Delhi Capitals in IPL: ఢిల్లీ నేర్పిన గుణపాఠం.. అలా చేస్తే మీ పరిస్థితి అంతే
ABN , Publish Date - Apr 14 , 2025 | 05:13 PM
ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయింది. టీమ్ వర్క్‌ను విస్మరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది. ఢిల్లీ జట్టు ఎలాంటి గుణపాఠం నేర్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఒక వ్యక్తి జీవితంలో జయపజయాలు కామన్.. కానీ విజయం వరించాల్సిన సమయంలోనూ అపజయం స్వాగతం పలికితే వీడో దురదృష్టవంతుడంటుంటారు. ఓ రకంగా అది వాస్తవమే లక్ కలిసి రాకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్ని సందర్భాల్లో విజయమూ అపజయంగా మారిపోతుంది. సరిగ్గా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ఇదే విషయాన్ని తెలియజేస్తోంది.
15 ఓవర్ల వరకు మ్యాచ్ ఢిల్లీ వైపే ఉంది. కానీ16వ ఓవర్ నంచి మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ముంబయికి విజయం కష్టమని భావించారంతా. కానీ సీన్ ఒక్కసారిగా ఛేంజ్ అయిపోయింది. ముంబై ఫేవరెట్‌గా మారిపోయింది. తరువాత విజయం రెండు జట్ల మధ్య చివరివరకు దోబూచులాడినప్పటికీ ఢిల్లీ ఆటగాళ్ల స్వయంకృతపరాదం కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. సరిగ్గా వ్యక్తి జీవితానికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఓ వ్యక్తి తన జీవితంలో చేస్తున్న పనిలో ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్న పొరపాటు ఎలాంటి ఫలితానిస్తుందో చెప్పడానికి ఢిల్లీ, ముంబై జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.
ఓ వ్యక్తి వరుస విజయాలు సాధిస్తూ రావొచ్చు. తన ట్రాక్ రికార్డు అంతా అద్భుతంగా ఉండి ఉండొచ్చు. అలా అని తాను చేసే పనిలో తెలిసో తెలియకో చేసే తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని ఆదివారం నాటి ఢిల్లీ, ముంబై మ్యాచ్ గుర్తుచేస్తోంది. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ ఓ రకంగా కష్టాల్లో పడింది. దీంతో టార్గెట్ ఛేజింగ్ కష్టమని భావించారు. కాని కరుణ్ నాయర్ ఆట చూసిన తర్వాత ఢిల్లీ విజయాన్ని ఎవరూ ఆపలేరని క్రికెట్ అభిమానులు ఓ అంచనాకు వచ్చారు. 12 ఓవర్ల వరకు ఢిల్లీ గెలుపుపై ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. 15.2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు ఇంకా కొట్టాల్సింది 28 బంతుల్లో 46 పరుగులు. ఇంకా కెఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా, అశుతోష్ శర్మ, విపరాజ్ నిగమ్ వంటి బ్యాటర్లు ఉన్నారు. లక్నోతో విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విపరజ్ బ్యాటింగ్ చూసిన తర్వాత ఢిల్లీ గెలుస్తుందనే నమ్మకం క్రికెట్ అభిమానుల్లో ఇంకా ఉంది. 15.3వ ఓవర్‌లో కెఎల్ రాహుల్ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ముంబై వైపు తిరిగింది. అప్పటికీ ఢిల్లీకి అవకాశం ఉన్నా ఆ జట్టు ప్లేయర్ల నిర్లక్ష్యం కారణంగా ఓటమి పాలయ్యారు.
వరసగా మూడు వికెట్లు
తాము గెలుస్తామనే అతి విశ్వాసమే ఢిల్లీ జట్టును ఓడించిందనేది క్రికెట్అభిమానుల మాట. వికెట్లు కాపాడుకుంటూ ఓవర్‌కు ఒక బౌండరీ, మిగిలిన బంతులు సింగిల్స్ తీసుకుంటే ఢిల్లీ సునాయసంగా గెలుపొందేది. కానీ అనవసర షాట్లకు పోయి వరుసగా వికెట్లు కోల్పోవడంతో గెలవాల్సిన ఢిల్లీ ఓడిపోయింది. వరుసగా మూడు రనౌట్లు కావడమే ఢిల్లీ జట్టు ఓటమికి కారణం అయినప్పటికీ అనవసర రన్స్‌కు వెళ్లి బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. గెలుస్తామనే ధీమాతో ఉన్న ఢిల్లీ జట్టు బ్యాటర్లు అనవసర షాట్లకు వెళ్లి తీవ్ర ఒత్తిడిని కొని తెచ్చుకున్నారు. చివరి రెండు ఓవర్లలో ప్రతి బంతికి పరుగు తీయాల్సి ఉండటంతో వరుసగా ముగ్గుర బ్యాటర్లు రనౌట్ రూపంలో పెవిలియన్ చేరారు. ఇదే సూత్రం నిత్య జీవితానికి వర్తిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్లినా, తీవ్ర ఒత్తిడికి గురైనా ఎలాంటి ఫలితం ఉటుందో ఢిల్లీ, ముంబై మ్యాచ్ చూస్తే అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి:
PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ
భార్యపై భర్త ఘాతుకం.. స్కూడ్రైవర్‌తో అతి కిరాతకంగా..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here