National : గోల్డెన్ ఛాన్స్.. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25000 రివార్డు..
ABN, Publish Date - Jan 14 , 2025 | 03:04 PM
గోల్డెన్ అవర్.. ఈ మధ్య కాలంలో ఈ పదం ట్రెండింగ్ అవుతున్న పదం. అందుకు కారణం సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షల్లో మోసపోయిన వాళ్లకు.. ఆశల్ని చిగురింపజేసే ఈ 'గోల్డెన్ అవర్'ని ఇంట్రడ్యూస్ చేశాయి ప్రభుత్వాలు. ఇప్పుడు ఈ 'గోల్డెన్ అవర్' అనే కాన్సెప్ట్ రోడ్డు ప్రమాదాల బాధితులకు కూడా అద్భుత వరంలా, ప్రాణదాయినిలా మారింది...
గోల్డెన్ అవర్.. ఈ మధ్య కాలంలో ఈ పదం ట్రెండింగ్ అవుతున్న పదం. అందుకు కారణం సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షల్లో మోసపోయిన వాళ్లకు.. ఆశల్ని చిగురింపజేసే ఈ 'గోల్డెన్ అవర్'ని ఇంట్రడ్యూస్ చేశాయి ప్రభుత్వాలు. మోసపోయామని చింతిస్తూ కూర్చోకుండా మొదటి గంటలోనే మేల్కొని సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే.. పోయిన మొత్తం సొమ్ము కాకున్నా.. వీలైనంత వరకూ రికవరీ చేసే వీలుంటుంది. ఇప్పుడు ఈ 'గోల్డెన్ అవర్' అనే కాన్సెప్ట్ రోడ్డు ప్రమాదాల బాధితులకు కూడా అద్భుత వరంలా, ప్రాణదాయినిలా మారింది.
ఈ 'గోల్డెన్ అవర్' కాన్సెప్ట్ అనేది లిటిల్ బిట్ మెడికల్ నాలెడ్జ్ ఉన్న చాలా మందికి తెలిసే ఉంటుంది. హృద్రోగం బారిన పడి.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారిని మొదటి గంటలో ఆస్పత్రికి చేర్చి, చికిత్స అందించగలిగితే 70 నుంచి 80 శాతం హార్ట్ ఎటాక్ మరణాలను ఆపొచ్చు అని వైద్యులు చెబుతున్నారు. నిజానికి ఈ గోల్డెన్ అవర్ గురించి అవగాహన 80ల నుండే విస్తృతంగా ఉంది. ఇప్పుడు నడుస్తోంది AI యుగం కాబట్టి.. కొత్త కొత్త వ్యాధులతో పాటూ, దారి దోపిడీలు కాస్తా ఆన్‌లైన్ సైబర్ నేరాలుగా మారిపోయి లక్షలాది మందిని ముంచేస్తున్నాయి. ఈ సైబర్ నేరగాళ్లకు దిమ్మతిరిగేలా సైబర్ నిపుణులు.. ఈ 'గోల్డెన్ అవర్'ను తెరపైకి తీసుకురాగా, ప్రభుత్వాలు దీనిపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఓ 'గోల్డెన్ అవర్' కాన్సెప్ట్‌ని ప్రజల ముందుకు తెచ్చింది.
మారుతున్న కాలంతో పాటూ, మనిషి జీవన శైలిలో మార్పుల వల్ల.. వయసుతో సంబంధం లేకుండా, ఆడా మగ తేడా లేకుండా, జిమ్ బాడీ, ఫిట్‌నెస్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్లని కూడా హార్ట్ స్ట్రోక్ అనేది ఉన్న చోటనే కుప్ప కూలుస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వైద్య రంగానికి సంబంధించిన 'గోల్డెన్ అవర్' గురించి తెలుసుకోవాలి. అలాగే ఒక్క రాంగ్ క్లిక్‌తో అకౌంట్లో ఉన్న లక్షల రూపాయలకు రెక్కలొచ్చి అమాంతం ఎగిరిపోతే.. ఆ సమయంలో మోసపోయిన వాళ్లకు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పనవుతుంది. కాబట్టి పోయిన ప్రాణం వెనక్కొచ్చినట్లు, పోగొట్టుకున్న సొమ్ము రికవరీ కావాలంటే సైబర్ నేరాలకు సంబంధించిన 'గోల్డెన్ అవర్' గురించి కూడా ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాల్సిందే. ఇక వీటి కంటే అత్యంత ముఖ్యమైన 'గోల్డెన్ అవర్' ఇంకొకటుంది. చాలా ముఖ్యమైందని ఎందుకంటున్నాం అంటే.. దీన్ని వాడుకున్న వాళ్లకు పుణ్యంతో పాటూ 'ఫలం' కూడా దక్కుతుంది మరి.
