Naga Vamsi: ఇప్పుడు సినిమాలు తీయడం కష్టమే..
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:44 AM
తెలుగులో సీక్వెల్స్ ట్రెండ్‌ను విజయవంతంగా మొదలుపెట్టిన నాగవంశీ ప్రస్తుతం అగ్ర నిర్మాతల్లో ఒకరు. తాజాగా ఆయన ‘నవ్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిశ్రమలోని సమస్యలు, అవకాశాలపై విలువైన అభిప్రాయాలు వెల్లడించారు.

తెలుగులో సీక్వెల్స్ సంస్కృతికి విజయవంతంగా తెరతీసిన నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నాగవంశీ. ప్రస్తుతం తెలుగులో అగ్ర నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలుగు నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి.. పరిశ్రమకు ఉన్న అవకాశాల గురించి ఆయన ‘నవ్య’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలలోకి వెళ్తే...
‘మ్యాడ్ 2’ విజయం మీకు ఎలాంటి అనుభూతి మిగిల్చింది?
చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఒక సీక్వెల్ తీసి ప్రేక్షకులను మెప్పించటమనేది అంత సులభం కాదు. ‘మ్యాడ్ 2’- హిందీలో బ్లాక్‌బస్టర్ అయిన ‘గోల్‌మాల్’ ఫ్రాంచైజ్ సినిమాల మాదిరిగా ఉంటుంది. దీనిలో స్టోరీ లైన్ ఉండదు. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఉంటుంది. ఈ సినిమాకు ‘మ్యాడ్’ కన్నా నాలుగైదు రెట్లు వసూళ్లు వచ్చాయి. నా వరకు చాలా సంతృప్తిగా ఉన్నా.
హాలీవుడ్‌లో సీక్వెల్స్ బంగారు గుడ్లు పెట్టే బాతులు... ఆ తరహా వ్యూహంతోనే మీరు ఈ సినిమాలు తీసారా?
‘టిలు ‘మ్యాడ్’ సినిమాలు తీసే సమయంలో అవి సీక్వెల్స్‌గా మారతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. రెండో పార్ట్ విజయవంతమయిన తర్వాత మాత్రమే వీటిని ఫ్రాంచైజ్‌గా మార్చాలనుకున్నా. ఎందుకంటే- సినీ రంగంలో విజయం సాధించే సినిమాలు ఐదు శాతం మాత్రమే. ఎంత మంచి కంటెంట్‌తో సినిమా తీసినా- అది హిట్ అవుతుందని మనం చెప్పలేం. ఏవైనా పరాజయాలు ఎదురయితే - సీక్వెల్స్ ట్రంప్ కార్డ్స్‌గా ఉపయోగపడతాయి. ఎందుకంటే సీక్వెల్స్‌ను ఎప్పుడూ తీసినా అవి తప్పనిసరిగా విజయవంతమవుతాయి.
సినీ నిర్మాణం చాలా కష్టమయిపోయింది.. నిర్మాతలు సమస్యలు ఎదుర్కొంటున్నారనే వార్తలు వింటుంటాం.. వీటిలో నిజమెంత?
సినీ నిర్మాణం చాలా కష్టమయిపోయింది. ఇది వాస్తవం. ఎందుకంటే నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. ఆదాయ మార్గాలు మాత్రం మూసుకుపోతున్నాయి. ఉదాహరణకు శాటిలైట్ రైట్స్ (టీవీలలో ప్రసారాల ద్వారా) నుంచి వచ్చే ఆదాయం దాదాపు సున్నా అయిపోయింది. హిందీ డబ్బింగ్ నుంచి వచ్చే ఆదాయం కూడా రావటం లేదు. ఇక ఓటీటీ ప్లాట్‌ఫాంలు కూడా ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాయి. వీటికి తోడు - సినిమా చాలా బావుంటే తప్ప ప్రేక్షకులు థియేటర్‌కు రావటం లేదు. కొన్ని సినిమాలకు ఓపినింగ్స్ కూడా ఉండటం లేదు. ఈ కారణాల వల్ల నిర్మాతకు ఆదాయ మార్గాలు తగ్గాయి.
మరి నిర్మాణ వ్యయం తగ్గించుకోవచ్చు కదా...
నిర్మాణ విలువలు ఒక స్థాయిలో ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమాలు చూడటం లేదు. సాంకేతిక విలువలు కావాలంటే ఖర్చు పెట్టాల్సిందే. అందుకే సినీ నిర్మాణం రిస్కీగా మారింది.
వందల కోట్ల కలెక్షన్లు వచ్చేస్తున్నాయని పోస్టర్లు పడుతున్నాయి కదా...
ఒక సంవత్సరంలో 100 సినిమాలు విడుదల అయ్యాయి అనుకుందాం. మీరు చెప్పిన వందల కోట్లు ఐదారు సినిమాలకే వస్తున్నాయి. మిగిలిన నిర్మాతలందరూ దెబ్బతింటున్నారు కదా..
మరి ఇంత రిస్కీ అయినప్పుడు సినిమాలు ఎందుకుతీస్తున్నారు?
మిగిలిన వారి గురించి నేను మాట్లాడను. కానీ నాకు కానీ.. మైత్రీ మూవీ మేకర్స్‌కు కానీ తెలిసిన పని ఇదే! ‘‘తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు.. రాని పని చేయకూడదు’’ అని ‘జులాయి’లో ఒక డైలాగ్ ఉంది. దాన్నే ఫాలో అవుతున్నాం. వేరే వ్యాపారాల్లోకి వెళ్లి దెబ్బతినటం కన్నా.. తెలిసిన ఈ పని బాగా చేయటం మంచిది కదా!
