Ranji Trophy: కోహ్లీ పైకి దూసుకొచ్చిన అభిమాని.. గల్లా పట్టి..
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:45 PM
Delhi vs Railways: రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీని చూసేందుకు వేలాదిగా స్టేడియానికి కదులుతున్నారు అభిమానులు. దీంతో మైదానం కాస్తా జనసంద్రంగా మారింది.

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఆడుతున్నాడంటే స్టేడియాలు జనసంద్రంలా మారడం సర్వసాధారణమే. అది ఇంటర్నేషనల్ మ్యాచైనా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచైనా కింగ్ కోసం అభిమానులు తండోపతండాలుగా కదులుతారు. అతడి జట్టుకు మద్దతు ఇస్తారు. విరాట్ బ్యాటింగ్ చేస్తుంటే కోహ్లీ.. కోహ్లీ నామస్మరణతో మైదానాన్ని దద్దరిల్లేలా చేస్తారు. ఇవాళ కూడా అదే జరిగింది. రంజీ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా స్టార్‌ను చూసేందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి వేలాదిగా తరలివచ్చారు జనం. అయితే ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కింగ్ మీదకు ఓ అభిమాని దూసుకొచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
సెక్యూరిటీ దాటి..
13 ఏళ్ల తర్వాత సొంత జట్టు ఢిల్లీ తరఫున రంజీ బరిలోకి కోహ్లీ దిగుతున్నాడని తెలిసి అభిమానులు ఫిరోజ్ షా కోట్లాకు భారీగా తరలివచ్చారు. టికెట్లు ఉచితంగా ఇవ్వడంతో పిల్లల నుంచి పెద్దల వరకు అంతా స్టేడియం ముందు క్యూ కట్టారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో మైదానం కోహ్లీ సేనలా అనిపించింది. అయితే ఈ జోష్‌లో ఓ ఫ్యాన్ విరాట్ వైపు వేగంగా దూసుకొచ్చాడు. సెక్యూరిటీని దాటి గ్రౌండ్‌లో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న చోటుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు.
ఆపినా ఆగలేదు!
చేతిలో ఫోన్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ యువకుడు కోహ్లీ కాళ్ల మీద పడ్డాడు. విరాట్ ఆపుతున్నా ఆగకుండా నమస్కారం చేశాడు. సెల్ఫీ దిగాలంటూ కోరాడు. అయితే అదే సమయంలో అక్కడికి చేరుకున్న సెక్యూరిటీ అతడ్ని కాలర్ పట్టుకొని లాక్కెళ్లారు. యువకుడ్ని ఏమీ చేయొద్దంటూ కోహ్లీ కోరినా.. భద్రతా సిబ్బంది అతడితో కాస్త కఠినంగానే ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ ప్రస్తుతం 5 వికెట్లకు 132 పరుగులతో ఉంది.
ఇదీ చదవండి:
జనమా.. బంతిపూల వనమా.. కోహ్లీ క్రేజ్
అర్జున్ పాయింట్ పంచుకున్నాడు!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి