Share News

ఆన్‌లైన్‌ అదృష్టం..

ABN , Publish Date - Mar 16 , 2025 | 10:44 AM

భూమ్మీద చక్కని పొదరింటికి చిరునామాగా తమ ఇల్లు ఉండాలని ప్రతి జంటా అనుకుంటారు. కాకపోతే పెళ్లైన కొత్తలో ఉన్న సంబరం క్రమంగా తగ్గినట్టుగా అనిపించడం సహజమే. సంసారం పెరగడం, బాధ్యతలు రెట్టింపు కావడం, అనారోగ్యాలు దరిచేరడం, ఆర్థిక మందగమనం, ఒత్తిళ్లు... ఇలా కారణాలు ఎన్నో.

ఆన్‌లైన్‌ అదృష్టం..

గుమ్మానికి గుమ్మడికాయ కడితే దిష్టి తగలదు. చూరుకు కలబంద కడితే ఇంటికి ఆరోగ్యం.. ఇవన్నీ అనాదిగా వస్తున్న భారతీయుల నమ్మకాలు. ఇందులో నిజమెంత? శాస్త్రీయత ఏమాత్రం? అని శల్యపరీక్ష చేయలేం కానీ.. కొన్ని నమ్మకాల వల్ల సానుకూల దృక్పథం కలుగుతుందన్నది మాత్రం మన పెద్దల విశ్వాసం. ఒక్క భారతీయులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలు రకరకాల వస్తువుల రూపంలో అదృష్టదేవతలను ఇంటికి తెచ్చుకుంటున్నారు. సాల్ట్‌ల్యాంప్‌, డ్రీమ్‌క్యాచర్‌, ఈవిల్‌ ఐ, లాఫింగ్‌ బుద్ధ తదితర వస్తువులు ఆధునికతరాన్ని ఆకర్షిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో తెగ అమ్ముడవుతున్నాయి...

భూమ్మీద చక్కని పొదరింటికి చిరునామాగా తమ ఇల్లు ఉండాలని ప్రతి జంటా అనుకుంటారు. కాకపోతే పెళ్లైన కొత్తలో ఉన్న సంబరం క్రమంగా తగ్గినట్టుగా అనిపించడం సహజమే. సంసారం పెరగడం, బాధ్యతలు రెట్టింపు కావడం, అనారోగ్యాలు దరిచేరడం, ఆర్థిక మందగమనం, ఒత్తిళ్లు... ఇలా కారణాలు ఎన్నో. అయితే ఇంట్లో కొన్ని వస్తువులను ఓ నిర్దిష్టమైన ప్రదేశంలో పెట్టడం వల్ల అదృష్టాన్ని మార్చుకోవచ్చని అంటున్నారు వాస్తు, ఫెంగ్‌షూయ్‌ నిపుణులు. ఇటీవల ‘గుడ్‌లక్‌’కు చిరునామాగా మారిన కొన్ని వస్తువులకు ఆన్‌లైన్‌లో గిరాకీ బాగా పెరిగింది.


జంట హంసలతో సఖ్యత...

మీది చూడచక్కని జంట. పెళ్లై పదేళ్లయినా మీ బంధం గట్టిగానే ఉంది. కాకపోతే ఇటీవల మీ భార్యాభర్తల మధ్య చిన్నచిన్న వాదనలే, చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి. తప్పు ఎవరిలోనూ లేదు. కానీ, ఆ క్షణం మాటకు మాట అనుకుని మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నారు. మీ సమస్యకు చక్కటి పరిష్కారం ‘స్వాన్‌పెయిర్‌’ అంటే జంట హంసలు. బెడ్‌రూమ్‌లో ఉత్తరం వైపున ఉన్న గోడకి ఈ చిత్తరువును తగిలిస్తే సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెబుతోంది వాస్తు శాస్త్రం. ఒకవేళ పటం దొరక్కపోయినా.. శిల్పం దొరికినా మంచిదే. జంట హంసలు ఇంటికి పాజిటివ్‌ ఎనర్జీని తీసుకువస్తాయి. దంపతుల మధ్య సఖ్యతనూ పెంచుతాయని అంటున్నారు పండితులు. ప్రజల్లో ఇదొక విశ్వాసంగా విస్తరిస్తోంది.

