NRI: తానా 24వ సదస్సుకు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండికి ఆహ్వానం
ABN , Publish Date - Mar 22 , 2025 | 02:18 PM
ఈ ఏడాది జులై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవిలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో నిర్వహించనున్నారు. తానా 24వ ద్వైవార్షిక మహాసభలకు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను తానా ప్రతినిధులు ఆహ్వానించారు.

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలు ఈ ఏడాది జులై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవిలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో నిర్వహించనున్నారు. తానా 24వ ద్వైవార్షిక మహాసభలకు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను తానా ప్రతినిధులు ఆహ్వానించారు.
తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడిలు వేమూరి రాధాకృష్ణను శనివారం హైదరాబాద్‌లో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమెరికాతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు వివరించారు. 24వ తానా సదస్సు సందర్భంగా నిర్వహించే బిజినెస్ సెమినార్, సాంస్కృతిక కార్యక్రమాలకు అతిథిగా రావాలని తానా ప్రతినిధులు కోరారు.
అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం
తానా అమెరికాలో అతిపెద్ద తెలుగు సంస్థగా ఉంటూ అక్కడి తెలుగు సమాజానికి ఎనలేని సేవలందిస్తోంది. ఉత్తర అమెరికాలో తెలుగు సమాజానికి సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో సేవలందించడంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణలో ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల డాలర్లను సేవా కార్యక్రమాల కోసం తానా ఖర్చు చేస్తోంది. అమెరికాలో తెలుగు కమ్యూనిటీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సమయలో వారికి తానా అండగా నిలుస్తోంది.