దిగ్గజ డైరెక్టర్ తీసిన, సంక్రాంతికి రిలీజ్ అయిన 'గేమ్‌ఛేంజర్' సినిమా మీరు చూశారో లేదో కానీ.. శంకర్ తీసిన 'అపరిచితుడు' సినిమా మాత్రం కచ్చితంగా చూసే ఉంటారు. అపరిచితుడు సినిమాలో గుండెల్ని పిండేసే సీన్ ఒకటుంటుంది. రోడ్డు ప్రమాదానికి గురై నెత్తురోడుతున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు రామం పాత్రలోని కథానాయకుడు శక్తి మేర ప్రయత్నిస్తాడు. రద్దీగా ఉండే ఆ రోడ్డులో లిఫ్ట్ ఇచ్చేందుకు ఒక్కరు కూడా ముందుకురారు. కొందరైతే అతని ప్రాణాలు ఉన్నాయో పోయాయో కనీసం చూడకుండా శవం కిందే లెక్క కట్టేస్తారు. సమాజంలో ఉండే శాడిస్టిక్ రియాల్టీని ఆ సీన్‌లో డైరెక్టర్ అత్యంత రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. నిజానికి సాయం చేయాలని ఉన్నా.. చాలా మంది పోలీసు కేసులు, కోర్టులు, సాక్షాలు అంటూ తిరగాల్సి వస్తుందేమోనన్న భయంతో.. చూసీ చూడనట్లు వెళ్లిపోతుంటారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకే.. కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇక నుంచి రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తుల్ని ఎలాంటి సంకోచం లేకుండా.. ఆస్పత్రుల్లో చేర్పించొచ్చు.
ప్రాణాపాయ స్థితిలో ఎవరినైనా ఆస్పత్రికి తీసుకెళ్లిన సందర్భాల్లో చికిత్స అందించేందుకు ఎలాంటి పోలీసు కేసు ముందుగా నమోదు చేయాల్సిన రూల్ లేదని కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పింది. అంతేకాదు.. రోడ్డు ప్రమాదాల్లో స్పందించి సాయం చేసిన వ్యక్తులను ఇబ్బంది పెట్టకూడదన్న స్ట్రిక్ రూల్‌ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. ఇంకా ఏదైనా సందేహం ఉంటే.. అది కూడా అవసరం లేదంటూ తాజాగా 'గోల్డెన అవర్' విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లో ఆస్పత్రికి చేరిస్తే 25 వేల రివార్డును కేంద్రం అందించనుంది. నిజానికి రోడ్డు ప్రమాదాల్లో మానవత్వంతో స్పందించి, సేవా దృక్పథంతో ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చే వారిని గుడ్ సమరిటన్స్ ( ఉత్తమ పౌరులు)గా గుర్తించి రూ.5 వేల రివార్డు అందజేసే విధానాన్ని ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. తాజాగా ఈ అవార్డును రూ.25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో.. ఇక సందేహించకుండా మీలోని మానవత్వానికి పని చెప్పండి. ఉత్తమ పౌరులుగా మీరు తీసుకునే రూ.25 వేలు రివార్డు కన్నా.. మీ వల్ల ఓ ప్రాణం నిలబడిందన్న సంతృప్తి మీకు కచ్చితంగా దక్కుతుంది.
Updated Date - Jan 14 , 2025 | 03:04 PM