Online shopping: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు.. ఈ చిన్న తప్పు చేస్తే మీ పర్సు ఖాళీ..
ABN, Publish Date - Jan 19 , 2025 | 04:26 PM
ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే అలవాటుందా. ఈ చిన్న తప్పు కారణంగా మీ పర్సు ఖాళీ అయ్యే ప్రమాదముంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి..

ఒకప్పుడు ఏ వస్తువు కావాలన్నా బజారుకే వెళ్లి కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు. ఫుడ్, ఫర్నిచర్, కూరగాయలు, సరుకులు, బట్టలు, మెడిసిన్స్, ఇలా ఏవైనా యాప్‌లో ఆర్డర్ పెడితే చాలు. చిటికెలో డోర్ డెలివరీ చేస్తున్నారు. రకరకాల ఆఫర్స్ కూడా షాపింగ్ చేసేలా అందరినీ ఊరిస్తూ ఉంటాయి. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్ యాప్స్‌లో వస్తువుల ధరలు ఎలా ఉన్నాయని చెక్ చేయడం కొందరికి అలవాటు. ఈ విషయం పక్కన పెడితే, ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా లాభాలే కాదు. నష్టాలూ ఉన్నాయి. ఎందుకంటే, మన బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత వివరాలు, అడ్రస్, ఇలా ప్రతిదీ యాప్‌తో లింక్ అయ్యుంటాయి. ఇదే హ్యాకర్స్, స్కామర్స్‌కు వరంలా మారింది. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. అందుకే మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి..
షాపింగ్ యాప్స్‌లో వ్యక్తిగత డేటా, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పాస్‌వర్డ్‌లు ఇలా సమస్తం సేవ్ చేస్తాం. అందుకే, వీటిపై కన్నేసారు హ్యాకర్లు. ఫిషింగ్ అటాక్స్, మాల్‌వేర్లు ఈ సైట్లలో చొప్పించి కస్టమర్ల వివరాలు ఈజీగా సేకరిస్తున్నారు. కొత్త కొత్త దారులతో వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. కాస్త నిర్లక్ష్యం వహించినా ఫేక్ వెబ్‌సైట్లు లేదా ఫిషింగ్ ఈమెయిల్స్ ద్వారా మోసం చేస్తూ క్రెడిట్ కార్డుల వివరాలు సంపాదిస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రముఖ షాపింగ్ యాప్‌లో లోన్ శాంక్షన్ చేయడానికి ఇలా చేయండంటూ ఓ కస్టమర్ ఖాతా మొత్తం కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. అందుకే, నమ్మకమైన వెబ్‌సైట్లే వాడుతున్నప్పటికీ వ్యక్తిగత వివరాలు షేర్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి..
ఏటికేడు భారతదేశంలో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇన్‌స్టాల్‌మెంట్లు, ప్రత్యేక సీజన్లలో ఆఫర్లు ప్రతి వ్యక్తి ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీ పాటు సైబర్ మోసాలు అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. కాబట్టి, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఈ విషయాలు మర్చిపోవద్దు.
వెబ్‌సైట్ నకిలీదేమో గమనించండి..
ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఈ విషయం తప్పక గుర్తుంచుకోవాలి. షాపింగ్ చేస్తున్న సైట్ లేదా యాప్ సరైనదో కాదో పరిశీలించడం అవసరం. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ప్రముఖ షాపింగ్ యాప్‌లనే పోలిన నకిలీ వెబ్‌సైట్ల సృష్టించి వినియోగదారులను తప్పు దోవ పట్టిస్తున్నారు. పొరపాటున మీ వివరాలు అలాంటి సైట్లలో నమోదు చేస్తే మీ డబ్బుకు రెక్కలు వచ్చినట్టే. కాబట్టి, నమ్మకమైన సైట్లనే వాడండి. వస్తువులు ఆర్డర్ చేసే ముందు, డబ్బులు చెల్లించే సమయంలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. ఈ రెండు విషయాల ద్వారా సైట్ ప్రామాణికతను తెలుసుకోవచ్చు. సైట్ తప్పనిసరిగా httpsతో ప్రారంభమవ్వాలి. ముగింపులో .in లేదా .com అని ఉందేమో గమనించండి.
తెలియని సైట్‌లో షాపింగ్ చేస్తున్నట్లయితే, ఎట్టి పరిస్థితుల్లో మీ బ్యాంకు ఖాతా వివరాలు బయటపెట్టకండి. ఆర్టర్ చేసేటప్పుడు చెల్లింపు వివరాలు అస్సలు సేవ్ చేయకండి. ఒకవేళ హ్యాక్ చేస్తే మీ బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ చేతిలోకి వెళ్లే ప్రమాదముంది. ఆన్‌లైన్ పేమెంట్ బదులుగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటే మరీ మంచిది. ముఖ్యంగా ఫేక్ సైట్స్ విషయంలో జాగ్రత్త.
Updated Date - Jan 19 , 2025 | 04:28 PM