book4.2.jpg


గుర్రపు నాడాతో రక్షణ

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా.. ఏవో నమ్మకాలు, విశ్వాసాలు ఉండనే ఉంటాయి. ఐరిష్‌ గ్రామాల్లో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఓ సాధువు కొలిమిలో కాల్చిన గుర్రపునాడాతో పిశాచిని తరిమికొట్టాడట. అందుకే అక్కడ ప్రతి వీధి వాకిలికి ఇనుప గుర్రపు డెక్క వేలాడుతుంటుంది. ఇది క్రమక్రమంగా అన్ని దేశాలకూ పాకింది. ఇనుముతో చేసిన నల్ల గుర్రపు నాడా (హార్స్‌ షూ)ను వీధి వాకిలికి వేలాడదీయడం చాలా సమాజాల్లో నేడు ఓ ఆచారంగా మారింది. దీనివల్ల దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని విశ్వసిస్తున్నారు. అంతేకాదు అర్ధ చంద్రాకారంలో ఉండే గుర్రపు నాడా వల్ల ఐశ్వర్యమూ, సంతోషమూ సమకూరుతాయని కూడా నమ్ముతారు. మనసులో కోరుకున్న కోర్కెలు సైతం నెరవేరతాయని ఐరోపా వాసులు నమ్ముతారు. అందుకే ఏదైనా ముఖ్య కార్యంపైన బయలుదేరే ముందు గుర్రపునాడా దగ్గర ఓ క్షణం ఆగుతారు. తాము చేయాల్సిన పనుల గురించి ఒకసారి స్మరించుకుని వెళతారట. ప్రస్తుతం ఏడు రంధ్రాలు కలిగిన గుర్రపు నాడా ఉంగరాలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. దీన్నొక విశ్వాసంగానే భావించాలి. శాస్త్రీయ రుజువులేవీ లేవు.


ఉప్పుల్యాంప్‌తో భలే..

మీకు ఆస్తమా ఉందా? ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండడం లేదా? అయితే వెంటనే ‘సాల్ట్‌ల్యాంపును కొనండి. మీరు ఎక్కువ సమయం గడిపే హాలు లేదా బెడ్‌రూమ్‌లో పెట్టుకుని చూడండి. రెండు వారాలు కాగానే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అతి సహజమైన లవణం ఉప్పు. తన చుట్టూ నెగటివ్‌ అయాన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గాలిలోకి వెళ్లినప్పుడు శరీరం, మనసుపై పాజిటివ్‌ ప్రభావాన్ని చూపిస్తాయి. ఉప్పుల్యాంప్‌ వెలుగుతున్నప్పుడు అందులోంచి తేమ విడుదల అవుతుంది. ఇది గాల్లోని దుమ్ము, ధూళి, పుప్పొడి రేణువులు, ధూమపాన పొగను, జంతువుల నుండి రాలే బొచ్చును గ్రహించి.. గాలిని శుభ్రపరుస్తుంది. అంతే కాదు సముద్రతీరాలు, పర్వత లోయలు, నదుల్లో స్నానం చేసేప్పుడు మన శరీరం నెగిటివ్‌ అయాన్లకు లోనవుతుంది. అందుకే ఏదో తెలియని శక్తి, ఉత్సాహం మనలో ఉద్భవిస్తుంది. ఈ సాల్ట్‌ ల్యాంప్‌లు ఇలాంటి ప్రభావాన్నే చూపిస్తాయి. ఇవి నిద్రను మెరుగుపరుస్తాయి. ఎలకా్ట్రనిక్‌ డివైజ్‌లు ఉత్పత్తి చేసే ఎలకో్ట్రమాగ్నటిక్‌ రేడియేషన్‌ను సమతుల్యం చేస్తాయి. ఒక్క ఉప్పుల్యాంప్‌తో ఇన్ని లాభాలు ఉన్నాయి మరి.

