Ayodhya Surya Tilak: అయోధ్యలో నేడు అద్భుత దృశ్యం
ABN , Publish Date - Apr 06 , 2025 | 07:46 AM
శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఇవాళ శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నవమి సందర్భంగా నేడు ఆలయంలో ఒక అద్భుతం ఆవిష్కృతం కానుంది.

అయోధ్యలో బాలరాముని ఆలయ నిర్మాణం తర్వాత రెండో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మార్చి 29 నుంచి వసంత నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాముల వారికి అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా సూర్యకిరణాలతో తిలకం దిద్దనున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాల రాముడి నుదిటిపై నాలుగు నిమిషాల పాటు ప్రసరిస్తాయి. ఆలయం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలో బాల రాముడి నుదుటపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు.
సనాతన ధర్మంలో సూర్యుడిని శక్తికి మూలంగా భావిస్తారు. సూర్యుడు తన కిరణాలతో రామునికి తిలకం దిద్దడం వల్ల రామునిలోని దైవత్వం మేల్కొంటుందని విశ్వసిస్తారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఉంది.
ఇవాళ అయోధ్యకు దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ప్రత్యేక పాస్‌లను రద్దు చేసింది.
ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, తాగునీటి ఏర్పాట్లు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు చోట్ల 108 అంబులెన్సులను సిద్ధం చేసింది. ఇక, డ్రోన్ల సాయంతో సరయూ నది జలాలను భక్తులపై జల్లనున్నారు. దాదాపు 500 ఏళ్ల తర్వాత రాముడు పుట్టిన స్థలంలో దివ్యమైన ఆలయ నిర్మాణం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో ఆలయ ప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది.
ప్రస్తుతం సూర్య తిలకం అద్భుత దృశ్యాన్ని లైవ్ లో చూద్దాం..
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News