Viral News : ఈ ఊళ్లో వాళ్లకు పేర్లుండవు.. ఎలా పిలుచుకుంటారో తెలుసా..
ABN, Publish Date - Jan 11 , 2025 | 05:24 PM
పుట్టిన ప్రతి మనిషికీ తప్పకుండా పేరుంటుంది. ఇదే అందరి నమ్మకం. కానీ, ఓ వింత గ్రామంలో ఎవరికీ పేర్లు ఉండవు. మరి, వాళ్లు ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా..
పుట్టిన ప్రతి మనిషికీ తప్పకుండా పేరుంటుంది. ఇదే అందరి నమ్మకం. ఒక వ్యక్తికి గుర్తింపునిచ్చేది పేరే. అదే లేకపోతే సమాజంలో బతకడం సవాలే. ఎందుకంటే, పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ పేరు లేని మనిషిలా జీవించడం అంత సులువు కాదు. ఇదంతా ఎందుకు చెబుతున్నారు.. పేరు లేకుండా ఎవరైనా ఉంటారా అనుకోవచ్చు. కానీ, ఆ గ్రామంలో నివసించే ప్రజల్లో ఏ ఒక్కరికీ పేరుండదు. ఇదెక్కడుందో చెబితే ఆశ్చర్యపోతారు. ఈ వింత గ్రామం ఉండేది మన భారతదేశంలోనే. పిల్లలకు నామకరణం చేయడాన్ని పండగలా నిర్వహించుకునే మన దేశంలో ఇలాంటి పల్లె ఒకటుందని నమ్మడం వింతగా అనిపించినా ఇదే నిజం. వాస్తవంగా ఒక వ్యక్తికి పేరు లేకపోతే ఐడెంటిటీ కార్డులు ఉండవు. ఆధార్ కార్డు అయితే అన్ని చోట్లా తప్పనిసరి. చదివినా, చదవకపోయినా ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు పత్రం ఉండటం మామూలు విషయం. ఈశాన్య రాష్ట్రంలోని ఈ ఊర్లో మాత్రం పేరు లేకపోయినా హాయిగా జీవిస్తున్నారు. అయితే, వారు పేరుకు బదులుగా ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా..
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని ఈ వింత గ్రామం పేరు కోంగ్‌థాంగ్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి 60 కి.మీ దూరంలో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఉంది. ఈ గ్రామంలో బిడ్డ పుట్టగానే వాళ్ల అమ్మ ఒక రాగం వాయిస్తుంది. ఆ రాగమే వాళ్ల పేరు అవుతుంది. రాగంతో ఎలా పిలుస్తారు అనుకోవచ్చు. అదే నిజం. కొంగ్‌థాంగ్ గ్రామంలోని ప్రజలు ఒకరినొకరు పేర్లకు బదులుగా రాగం లేదా పాటలతోనే పిలుచుకుంటారు. ఈ ట్యూన్‌ని ‘జింగార్‌వై లవ్బీ’ అని అంటారు. కొంగ్‌థాంగ్ ప్రజలు తోటి గ్రామస్థులకు సందేశాలు చేరేవేసేందుకైతే ఈలలు వేస్తారు. అందుకే ఈ ప్రాంతానికి ‘విజిల్ విలేజ్’ అనే పేరు వచ్చింది.
700 మందికి.. 700 రాగాలు..
కొంగ్‌థాంగ్ గ్రామంలో దాదాపు 700 మంది ప్రజలు జీవిస్తున్నారు. వీరంతా ఫైవ్‌స్టార్ ఖోంగ్‌సిట్, ఖాసీ తెగకు చెందిన వారు.ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికీ ఒక్కో రాగం పేరుగా ఉంటుంది. ఈ గ్రామస్థులను పిలవడానికి ఉపయోగించే ‘ట్యూన్’ బిడ్డ పుట్టిన తర్వాత తల్లులే తయారుచేస్తారు. ఇక్కడి వారికి రెండు పేర్లుంటాయి. ఒకటి సాధారణ పేరు.. మరొకటి పాట పేరు. పాటల పేర్లకు రెండు వెర్షన్లు ఉన్నాయి.. పొడవైన పాట.. చిన్న పాట. చిన్న పాటలను ఇంట్లో వాళ్లు.. పొడవైన పాటలను బయటి వ్యక్తులు ఉపయోగిస్తారు. ఈ గ్రామస్థుల్లో ఎవరైనా మరణిస్తే వారితో పాటే ఆ వ్యక్తికి ఉన్న రాగామూ మరణిస్తుంది.
ఈ రాగాల పేర్లే మాకిష్టం..
ఊర్లో లేదా ఇంట్లో పిల్లల్ని పిలవాలంటే చిన్నరాగం ఆలపిస్తూ పిలుస్తారు కొంగ్‌థాంగ్ గ్రామస్థులు. అమ్మ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ అంటే ఇక్కడివారికి చాలా ఇష్టం. తరతరాలుగా ఈ రాగాల పేర్లతోనే జీవితాంతం పిలుచుకుంటున్నారు ఇక్కడివారు. ఈ వ్యవస్థ ఎప్పుడు మొదలైందీ కొంగ్‌థాంగ్ గ్రామస్థులకే తెలియదు. అయినా, తమ పేరుని రాగంతో పిలుచుకోవడం అంటేనే వీరికి సంతోషం అంట.
Updated Date - Jan 11 , 2025 | 05:24 PM