book4.3.jpg


అదృష్ణ మార్జాలం

చైనా, జపాన్‌లలో షాపులు, రెస్టారెంట్లు, ఇళ్లలో రంగు రంగుల పిల్లి బొమ్మలను పెడతారు. ఇలాంటి పిల్లే మిగతా చోట్లా ఇప్పుడు కనిపిస్తోంది. చాలామంది దీనిని ‘చైనా పిల్లి’గా భ్రమపడతారు. కానీ ఈ పిల్లి జపాన్‌కు చెందినది. పేరు ‘మనేకి నీకో’. దీనికి సంబంధించిన ఓ చిన్న కథ జపాన్‌లో ప్రాచుర్యంలో ఉంది. 17వ శతాబ్దంలో లి నయోటాకా అనే స్థానిక రాజుపై పిడుగు పడకుండా అతని పెంపుడు పిల్లి ‘తామా’ రక్షించిందట. అప్పటి నుంచి ఆపదలో రక్షించే ఆపద్భాందవునిగా నిలిచిందా పిల్లి. అయితే కాలక్రమేణా పిల్లుల రంగును బట్టి .. నమ్మకాలు కూడా మారుతూ వచ్చాయి. తెల్ల పిల్లి అదృష్టానికి, ఆకుపచ్చది ఆరోగ్యానికి, ఎర్రనిది బంధాలను నిలబెట్టుకోవడానికి, బంగారు పిల్లి డబ్బు, ఐశ్వర్యానికి.. నల్లపిల్లి దిష్టి నివారణకు గుర్తుగా మారిపోయాయి.

book4.4.jpg


చెడ్డకలలపై...

అమెరికా ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా.. ఇప్పటికీ అక్కడ అనేక సంప్రదాయాలు, ఆచారాలు అలాగే ఉన్నాయి. అలా స్థానిక అమెరికన్‌ తెగల ఆచారాల నుంచి పుట్టినదే ‘డ్రీమ్‌ క్యాచర్‌’. ఇదే నేడు ప్రపంచమంతా పాకింది. ప్రతి ఇంట్లో నేడు విభిన్నమైన, వివిధ రంగుల డ్రీమ్‌ క్యాచర్లు కనిపిస్తున్నాయి. ఇవి అందానికి అందం, రక్షణకు రక్షణ. వలయాకృతిలో ఉన్న చెక్క ఫ్రేమ్‌కి దారాలను వేలాడదీసి, వాటికి రంగురంగుల ఈకలు, పూసలు, గవ్వలతో అందంగా అలంకరిస్తారు. రకరకాల సైజుల్లో ఉండే డ్రీమ్‌ క్యాచర్‌ వేలాడదీసిన గోడకు అందాన్ని తెస్తుంది. కళ్లను ఇట్టే ఆకర్షిస్తుంది. సాధారణంగా బెడ్‌రూమ్‌లో డ్రీమ్‌ క్యాచర్‌ని వేలాడదీస్తారు. నిద్రలో పీడకలలనే కాదు.. మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని ఈ డ్రీమ్‌ క్యాచర్‌ తొలగిస్తుందని అమెరికన్లు విశ్వసిస్తారు.


సానుకూలతను పెంచే గంటలు

గుడిలో గంట శబ్దం వినగానే మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఆ ధ్వనికి అంతటి మహత్యం ఉంది మరి. గుడిలోనే కాదు.. ఇంట్లో కూడా ఆ ధ్వనులు తరచూ వినిపిస్తే..? ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదూ!. అలా వచ్చిన మ్యాజిక్‌ బెల్స్‌ ‘విండ్‌ ఛైమ్స్‌’ గా పేరు తెచ్చుకున్నాయి. లోహం, కలప, గాజులతో చేసిన గొట్టాలు, గంటలు గాలికి కదులుతూ లయబద్ధంగా శబ్దం చేస్తుండటం వీటిలోని విశేషం. వినసొంపైన ఈ శబ్దాలు సానుకూల దృక్పథాన్ని కలుగజేస్తాయి. కుటుంబంలో కూడా ఒక రకమైన ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. ఇలాంటి బెల్స్‌ ఇంట్లో ఉంటే అదృష్టమని కొందరి నమ్మకం. గాలి గంటల శబ్ద తరంగాలు.. వాస్తు దోషాలను తొలగిస్తాయని విశ్వసిస్తున్నారు. ఆధునికతరం ఇష్టపడే గృహాలంకరణలో విండ్‌ ఛైమ్స్‌ ఓ భాగమయ్యాయి. కొన్ని దేశాల్లో సంప్రదాయంగా కొన్నేళ్ల నుంచి వస్తున్న వీటిని.. బాల్కనీ, వరండా, హాలు.. ఎక్కడైనా సరే సులభంగా అమర్చుకోవచ్చు. ఈ గంటల శబ్దం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. దాన్నే పాజిటివ్‌ ఎనర్జీగా అనుకోవచ్చు.

