Train Ticket Auto Upgradation: స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీలో ప్రయాణం.. రూపాయి ఖర్చు లేకుండా
ABN , Publish Date - Feb 26 , 2025 | 09:43 AM
స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణించే అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోంది. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానానికి సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. అన్ని సందర్భాల్లో ఈ విధమైన సదుపాయం అందుబాటులో ఉండదు.

దూరప్రాంతాలకు తక్కువ ఖర్చుతో చేరుకోవడానికి ఎక్కువమంది రైలులో ప్రయాణం చేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తమ బెర్తు లేదా సీటు రిజర్వు చేసుకోవడం సర్వసాధారణం. రైలులో వివిధ తరగతులు అందుబాటులో ఉంటాయి. స్లీపర్ క్లాస్, ఎసీ బెర్తు లేదా సీట్లు అందుబాటులో ఉండగా ఏసీలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఇలా మూడు నుంచి నాలుగు తరగతులు ఉంటాయి. స్లీపర్ క్లాస్ టికెట్ ధర తక్కువుగా ఉంటుంది. ఏసీ మనం ఎంచుకున్న తరగతి ఆధారంగా ధర ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు స్లీపర్ క్లాస్‌లో ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎగువ మధ్యతరగతి ప్రజలు థర్డ్ ఏసీలో ప్రయాణిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏసీ టికెట్ తీసుకోకుండానే స్లీపర్ క్లాస్ టికెట్‌తో అదనంగా ఒక పైసా ఖర్చు లేకుండా ఏసీ క్లాస్‌లో ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం ఎవరికి అందుబాటులో ఉంటుంది. ఏ సందర్భంలో స్లీపర్ క్లాస్ టికెట్ ప్రయాణీకులు ఏసీలో ప్రయాణం చేయవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ ఆప్షన్ ఎంచుకుంటేనే..
స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత తమకు ముందుగా కేటాయించిన బెర్తు లేదా సీటు వద్దకు వెళ్తే.. అప్పటికే అక్కడికి మరొకరు వచ్చి ఇది తమ బెర్తు లేదా సీటని కూర్చున్న సందర్భాలు అప్పుడప్పుడు చూస్తుంటాం. అలాంటి సమయంలో తమకు కేటాయించిన బెర్తు మరొకరికి ఎలా ఇచ్చారు.. ఇది అసాధ్యం కదా అంటూ తోటి ప్రయాణికుడితో తగదా పడే సందర్భాలు చూస్తుంటాం. వాస్తవానికి ముందుగా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకుడికి ఒక కోచ్‌లో బెర్తు కేటాయించిన తర్వాత ఆటో అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో తనకు ఏసీ కోచ్‌లో బెర్తు కేటాయిస్తే.. ముందుగా తనకు కేటాయించిన బెర్తును వేరే ప్రయాణికుడికి కేటాయించే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో చార్ట్ తయారైన తర్వాత మన పిఎన్‌ఆర్ నెంబర్ ద్వారా మనకు కేటాయించిన బెర్తు లేదా సీటు వివరాలు తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈ ఆటో అప్‌గ్రేడేషన్ ప్రక్రియ స్లీపర్ క్లాస్ నుంచి థర్డ్ ఏసీ, ధర్డ్ ఏసీ నుంచి సెంకండ్ ఏసీ వరకు ఉంటుంది. స్లీపర్ క్లాస్‌లో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువుగా ఉండి, చార్ట్ తయారీ సమయానికి ఏసీ క్లాస్‌లో బెర్తులు ఖాళీగా ఉంటే.. ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకున్న ప్రయాణీకులకు స్లీపర్ నుంచి ఏసీ తరతగతిలో బెర్తు కేటాయిస్తారు. దీని ద్వారా స్లీపర్ క్లాస్‌లో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకులకు బెర్తు లేదా సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది.ఈ ఆటో అప్‌గ్రేడ్ కోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. చార్ట్ ప్రిపరేషన్ సమయంలో ఆటోమేటిక్‌గా ఈ ప్రక్రియ జరుగుతుంది.
ఎవరెవరికి..
ఈ ఆటో అప్‌గ్రేడేషన్ కోసం కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆటో అప్‌గ్రేడేషన్ అనే ఆప్షన్‌ను ఎంచుకున్న వారు ఈ ప్రక్రియకు అర్హులు. అదే సమయంలో టికెట్ పూర్తి రుసుము చెల్లించే ప్రయాణికులు మాత్రమే ఆటో అప్‌గ్రేడేషన్‌కు అర్హత సాధిస్తారు. రాయితీ టికెట్లకు ఇది వర్తించదు. సీనియర్ సిటిజన్, మహిళలు ఇలా ప్రత్యేకమైన కోటా ద్వారా రాయితీలు పొందితే వారికి ఈ విధానం వర్తించదు. భారతీయ రైల్వే నిర్ణయించిన మేరకు పూర్తిస్థాయి రుసుము చెల్లిస్తే ఆటో అప్‌గ్రేడేషన్ ప్రక్రియ ద్వారా బెర్తు, సీటు పొందేందుకు అవకాశం ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here