Glassdoor Review Costs Boss Job: ఆన్‌లైన్‌లో మాజీ ఉద్యోగి రివ్యూ.. బాస్ జీవితం తలకిందులు
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:21 PM
ఆన్‌లైన్‌లో మాజీ ఉద్యోగి పెట్టిన నెగెటివ్ రివ్యూ ఓ బాస్ కొంప ముంచింది. కొత్త ఉద్యోగులెవరూ చేరకపోవడంతో సంస్థ యాజమాన్యం సదరు బాస్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది.

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ఆన్‌లైన్ రివ్యూలకు ప్రాముఖ్యత పెరిగింది. నకిలీ రివ్యూల బెడద ఉన్నప్పటికీ అనేక మంది ఆన్‌లైన్ రివ్యూలను చదివాకే షాపింగ్ మొదలు అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఉద్యోగుల సంగతి సరేసరి. ఓ కంపెనీలో చేరాలా వద్దా అనేది నిర్ణయించుకునేందుకు కేవలం జీతనాతాలు, ఇతర సౌకర్యాలే కాకుండా కంపెనీకున్న ఇమేజ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఈ ట్రెండ్‌కు పరాకాష్ఠగా ఓ ఉదంతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో మాజీ ఉద్యోగి ఇచ్చిన ప్రతికూల రివ్యూ కారణంగా ఓ మేనేజర్ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇది ప్రస్తుతం తెగ సంచలనం కలిగిస్తోంది (glassdoor review costs boss job).
అసలు ఏం జరిగిందీ చెబుతూ గ్లాస్‌డోర్ వెబ్‌సైట్‌లో ఓ వ్యక్తి రాసుకొచ్చారు. ఓ సంస్థ తనను తొలగించాలక సంస్థ నాయకత్వాన్ని విమర్శిస్తూ వారి లోపాలను ఎత్తి చూపుతూ తానో పోస్టు పెట్టినట్టు సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు. ‘‘గతేడాది నా ఉద్యోగం పోయింది. దీంతో, గ్లాస్‌డోర్ రివ్యూ పోస్టు చేశాను. చాలా విమర్శనాత్మకంగా పోస్టు పెట్టాను. దీంతో, మరో ఉద్యోగి ఎవరూ జాబ్‌లో జాయిన్ అయ్యేందుకు ముందుకు రాలేదు’’ అని సదరు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ చెప్పుకొచ్చారు.
ఆ కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులందరూ తన రివ్యూలోని అంశాలను ప్రస్తావించారని ఆ వ్యక్తి తెలిపారు. దీంతో, ఏకంగా సంస్థ బోర్డు జోక్యం చేసుకుని సదరు మేనేజర్‌ను ఉద్యోగం నుంచి తొలగించిందని అన్నారు.
న్యూయార్క్‌లోని వర్కర్ అసోసియేషన్‌లో పని సంస్కృతిని విమర్శిస్తూ ఆ వ్యక్తి తన అభిప్రాయాలను నిష్కర్షగా పోస్టు పెట్టారు. తమకు సరైన శిక్షణ ఇవ్వకుండా, ఉద్యోగబాధ్యతలు భారంగా మారేలా చేశారని ఆరోపించారు. శిక్షణ లేకపోవడంతో ఉద్యోగులు పలు పొరపాట్లు చేసేవారని అన్నారు. మేనేజ్‌మెంట్‌కు సామర్థ్యం లేదని, అతిగా విమర్శిస్తూ విషపూరిత పని వాతావరణాన్ని సృష్టించిందని చెప్పారు. సంస్థలో వివిధ స్థాయిల్లో ఉద్యోగుల మధ్య సమాచారమార్పిడి కూడా సమర్థవంతంగా జరిగేది కాదని, ఫలితంగా అనేక సందర్భా్ల్లో తికమక నెలకొనేదని అన్నారు. ఇలా సంస్థలోని లోపాలన్నీ ఎత్తి చూపడంతో కొత్త ఉద్యోగులు ఎవరూ చేరలేదు. ఫలితంగా సంస్థ మేనేజరే ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..
రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు