డాక్ చేసే ప్రయోగాన్ని ప్రదర్శించడానికి ఇస్రో అప్పుడు SDX01, SDX02 అనే రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనేక ప్రయత్నాల తర్వాత ఇస్రో 2025 జనవరి 16న ఈ విజయాన్ని సాధించింది.
Gold Rates : బంగారం ధరలు రోజూ ఒకేలా ఎందుకుండవు.. ఈ 5 అంశాలే ప్రధాన కారణం..
ISRO New Project : ఇస్రో స్పేడాక్స్ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది.. పూర్తి వివరాలు..