Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:27 PM
వక్ఫ్ చట్టం-2025 సవరణ బిల్లుపై దాఖలైన పిటిషన్లపై సోమవారం నాడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

ఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన వక్ఫ్ సవరణ బిల్లు-2025కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో ఇది చట్టంగా మారింది. ఈ బిల్లుపై లోక్‌సభలో సుమారు 14 గంటల పాటు సుదీర్ఘ చర్చ నడిచింది. అనంతరం సవరణల వారీగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా.. బిల్లుకు అనుకూలంగా 288 మంది.. వ్యతిరేకంగా 232 మంది లోక్‌సభ సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఎట్టకేలకు బిల్లు చట్టరూపం దాల్చింది.
అయితే వక్ఫ్ బిల్లు చట్టరూపం దాల్చకముందే అనగా రాష్ట్రపతి ఆమోదం లభించకుముందే.. పలువురు.. వక్ఫ్ బిల్లును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షనింగ్ చేశారు. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్.. వీటిని మెన్షన్ చేశారు. అంతేకాక వీటిపై త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు.
వక్ఫ్ చట్టంపై సుప్రీకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం నాడు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అటువంటి విషయాలను నిర్వహించడానికి దేశంలో ఒక వ్యవస్థ అమలులో ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని.. తమ ప్రభుత్వం ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బ తీయడం లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
అసలు స్టాక్ మార్కెట్ నష్టాలు ఎందుకు..కారణాలు ఇవే...
జయా బచ్చన్‌ని ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్.. ఇంత పొగరు పనికి రాదంటూ