Maha Kumbh Mela: మహాకుంభ మేళపై ఆసక్తికర వ్యాఖ్యలు.. స్టీవ్ జాబ్స్ సతీమణికి అస్వస్థత
ABN, Publish Date - Jan 14 , 2025 | 03:13 PM
మహాకుంభమేళలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ విచ్చేసిన యాపిల్ సంస్థ సహా వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి లారిన్స్ పావెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ, జనవరి 14: ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళలో యాపిల్ సహా వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి లారిన్ పావెల్ జాబ్స్ పాల్గొన్నారు. అయితే ఆమె అస్వస్థతకు గురయ్యారని నిరంజనీ అఖాడాకు చెందిన స్వామిజీ కైలాసానంద గిరి మహరాజ్ మంగళవారం వెల్లడించారు. మహాకుంభమేళాలో భాగంగా ఆమె సోమవారం గంగా నదిలో స్నానమాచరించారని చెప్పారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు.
అయితే రెండో రోజు.. అంటే మంగళవారం ఆమెకు అలెర్జి వచ్చిందని స్వామిజీ కైలాసానంద గిరి మహారాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆశ్రమంలో ఆమె విశ్రాంతి తీసుకొంటున్నారని చెప్పారు. ఇక ఈ మహాకుంభమేళకు కోట్లాది మంది ప్రజలు పోటెత్తడాన్ని చూసి.. ఇంత మంది జన సమూహాన్ని గతంలో తానెన్నడూ చూడలేదని లారిన్స్ పావెల్ చెప్పారన్నారు. మహా కుంభమేళలో పాల్గొనేందుకు భారత్ వచ్చిన ఆమె.. ప్రస్తుతం నిరంజనీ అకాడలో విశ్రాంతి తీసుకొంటున్నారని వివరించారు. ఆమె భారత్ రావడం ఇది రెండోసారి అని.. ధ్యానం చేసుకొనేందుకు తమ ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారని పేర్కొన్నారు.
జనవరి 15వ తేదీ వరకు ఆమె భారత్‌లోనే ఉంటారన్నారు. యూఎస్ నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. జనవరి 20వ తేదీన ఆయన దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టన్నారు. ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు. అందుకోసం జనవరి 15వ తేదీ అనంతరం లారిన్స్ పావెల్ యూఎస్ బయలు దేరి వెళ్తారన్నారు. మరోవైపు స్టీవ్ జాబ్స్ సతీమణి లారిన్ పావెల్ జాబ్స్.. తన పేరును కమలాగా మార్చుకొన్నారు. జనవరి 10వ తేదీన ఆమె తన పేరు మార్చుకున్నారు. ఇక లారిన్స్ పావెల్.. వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు.
ఇటీవల ప్రారంభమైన మహాకుంభమేళ.. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ కుంభమేళలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా ప్రయోగరాజ్‌కు పోటెత్తుతోన్నారు. ఈ మహాకుంభమేళ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు మూడు నుంచి నాలుగు కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానమాచరించారు.
For National New And Telugu News
Updated Date - Jan 14 , 2025 | 03:13 PM