నిర్మాణ వ్యయం పెరిగిపోవటానికి ఎక్కువ రోజులు షూటింగ్ చేయటమే కారణమంటున్నారు కదా...
వర్కింగ్ డేస్ తగ్గించాలని ప్రయత్నిస్తున్నాం. కానీ కొన్ని సినిమాలకు తప్పదు. కంటెంట్‌పై రాజీ పడితే మొత్తానికే మోసం వస్తుంది. అందువల్ల కొన్ని సినిమాలకు ఖర్చు పెట్టక తప్పటం లేదు.
సినిమా విడుదలయిన వెంటనే ‘ఐబొమ్మ’ లాంటి వాటిలో పైరసీ ప్రింట్స్ వచ్చేస్తున్నాయి.. వీటిని అరికట్టలేరా?
గత కొన్ని నెలలుగా పైరసీ బాగా పెరిగింది. మంచి క్వాలిటీ ఉన్న ప్రింట్స్ బయటకు వచ్చేస్తున్నాయి. నా ఉద్దేశంలో పైరసీ చూసేవారు ఓ ఐదు శాతం మాత్రమే ఉంటారేమో.. ఎక్కువ మంది థియేటర్లలోనే సినిమా చూడాలనుకుంటారు.
అయినా కలెక్షన్లకు ఇది పెద్ద ప్రమాదంగా మారింది. ప్రస్తుతం ఛాంబర్‌లో ఉన్న యాంటీ పైరసీ విభాగం ఈ సవాళ్లను ఎదుర్కోవటానికి సరిపోదు. ఇంతకు ముందు థియేటర్లలో ప్రింట్స్ తీసేవారు. ప్రస్తుతం పైరసీ
అవుతున్నవి అలాంటివి కావు. మంచి క్వాలిటీ ఉన్న ప్రింట్స్. ఎక్కడి నుంచి లీక్ అవుతు న్నాయో ‘క్యూబ్’ ద్వారా కనుక్కొవటానికి ప్రయత్నిస్తున్నాం.
సోషల్ మీడియా ప్రేక్షకుల అభిప్రాయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుందని మీరు భావిస్తున్నారా?
సోషల్ మీడియా వల్ల మంచి, చెడు- రెండూ ఉన్నాయి. మంచి విషయానికి వస్తే ఏదైనా కంటెంట్ వైరల్ కావాలంటే సోషల్ మీడియానే కావాలి. సోషల్ మీడియా యుగంలో దేనిని దాచుకోవాలనుకున్నా దాచుకోలేం. ఇక చెడు విషయానికి వస్తే- వ్యక్తిగత అభిప్రాయాలే ఎక్కువ ప్రచారంలోకి వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒక సినిమా బావుందా? లేదా అనే విషయంలో 40 మంది బావుంది అంటారు.. 40 మంది బావులేదంటారు. 20 మంది తటస్థంగా ఉండిపోతారు. ఇది పర్వాలేదు. కానీ ఎవరో ఒకరి అభిప్రాయం విస్తృతంగా ప్రచారమైతేనే సమస్య.
సివిఎల్‌ఎన్ ప్రసాద్
ఉండాలనుకుంటాం... కానీ
తెలుగు పరిశ్రమలో ఉన్న నిర్మాతలందరూ అన్ని విషయాల్లో ఏకాభిప్రాయంలో ఉండాలనుకుంటాం. మీటింగ్‌లలో మాట్లాడుకున్నప్పుడు ఏకాభిప్రాయమే ఉంటుంది. బుధవారం వరకు ఒక మాటపైనే ఉంటారు. గురువారం- అంటే సినిమా విడుదలవ్వటానికి ఒక రోజు ముందు నిర్మాతపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. కమిట్‌మెంట్స్ ఉంటాయి. అప్పటి దాకా ధైర్యంగా ఉన్న నిర్మాతలో ఎక్కడో చిన్నపాటి అభద్రతాభావం మొదలై ‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్లు పెరిగిపోతుంది. ఈ సమయంలో వారిపై పీఆర్‌ఓలు ఒత్తిడి పెట్టడం మొదలుపెడతారు. ‘‘ఇది చేయకపోతే వాళ్లు ఇలా చేస్తారు..అలా చేస్తారు..’’ అని భయపెడుతూ ఉంటారు. దీంతో కొన్ని విషయాల్లో నిర్మాతలు రాజీపడిపోతారు. ‘సినిమా బావుంటే చూస్తారు. బావుండకపోతే చూడరు’.. ఈ విషయం అందరి నరనరాల్లో జీర్ణమయిపోతే- ఇలాంటి ఒత్తిళ్లకు భయపడటం మానేస్తాం. దానికి చాలా ధైర్యం కావాలి..
కార్పొరేట్ పెట్టుబడులు రావటం వల్ల మంచి సినిమాలు ఎక్కువగా తీయగలుగుతాం. సితారలో ‘మైహోం’ సంస్థ పెట్టుబడులు పెట్టింది.. ‘మైహోం’ రాముకు సినిమాలపై మంచి అభిరుచి ఉంది. ఏదో చేయాలనే తపన ఉంది. అందుకే ‘ఆహా’ కూడా ప్రారంభించారు. ఇక సృజనాత్మకమైన నిర్ణయాలు విషయంలో కలగజేసుకోరు కాబట్టి ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News