book4.5.jpg


దోష నివారణ కోసం

చీకూచింతాలేని కుటుంబం.. ముచ్చటైన పిల్లలు, చక్కని సంసారం.. మంచి ఉద్యోగం.. ఇదే మధ్యతరగతి ప్రపంచం. ఇలాంటి ఆనందలోకంలో ఉన్నప్పుడు ఏ దిష్టీ తమ ఇంటిపై పడకూడదని ప్రతి ఇల్లాలూ కోరుకుంటుంది. ఇలాంటి వారి కోసం రూపొందించినదే ‘ఈవిల్‌ ఐ’. మార్కెట్‌లో ఇది రకరకాల వస్తువులుగా దొరుకుతోంది. కీచెయిన్లు, గుమ్మాలకు తగిలించే అలంకరణ వస్తువులు, గోడలపై ఫ్రేమ్‌లుగా.. ఇలా పలు రకాలుగా ఈవిల్‌ ఐ జీవితాల్లోకి వచ్చేసింది. యువతులు సైతం జ్యువెలరీ రూపంలో కూడా దీనిని వాడుతున్నారు. ఇది ఈనాటిది కాదు.. అయిదు వేల ఏళ్ల క్రితమే మెసపటోమియా వాసులు దీన్ని వినియోగించారని చరిత్ర చెబుతోంది. తెల్లని కనుపాప చుట్టూ నీలి వలయంతో కనుగుడ్డులా కనిపించేదే ఈవిల్‌ ఐ. మార్కెట్లో రకరకాల రంగుల్లో లభిస్తున్నాయి. అయితే అన్నింటిలోకీ నీలి రంగుకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దక్షిణాసియా, యూరప్‌, ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా వీధి తలుపునకు దీన్ని వేలాడదీస్తున్నారు. ఇంకా హాల్లో టేబుల్‌, డెస్క్‌ల మీద పెడుతుంటారు. పూలకుండీల మీద డిజైన్‌లా కూడా వేస్తున్నారు. బ్రాస్‌లెట్‌, ఉంగరాలు, నెక్లెస్‌లు, చైన్ల రూపంలో ఈవిల్‌ ఐ జ్యువెలరీ లేటెస్ట్‌ ట్రెండ్‌గా మారింది.


ఏది కోరుకున్నా...

మంచి ఉద్యోగం రావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, త్వరలో ఇల్లు కట్టుకోవాలి... ఇలా కోరిక ఏదైయినా సరే తీర్చేందుకు సిద్ధంగా ఉండే ముచ్చటైన రూపం ‘లాఫింగ్‌ బుద్ధ’. నోటి నిండా నవ్వు, బోడి గుండు, బాణ బొజ్జ, బొద్దుగా ఉండే విగ్రహం ఈ బుద్ధుడిది. ఈ విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం, సమృద్ధి, సంతోషం సమకూరుతాయని ఫెంగ్‌షూయ్‌ తెలియజేస్తోంది. నిలుచుని, కూర్చుని, చేతిలో పాత్రతో, చుట్టూ పిల్లలతో, భుజమ్మీద మూటతో ఇలా అనేక రకాల లాఫింగ్‌ బుద్ధుడి విగ్రహాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఒక్కో ఆహార్యానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. వాటిని హాల్లో పెడితే కుటుంబసభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది, ఆఫీసులో పెట్టుకుంటే ఒత్తిళ్లు తగ్గి, పదోన్నతి లభిస్తుందని నమ్మేవాళ్లు ఎక్కువ.


