Judges Reveal Assets: మన ఆస్తులు ప్రకటిద్దాం
ABN, Publish Date - Apr 04 , 2025 | 06:30 AM
సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా తమ ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. పారదర్శకతను పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా, ప్రధాన న్యాయమూర్తి సహా 30 మంది జడ్జీలు తమ ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు

చీఫ్ జస్టిస్ సహా సుప్రీంకోర్టు జడ్జీలందరి నిర్ణయం
ఆ వెంటనే ఆదాయ వివరాలను ప్రకటించిన సీజే
స్వచ్ఛందం అన్నపుడు పాటించని న్యాయమూర్తులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : ప్రధాన న్యాయమూర్తి సహా సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులంతా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట భారీగా బయటపడిన నగదు కలకలం రేపుతున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానంలోని జడ్జీలు ఇందుకు సిద్ధమయ్యారు. న్యాయవ్యవస్థలో పారదర్శకతను పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు. చీఫ్ జస్టిస్ సహా సుప్రీంకోర్టులో ప్రస్తుతం 30 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన వీరందరితో ఫుల్‌కోర్టు సమావేశం జరిగింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్కరూ తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అంతకుముందు... 1997లో చేసిన తీర్మానం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా తమ ఆస్తుల వివరాలను ప్రధాన న్యాయమూర్తికి అందించాల్సి ఉంది. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలంటూనే... దానిని తప్పనిసరి చేయకుండా, జడ్జిల ఇష్టానికే వదిలేస్తూ 2009లో ఒక తీర్మానం చేశారు. దీంతో చాలామంది న్యాయమూర్తులు తమ ఆస్తులను బహిర్గతం చేయలేదు. ఇప్పుడు ఎవరికీ ఆ మినహాయింపు ఉండదు. ప్రధా న న్యాయమూర్తి సహా సుప్రీంకోర్టు జడ్జిలంతా తమ ఆస్తులను బహిర్గతం చేయాల్సిందే. ఆ వివరాలను సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పెడతారు.
ఇవి కూడా చదవండి
Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest National News And Telugu News
Updated Date - Apr 04 , 2025 | 06:30 AM