తాబేలు కవచం

ఆర్థిక కష్టాలు మీ జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? పిల్లలు ఏకాగ్రత కోల్పోతున్నారా? ఫెంగుషూయ్‌ మీకు చక్కని తరుణోపాయాన్ని అందిస్తుంది. ఫెంగ్‌షూయ్‌ చేప్పే హెవెన్లీ జంతువుల్లో తాబేలు ఒకటి. ఇంట్లో తాబేలు బొమ్మను పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది, విద్యార్థులు వృద్ధిలోకి వస్తారు. ఇంట్లో సభ్యుల మధ్య సఖ్యత మెరుగవుతుంది. కేవలం ఓ అలంకరణ వస్తువుగానే కాకుండా ఇల్లంతా పాజిటివిటీని పెంచుతుంది ఈ తాబేలు బొమ్మ. గట్టి కవచంలా ఉండే తాబేలు డిప్ప రక్షణకు గుర్తు. వాటి జీవితకాలం ఎక్కువ. కాబట్టి ఇంట్లో అందరికీ రక్షణ, దీర్ఘాయువును తాబేలు ప్రసాదిస్తుందని అంటోంది చైనీయుల ఫెంగ్‌షూయ్‌. ఇంకా పాజిటివ్‌ ఎనర్జీని పెంచుతుంది. అందుకే కేవలం ఇళ్లలోనే కాదు ఆఫీసులలో కూడా తాబేలు బొమ్మలను ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. వీటిల్లో కూడా మెటల్‌, క్రిస్టల్‌, కలప, బంగారు పూత తదితరాలతో చేసిన తాబేలు బొమ్మలు మార్కెట్లో విశేషంగా కనిపిస్తున్నాయి.

ఇవన్నీ కేవలం నమ్మకాలు, విశ్వాసాలు మాత్రమే! వీటికి ఎలాంటి శాస్త్రీయత లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని ప్రజలు అనుసరించే సంప్రదాయాలు, సంస్కృతులలో నుంచే ఇలాంటి విశ్వాసాలు పుట్టుకొచ్చాయని చెప్పొచ్చు.

- సండే డెస్క్‌


అమ్మకాల జోరు

ఇంటి అలంకరణకు సంబంధించి ఆన్‌లైన్‌ మార్కెట్‌లో గుడ్‌లక్‌ వస్తువులే ఎక్కువగా అమ్ముడవుతున్నాయని వివిధ సర్వేలు తెలియజేస్తున్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఇదే ట్రెండ్‌. ఆధునిక జీవనం తెచ్చిన ఉరుకుల పరుగుల జీవితంలో మనశ్శాంతి కోసం ఏ చిట్కా చెప్పినా ఫాలో అవుతున్నారు. అయిదు వేల ఏళ్లక్రితం మెసపటోమియా నాగరికతలో కనిపించిన ఈవిల్‌ ఐ నేడు ఇంట్లోకి వచ్చేసింది. చైనాలో పుట్టిన ఫెంగ్‌షూయ్‌ని అంతా నమ్ముతున్నారు. ఐరిష్‌ గ్రామాల్లోని గుర్రపు నాడా, నేటివ్‌ అమెరికన్ల డ్రీమ్‌ క్యాచర్లు ... ఇంటర్నెట్‌ పుణ్యమా అని సుదూర ప్రాంతాల సంస్కృతులు, ఆచార వ్యవహారాలు అందరికీ తెలిసిపోతున్నాయి. పైగా ఇవన్నీ ఆన్‌లైన్‌ మార్కెట్లో అందుబాటులోకి రావడంతో వాటి అమ్మకాలు పెరిగిపోయాయి. స్టయిల్‌తో పాటు సానుకూల వాతావరణానికి ఈ వస్తువులు ఎంతో కొంత దోహదం చేస్తాయని నవతరం విశ్వసిస్తున్నారని చెప్పడానికి ఇదో నిదర్శనం.

Updated Date - Mar 16 , 2025 | 10:44 AM